హోషియార్‌పూర్‌లో మోదీ, బాదల్
రోహతక్: సిక్కుల ఊచకోత ఉదంతంపై కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ స్వభావాన్ని, లక్షణాన్ని తెలియజేస్తున్నాయంటూ ప్రధాని మోదీ అన్నారు. ‘1984లో అయ్యిందేదో అయిపోయింది. ఇప్పుడేంటి?’ అని పిట్రోడా వ్యాఖ్యానించడం తెల్సిందే. మోదీ హరియాణాలోని రోహ్‌తక్, హిమాచల్ ప్రదేశ్‌లోని మండిల్లో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ‘కాంగ్రెస్ పార్టీ మనుషులు ఎంత దురహంకారులో పిట్రోడా చెప్పిన ఒక్క మాటలో తెలిసిపోయింది. ఈ మాటలే కాంగ్రెస్ గుణం, ఉద్దేశం’ అని మోదీ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు.
వాళ్లకు ప్రాణమంటే విలువలేదు
కాంగ్రెస్ పార్టీ మనుషులకు ప్రాణం అంటే అసలు విలువే లేదనీ, మనిషిని వాళ్లు ఎప్పుడూ మనిషిగా గుర్తించరంటూ కాంగ్రెస్‌పై మోదీ మాటల దాడి చేశారు. ఒక్క ఢిల్లీలోనే 1984లో 2,800 మందికి పైగా సిక్కులను ఊచకోత కోశారనీ, మిగిలిన చోట్ల కూడా ఈ హత్యలు జరిగాయని మోదీ అన్నారు. శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై సోనియా, రాహుల్‌లు దేశప్రజలకు క్షమాపణ చెప్పాలని పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ మిత్రపక్షాల నేతలు డిమాండ్ చేశారు.
విడదీయాలనుకుంటున్నారు: పిట్రోడా
తన మాటల్లో బీజేపీ పెడార్థాన్ని తీస్తోందనీ, వాస్తవాలను పక్కదోవ పట్టించి, వారి వైఫల్యాలను మరుగుపరిచి, కాంగ్రెస్ నుంచి తనను విడదీసేందుకే ఆ పార్టీ ఇలా చేస్తోందని పిట్రోడా ఆరోపించారు. గతంలో జరిగిన విషయాలకు, ప్రస్తుత ఎన్నికలకు సంబంధం లేదని పిట్రోడా అన్నారు.
పిట్రోడా క్షమాపణ చెప్పాల్సిందే: రాహుల్
న్యూఢిల్లీ: సిక్కుల ఊచకోతపై వ్యాఖ్యలకు శామ్ పిట్రోడా క్షమాపణ చెప్పాల్సిందేనని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ అన్నారు. ‘పిట్రోడా మాటఅనుచితం, గర్హనీయం. నేను ఆయనతో ఈ విషయమై నేరుగా మాట్లాడతాను. ఆయన కచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే’ అని రాహుల్ అన్నారు. 1984 నాటి సిక్కుల ఊచకోత ఘటన ఎంతో విషాదకరమైనదనీ, తీవ్ర బాధను కలిగించిందని, బాధితులకు న్యాయం జరగడంతోపాటు నేరస్తులను శిక్షించాలని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment