Sikh riots
-
ఆ వ్యాఖ్యలే కాంగ్రెస్ స్వభావం
రోహతక్: సిక్కుల ఊచకోత ఉదంతంపై కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ స్వభావాన్ని, లక్షణాన్ని తెలియజేస్తున్నాయంటూ ప్రధాని మోదీ అన్నారు. ‘1984లో అయ్యిందేదో అయిపోయింది. ఇప్పుడేంటి?’ అని పిట్రోడా వ్యాఖ్యానించడం తెల్సిందే. మోదీ హరియాణాలోని రోహ్తక్, హిమాచల్ ప్రదేశ్‌లోని మండిల్లో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ‘కాంగ్రెస్ పార్టీ మనుషులు ఎంత దురహంకారులో పిట్రోడా చెప్పిన ఒక్క మాటలో తెలిసిపోయింది. ఈ మాటలే కాంగ్రెస్ గుణం, ఉద్దేశం’ అని మోదీ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. వాళ్లకు ప్రాణమంటే విలువలేదు కాంగ్రెస్ పార్టీ మనుషులకు ప్రాణం అంటే అసలు విలువే లేదనీ, మనిషిని వాళ్లు ఎప్పుడూ మనిషిగా గుర్తించరంటూ కాంగ్రెస్‌పై మోదీ మాటల దాడి చేశారు. ఒక్క ఢిల్లీలోనే 1984లో 2,800 మందికి పైగా సిక్కులను ఊచకోత కోశారనీ, మిగిలిన చోట్ల కూడా ఈ హత్యలు జరిగాయని మోదీ అన్నారు. శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై సోనియా, రాహుల్‌లు దేశప్రజలకు క్షమాపణ చెప్పాలని పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ మిత్రపక్షాల నేతలు డిమాండ్ చేశారు. విడదీయాలనుకుంటున్నారు: పిట్రోడా తన మాటల్లో బీజేపీ పెడార్థాన్ని తీస్తోందనీ, వాస్తవాలను పక్కదోవ పట్టించి, వారి వైఫల్యాలను మరుగుపరిచి, కాంగ్రెస్ నుంచి తనను విడదీసేందుకే ఆ పార్టీ ఇలా చేస్తోందని పిట్రోడా ఆరోపించారు. గతంలో జరిగిన విషయాలకు, ప్రస్తుత ఎన్నికలకు సంబంధం లేదని పిట్రోడా అన్నారు. పిట్రోడా క్షమాపణ చెప్పాల్సిందే: రాహుల్ న్యూఢిల్లీ: సిక్కుల ఊచకోతపై వ్యాఖ్యలకు శామ్ పిట్రోడా క్షమాపణ చెప్పాల్సిందేనని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ అన్నారు. ‘పిట్రోడా మాటఅనుచితం, గర్హనీయం. నేను ఆయనతో ఈ విషయమై నేరుగా మాట్లాడతాను. ఆయన కచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే’ అని రాహుల్ అన్నారు. 1984 నాటి సిక్కుల ఊచకోత ఘటన ఎంతో విషాదకరమైనదనీ, తీవ్ర బాధను కలిగించిందని, బాధితులకు న్యాయం జరగడంతోపాటు నేరస్తులను శిక్షించాలని ఆయన పేర్కొన్నారు. -
ఆ పోలికేమిటో ఆయనకే తెలియాలి?
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో గోరక్షణ పేరిట జరుగుతున్న మూక హత్యలపై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం నాడు పార్లమెంట్లో మాట్లాడుతూ ఈ మూక హత్యలు ఇప్పుడు కొత్తగా ప్రారంభం అయినవి కావని, 1984లోనే భారీ ఎత్తున మూక హత్యలు జరిగాయని ఆరోపించారు. ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ హత్యానంతరం సిక్కులకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన అల్లర్లకు గోరక్షకుల పేరిట నేడు ముస్లింలపై జరుగుతున్న మూక హత్యలకు పోలికేమిటో ఆయనకే తెలియాలి. బీజేపీ పాలిత రాష్ట్రంలోగానీ, బీజేపీ పాలిత కేంద్రంలోగానీ ఎలాంటి దారుణాలు జరిగినా 1984 నాటి అల్లర్లనే బీజేపీ నాయకులు ప్రస్థావిస్తారు. 2002లో గుజరాత్లో జరిగిన ముస్లింల ఊచకోతను సమర్థించుకోవడానికి 1984లో కాంగ్రెస్ హయాంలో జరిగిన అల్లర్ల గురించే మాట్లాడారు. మళ్లీ ఇప్పుడు అదే మాట మాట్లాడుతున్నారు. 2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఒకటి, అర తప్పించి గోరక్షణ దాడులు పెద్దగా లేవని, మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే పెరిగాయని ‘ఇండియాస్పెండ్ (డేటా జర్నలిజం సంస్థ)’ సేకరించిన డేటానే తెలియజేస్తోంది. 2010 నుంచి 2017 వరకు గోరక్షణ పేరిట జరిగిన దాడుల్లో 97 శాతం దాడులు మోదీ ప్రభుత్వం వచ్చాకే జరిగాయని, వాటిలో యాభై శాతం దాడులు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే జరిగాయని ఇండియాస్పెండ్ ఓ నివేదికలో పేర్కొంది. దాడుల్లో కూడా 90 శాతం దాడులు కేవలం గోవులను కబేళాలకు తరలిస్తున్నారనే అనుమానంపైనే జరిగాయి. పిల్లల కిడ్నాపర్లనుకొని ప్రస్తుతం మూక హత్యలు ఎలా జరుగుతున్నాయో అలాగే. ఈ అమానుష దాడులను ఎలా అరికట్టాలో, అందుకు తీసుకోవల్సిన చర్యలేమిటో ఆలోచించకుండా ముస్లింలు గోమాంసం మానేసే వరకు ఇలాంటి దాడులు జరుగుతాయని ఓ రాజస్థాన్ మంత్రి వ్యాఖ్యానించడం, అవునంటూ ఆరెస్సెస్ నాయకులు ఆయన్ని సమర్థించడం ఏ మేరకు సబబు? దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి కూడా ముస్లింలు గోమాంసం తింటున్నారుకదా, ఇన్నేళ్లు ఎందుకు జరగలేదు? జార్ఖండ్‌లో పశువుల వ్యాపారిని హత్య చేసిన కేసులో శిక్ష పడిన ఎనిమిది మంది దోషులకు లీగల్ ఫీజులు చెల్లించడమే కాకుండా వారు ఇటీవల బెయిల్‌పై విడుదలయితే ఇంటికి పిలిపించి వారిని కేంద్ర మంత్రి సత్కరించడం, జూన్ నెలలో మూక హత్య కేసులోనే నలుగురు నిందితులకు అవసరమైన లీగల్ ఫీజులను జార్ఖండ్‌కు చెందిన మరో బీజేపీ ఎంపీ చెల్లించడం లాంటి అంశాలు దాడులు ఎందుకు జరుగుతున్నాయో సూచిస్తున్నాయి. -
ఇందిరాగాంధీ హత్య రోజు ఏం జరిగిందీ?
న్యూఢిల్లీ: సరిగ్గా ఈ రోజుకు 32 సంవత్సరాల క్రితం దేశ చరిత్రలో ఏం జరిగిందో అందరికి గుర్తుండే ఉంటుంది. అంటే 1984, అక్టోబర్ 31వ తేదీన మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీని ఆమె ఇద్దరు సిక్కు బాడీ గార్డులు కాల్చి చంపారు. పర్యవసానంగా ముందు ఢిల్లీలో, ఆ తర్వాత దేశవ్యాప్తంగా సిక్కులకు వ్యతిరేకంగా అల్లర్లు చెలరేగాయి. కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం ఒక్క ఢిల్లీ నగరంలోనే 2,100 మంది సిక్కులు ఊచకోతకు గురికాగా, దేశవ్యాప్తంగా 2,800 మంది ఊచకోతకు గురయ్యారు. అనధికార లెక్కల ప్రకారం ఒక్క ఢిల్లీలో మూడువేల మంది సిక్కులు, దేశవ్యాప్తంగా 8 వేల మంది సిక్కులు ఊచకోతకు గురయ్యారన్నది అంచనా. ఆ రోజు సఫ్దార్జంగ్ రోడ్డులోని తన అధికార నివాసం నుంచి ఇందిరాగాంధీ బయటకు వస్తుండగా ఉదయం సరిగ్గా 9.20 గంటలకు సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ అనే ఇద్దరు సిక్కు గార్డులు ఆటోమేటిక్ వెపన్ల ద్వారా ఆమెపైకి 30 తూటాలు పేల్చారు. అందులో మూడు తూటాలు ఆమెకు తగలకుండా పక్క నుంచి దూసుకుపోగా, 20 తూటాలు ఆమె శరీరంలోకి ఓ పక్కనుంచి లోపలికెళ్లి మరో పక్కనుంచి బయటకు దూసుకెళ్లాయి. ఏడు తూటాలు ఆమె శరీరంలో చిక్కుకున్నాయి. తొమ్మిదిన్నర ప్రాంతంలో ఆమెను హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆమె మరణాన్ని ఆస్పత్రి వర్గాలు ఆరోజు మధ్యాహ్నం 2.20 గంటలకు ధ్రువీకరించాయి. ఆరోజు సాయంత్రం వార్తల్లో దూరదర్శన్ ఇందిరాగాంధీ మరణాన్ని అధికారికంగా ప్రకటించింది. ఇందిగాంధీ హత్య జరిగిన రోజున రాజీవ్ గాంధీ పశ్చిమ బెంగాల్ టూర్లో ఉన్నారు. రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ విదేశీ పర్యటనలో ఉన్నారు. కేంద్ర హోం మంత్రి పీవీ నరసింహారావు ఢిల్లీలోనే ఉన్నారు. రాజీవ్ గాంధీ నాలుగు గంటల ప్రాంతంలో ఢిల్లీకి చేరుకోగా, ఐదు గంటల ప్రాంతంలో జైల్ సింగ్ ఢిల్లీకి చేరుకున్నారు. ఆ తర్వాత గంటలోపలే రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రిగా రాష్ట్రపతి చేతుల మీదుగా బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రం నుంచే సిక్కులకు వ్యతిరేకంగా అల్లర్లు ప్రారంభమయ్యాయి. ఈ అల్లర్లను ముందుగానే ఊహించి నివారించేందుకు ఐదుగురు సిక్కు ప్రముఖులు చేసిన విశ్వప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగా ఫలించలేదు. అక్టోబర్ 31వ తేదీన ప్రముఖ రచయిత పత్వంత్ సింగ్‌కు ఉదయం 10 గంటలకే ఇందిరాగాంధీ మరణం గురించి తెల్సింది. ఆయన వెంటనే జరగబోయే దారుణాల గురించి ఊహించారు. వెంటనే 1971లో బంగ్లాదేశ్‌తో జరిగిన యుద్ధంలో హీరోగా గుర్తింపు పొందిన లెఫ్ట్ నెంట్ జనరల్ జగ్జీత్ సింగ్‌కు ఫోన్ చేసి సంప్రతించారు. అనంతరం వారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అప్పటి ఏకైక మార్షల్ అర్జున్ సింగ్, దౌత్యవేత్త గురుచరణ్ సింగ్. రిటైర్డ్ బ్రిగేడియర్ సుఖ్జీత్ సింగ్‌లను కలుసుకొని అల్లర్లు నిరోధించేందుకు ఏం చేయాలని మంతనాలు జరిపారు. అప్పటికీ ఇందిరాగాంధీ వర్గంలో కీలక వ్యక్తిగా ఉన్న ఇందర్ కుమార్ గుజ్రాల్ (ఆ తర్వాత ప్రధానమంత్రి అయిన)ను సంప్రతించాలని నిర్ణయించి ఫోన్ చేశారు. అప్పటికే ఆయన తన కుటుంబ సభ్యులతో కలసి ఎయిమ్స్ ఆస్పత్రికి వెళ్లినట్లు తెల్సింది. ఈ ఐదుగురు సిక్కు ప్రముఖులు నవంబర్ ఒకటవ తేదీ మధ్యాహ్నం రాష్ట్రపతి జ్ఞాని జైల్‌సింగ్‌ను కలసుకున్నారు. అల్లర్లను నివారించేందుకు వెంటనే సైన్యాన్ని రంగంలోకి దింపాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఎక్కువ సేపు మౌనం పాటించిన ఆయన సైన్యాన్ని రంగంలోకి దింపితే అనవసరంగా ప్రజల్లో భయాందోళనలు పెరుగుతాయని అన్నారు. ‘సార్ ఇప్పటికే ఢిల్లీ తగులబడి పోతోంది. వందలాది ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఇప్పటికే వందమందికిపైగా మత్యువాత పడ్డట్టూ వార్తలందుతున్నాయి. సైన్యాన్ని రంగంలోకి దింపడానికి ఇంతకన్నా ఉద్రిక్త పరిస్థితులు ఏం కావాలి?’ అని వారు ప్రశ్నించారు. అయినా సైన్యాన్ని రంగంలోకి దింపే అధికారం తనకు లేదని జైల్‌సింగ్ సమాధానం ఇచ్చారు. హోం మంత్రి పీవీ నరసింహారావుతో మాట్లాడమని సూచించగా ఆయన కార్యదర్శి హోం శాఖకు ఫోన్ చేసి కనుక్కొన్నారు. హోం మంత్రి అత్యవసర సమావేశంలో ఉన్నారని, మాట్లాడడం సాధ్యం కాదని అవతలి నుంచి సమాధానం వచ్చింది. చేసేదేమీ లేక ఈ ఐదుగురు సిక్కు ప్రముఖులు వెనుతిరిగి వచ్చారు. అదేరోజు ఈ ఐదుగురు సిక్కులు హోం మంత్రి పీవీ నరసింహారావును కలసుకొన్నారు. అప్పటి వరకు సైన్యాన్ని దింపేందుకు ఇష్టపడని ఆయన అప్పుడు సైన్యాని రప్పించేందుకు నిర్ణయించినట్లు, సాయంత్రానికల్లా సైన్యం రంగంలోకి వస్తుందని హామీ ఇచ్చారు. అంతకు ముందు సైన్యాన్ని రంగంలోకి దింపొద్దని ప్రధాని కార్యాలయం నుంచే హోం శాఖకు ఆదేశాలు వచ్చాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సైన్యం, పోలీసులకు మధ్య సమన్వయానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్న ప్రశ్నకు పీవీ నిర్లిప్తంగా సమాధానం ఇచ్చారు. ఆ విషయం ఆర్మీ ఏరియా కమాండర్, ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌ను కలుసుకొని మాట్లాడుకుంటారని సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత సిక్కు ప్రముఖులు ప్రధాని రాజీవ్ గాంధీని కలసుకునేందుకు ప్రయత్నించారు. రాజీవ్ అప్పాయింట్మెంట్ ఇవ్వాల్సిందిగా రాజేష్ పైలట్‌ను కోరారు. సంతాపం తెలియజేసేందుకు ఇప్పిస్తాగానీ, సిక్కుల ఊచకోత అంశాన్ని చర్చిస్తానంటే మాత్రం ఇప్పియ్యనని ఆయన సమాధానం ఇచ్చారు. సంతాపం ఎలాగూ తెలియజేస్తాం, సిక్కుల ఊచకోత అంశం కూడా ముఖ్యమేకదా, దాన్ని కూడా ప్రస్తావిస్తామని చెప్పడంతో అప్పాయింట్మెంట్ నిరాకరించారు. నవంబర్ రెండవ తేదీన ఢిల్లీ నగరం సైన్యం ఆధీనంలోకి వచ్చాక అల్లర్లు తగ్గాయి. తాము చెప్పినట్లు ముందుగానే ప్రభుత్వం స్పందించి ఉంటే చరిత్రలో ఇంత రక్తపాతం జరిగి ఉండేది కాదన్నది సిక్కు ప్రముఖుల వాదన. ఇదే అల్లర్ల విషయమై అప్పుడు రాజీవ్ గాంధీని మీడియా ప్రశ్నించగా ‘ఒక మహావృక్షం కూలిపోయినప్పుడు ప్రకంపనలు రావడం చాలా సహజం’ అని వ్యాఖ్యానించారు. (ఐదుగురు సిక్కు ప్రముఖులు, ఇందర్ కుమార్ గుజ్రాల్ డైరీ, పలు విచారణ కమిషన్ నివేదికలు, పౌరహక్కుల సంఘాల నివేదికలు, అప్పటి పోలీసు అధికారులు వెల్లడించిన అంశాల ఆధారంగా ఇస్తున్న వార్తా కథనం ఇది) -
మోదీజీ.. అప్పుడెందుకు నోరు విప్పలేదు?
(వెబ్సైట్ ప్రత్యేకం) దేశంలో 'అసహనం' పెరిగిపోతోందనడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారసభలో మాట్లాడిన తీరే నిదర్శనం. సిక్కులకు వ్యతిరేకంగా 1984లో జరిగిన అల్లర్ల గురించి ఎన్నడూ గట్టిగా నోరు విప్పని మోదీ నిన్నటి సభలో 'సహనం' కోల్పోయి '1984 నాటి అల్లర్ల బాధితుల కన్నీళ్లు ఇంకా ఆరిపోలేదు. వారి గాయాలు నేటికి మానలేదు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల బాధితులను ఆదుకునేందుకు అన్ని సామాజిక వర్గాల వారు ముందుకొచ్చి తమ వంతు చేయూతను అందించగా, ఆరెస్సెస్ గానీ, దాని పరివార్ పార్టీ బీజేపీ గానీ ఎందుకు ముందుకు రాలేదు? కనీసం ఏడాది వరకు అల్లర్లను ఆరెస్సెస్ అధికారికంగా ముఖస్తుతిగానైనా ఎందుకు ఖండించలేదు? అల్లర్లలో అసువులు బాసిన సిక్కులకన్నా కాశ్మీర్ పండిట్ల కుటుంబానికి చెందిన ఇందిరాగాంధీ మరణానికి ఖరీదు కట్టారా? లేదా ఆ అల్లర్లలో ఆరెస్సెస్ పాత్ర కూడా ఉందని మౌనం వహించారా? కొన్ని ప్రాంతాలలో ఆరెస్సెస్ వారు తమపై దాడులు జరిపినట్టు 'పీపుల్స్ యూనియన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్, పీపుల్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్' సంస్థలు చేసిన ఇంటర్వ్యూలలో బాధితులు ఆరోపించారు. 1984 నాటి అల్లర్లపై ఈ రెండు పౌరసంఘాలు సర్వేలు జరిపి సమగ్ర నివేదికలు రూపొందించాయి. నాడు బాధితులను ఆదుకోవడంలో ఈ రెండు పౌరసంఘాల సభ్యులతోపాటు స్వామి అగ్నివేశ్, ప్రొఫెసర్ సుమంతా బెనర్జీ, రజనీ కొఠారి, దినేష్ మోహన్ లాంటి సామాజిక కార్యకర్తలతోపాటు నాగరిక్ ఏకతా మంచ్ అనే సంస్థ ప్రముఖ పాత్ర వహించాయి. బాధిత శిబిరాల్లో జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ, ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థులు స్వచ్ఛంద సేవలు అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పనిచేసిన ప్రముఖ చరిత్రకారులు ప్రొఫెసర్ రొమిల్లా థాపర్ అల్లర్లను తీవ్రంగా ఖండించారు. నాటి బాధితుల కన్నీళ్లు ఇంకా ఆరిపోలేదని అంటున్న నరేంద్ర మోదీగానీ, ఆయన పార్టీ బీజేపీ గానీ, నేడు సమాజంలో అసహనం పెరిగిపోవడానికి ప్రత్యక్షంగా కారణం అవుతున్న ఆరెస్సెస్ గానీ ఎక్కడికి పోయారు? దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు జరిగిన అల్లర్లలో 1984, 2002లో జరిగిన అల్లర్లను ప్రత్యేకంగా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే రెండూ కూడా ప్రభుత్వ అండదండలతో జరిగినవే. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన సిక్కుల ఊచకోత వ్యవహారంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుల ప్రత్యక్ష పాత్ర ఉందనే విషయం ప్రపంచానికంతా తెలుసు. అలాగే 2002లో గుజరాత్లో ముస్లింలకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో పరోక్షంగానైనా మోదీ పాత్ర ఉందనీ తెలుసు. ఈ రెండు కేసులు నేటికీ కొనసాగుతున్నా.. దోషులు స్పేచ్ఛగా సంచరించారని, సంచరిస్తున్నారనీ తెలుసు. 1984 నాటి అల్లర్ల బాధితులను ఊరడించేందుకు అన్ని సామాజిక వర్గాల ప్రజలు ముందుకొచ్చారు. వారికి నయానో, భయానో ప్రభుత్వం కూడా సహకారం అందించింది. 2002లో జరిగిన అల్లర్ల విషయంలో ఇది పూర్తి భిన్నం. ముస్లిం బాధితులను ఆదుకునేందుకు సెతల్వాద్ లాంటి కొందరు తప్ప పౌర సమాజం పెద్దగా స్పందించలేదు, స్పందించిన వారిని కూడా హిందూ వ్యతిరేక శక్తులంటూ అడ్డుకున్నారు. ఇప్పుడు కూడా దేశంలో ఆనాటి అల్లర్లకు దోహదపడిన పరిస్థితులే సమాజంలో నెలకొంటున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఆసరా చేసుకొని అదే పరివారానికి చెందిన కొన్ని మత ఛాందసవాద శక్తులు 'సహనం'ను చంపేస్తున్నాయి. నేడు ఓ రాజకీయ పార్టీకో, వర్గానికి చెందినవారే కాకుండా అన్ని వర్గాల ప్రజలు అసహనం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? గోమాంసం పేరిట జరిగిన మొన్నటి మొహమ్మద్ అఖ్లాక్ హత్య, గులాం అలీ ఖాన్ కచేరి రద్దు, పాక్ క్రికెట్ టీమ్‌లను బెదిరించడం, ఇటీవల ఇద్దరు దళిత బాలిల సజీవ దహనం, కర్ణాటక రచయిత, హేతువాది కల్బుర్గీ హత్య, సుధీంద్ర కులకర్ణి లాంటి వారిపై సిరా దాడులు, గోమాంసం వడ్డిస్తున్నారంటూ ఢిల్లీలోని కేరళ భవన్‌లోకి ముందస్తు అనుమతి లేకుండా పోలీసులు చొచ్చుకుపోవడం, ప్రశాంత పరిస్థితులు నెలకొన్న కశ్మీర్లో నిత్యం తుపాకుల మోత వినిపించడం తదితర పరిణామాలు దేనికి సంకేతం..? -
‘సిక్కు వ్యతిరేక అల్లర్ల’ పరిహారంపై ఈసీ నిలదీత
న్యూఢిల్లీ: సిక్కు వ్యతిరేక అల్లర్ల (1984లో జరిగినవి) బాధితులకు తాజా పరిహారంపై ఎన్నికల సంఘం కేంద్రం తీరును తప్పుబట్టింది. బాధితులకు తాజా పరిహారం ఇచ్చే విషయమై నిర్ణయం తీసుకోకపోతే... మీడియా వార్తలను ఎందుకు ఖండించలేదని సర్కారును నిలదీసింది. ఈ వైఖరితో పరిహారంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందేమోనన్న అభిప్రాయానికి దారితీస్తుందని ఈసీ పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కావద్దంది. ఢిల్లీ అసెంబ్లీ రద్దుకు ముందు అక్కడి 3 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయటంతో. కోడ్ అమల్లో ఉండగా, నాటి సిక్కు అల్లర్ల బాధితులకు ప్రభుత్వం పరిహారం ఇవ్వనుందంటూ వార్తలు రావడంతో ఈసీ కేంద్ర హోంశాఖకు 31న నోటీసులిచ్చింది. -
సోనియాపై కేసు కొట్టేసిన న్యూయార్క్ కోర్టు
న్యూయార్క్: 1984 సిక్కు అల్లర్లకు సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీపై ఓ సిక్కుల గ్రూపు వేసిన పిటిషన్‌ను న్యూయార్క్ కోర్టు కొట్టివేసింది. ఆ అల్లర్లకు ఆమెను వ్యక్తిగతంగా బాధ్యురాలిని చేయజాలమని పేర్కొంది. ఈ మేరకు సిక్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ జడ్జి బ్రియాన్ కోగన్ 13 పేజీల ఉత్తర్వులు వెలువరించారు.అయితే ఎస్ఎఫ్జే మరోసారి ఇలాంటి పిటిషన్ వేయకుండా నిరోధిస్తూ ఉత్తర్వులివ్వాలన్న సోనియా గాంధీ వినతిని తోసిపుచ్చారు. -
జగదీష్ టైట్లర్‌కు అమరిందర్ సింగ్ క్లీన్ చిట్ ఇవ్వడమేంటి?
న్యూఢిల్లీ : రెండు దశాబ్దాల క్రితం సిక్కుల ఊచకోత అంశానికి సంబంధించి ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరిందర్‌సింగ్, కాంగ్రెస్ నేత జగదీష్ టైట్లర్‌కు క్లీన్చిట్ ఇవ్వడంపై సిక్కులు ఆగ్రహించారు. ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయం ముందు పెద్ద సంఖ్యలో నిరసన తెలిపారు. ఎన్నికల సంఘానికి తాము ఫిర్యాదు చేస్తామని చెప్పారు. 1984 అల్లర్లకు కాంగ్రెస్సే కారణమని.. సోనియా, రాహుల్ అమరిందర్‌కు అమృత్సర్ లోకసభ టిక్కెట్టు ఇస్తే... ఆయనేమో జగదీష్ టైట్లర్‌కు క్లీన్చిట్ ఇస్తున్నాడని శిరోమణి అకాళీదళ్ ఢిల్లీ అధ్యక్షుడు మంజిత్ సింగ్ విమర్శించారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కేనన్లు ప్రయోగించారు. అనంతరం 70 మంది ఆందోళనకారులను అరెస్టు చేసి తుగ్లక్‌రోడ్డు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మరోవైపు ఇదే విషయంపై బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ మండిపడ్డారు. వాస్తవమేంటో చట్టాలు తేలుస్తాయి... ఇలా విచారణలో ఉన్న విషయానికి కెప్టెన్ అమరిందర్ సింగ్ క్లీన్చిట్ ఇవ్వడమేంటని ఆయన ప్రశ్నించారు.