సాక్షి, అమరావతి బ్యూరో: ‘మంగళగిరిలో పోలింగ్ ముగిసింది. ఉదయం 6 గంటలకే ఓటర్లు బారులు తీరారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు సిబ్బంది పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటుచేశారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు పోలింగ్‌ను పర్యవేక్షించారు. తాడేపల్లిలో నారా లోకేశ్ బాబు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు’.. ఇదేంటి, ఏప్రిల్ 11న కదా పోలింగ్ అని అనుకుంటున్నారా? అవును నిజమే. కానీ, సోషల్ మీడియా వేదికగా నారా లోకేశ్‌పై విపరీతంగా ఇలా ట్రోలింగ్ జరుగుతోంది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా లోకేశ్ ఇటీవల.. ఏప్రిల్ 9న ఓటింగ్ జరగనుందని.. తనకు ఓటువేసి గెలిపించాలని వ్యాఖ్యానించి అడ్డంగా బుక్కయ్యారు. దీంతో మంగళవారం.. ‘మంగళగిరిలో పోలింగ్ ప్రారంభమైందని.. అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారని.. లోకేశ్‌కు ఓటు వేసేందుకు కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది’.. అంటూ నెటిజన్లు విపరీతంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఏప్రిల్ 11న మా ఓటు ఫ్యాన్‌కే!
కాగా, లోకేశ్ విజ్ఞప్తి మేరకు ఏప్రిల్ 9న ఆయనకు ఓటేశామని.. ఏప్రిల్ 11న జరిగే పోలింగ్‌లో తమ ఓటు ఫ్యాన్‌కే అని మంగళగిరి యువత ఫేస్‌బుక్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. మంగళగిరిలో టీడీపీ అభ్యర్థిగా లోకేశ్ ప్రచారం ప్రారంభించినప్పటి నుంచి ఆయన అనేకసార్లు తన అవగాహనా రాహిత్యాన్ని, అజ్ఞానాన్ని చాటుకున్నారు. మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మరణ వార్త విని పరవశించా అన్న మాటతో మొదలై ఏప్రిల్ 9న పోలింగ్.. మార్చి 23న కౌంటింగ్‌తో ముగిశాయి. అలాగే, మచిలీపట్నం పోర్టును తెలంగాణకు తరలించుకుపోయేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని.. మంగళగిరిలో తనకు ఐదు లక్షల మెజారిటీ వస్తుందని ప్రకటించుకుని అభాసుపాలయ్యారు. అంతేకాక.. మే 23కు బదులు మార్చి 23న కౌంటింగ్ పూర్తవుతుందని ఆ తర్వాత నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని చెప్పి నవ్వులపాలయ్యారు.
వీడియోలు, ఫొటోలు తీయకుండా అడ్డగింత
ఇదిలా ఉంటే.. లోకేశ్ ప్రచారం చేస్తున్న ప్రతీచోటా ఆయన్ను ప్రజలు నిలదీస్తున్నారు. రుణాలు మాఫీ కావడంలేదని, రోడ్లు లేవని, డ్రైనేజీ సమస్యను పరిష్కరించలేదని, ఇలా సమస్యలతో ఆయనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. దీంతో ఆ సమయంలో మీడియా ప్రతినిధులు సహా ఇతరులెవరూ ఫొటోలు, వీడియోలు తీయకుండా ఆ పార్టీ నేతలు అడ్డుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment