ఇందిరాగాంధీ హత్య రోజు ఏం జరిగిందీ?
న్యూఢిల్లీ: సరిగ్గా ఈ రోజుకు 32 సంవత్సరాల క్రితం దేశ చరిత్రలో ఏం జరిగిందో అందరికి గుర్తుండే ఉంటుంది. అంటే 1984, అక్టోబర్ 31వ తేదీన మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీని ఆమె ఇద్దరు సిక్కు బాడీ గార్డులు కాల్చి చంపారు. పర్యవసానంగా ముందు ఢిల్లీలో, ఆ తర్వాత దేశవ్యాప్తంగా సిక్కులకు వ్యతిరేకంగా అల్లర్లు చెలరేగాయి. కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం ఒక్క ఢిల్లీ నగరంలోనే 2,100 మంది సిక్కులు ఊచకోతకు గురికాగా, దేశవ్యాప్తంగా 2,800 మంది ఊచకోతకు గురయ్యారు. అనధికార లెక్కల ప్రకారం ఒక్క ఢిల్లీలో మూడువేల మంది సిక్కులు, దేశవ్యాప్తంగా 8 వేల మంది సిక్కులు ఊచకోతకు గురయ్యారన్నది అంచనా.
ఆ రోజు సఫ్దార్‌జంగ్ రోడ్డులోని తన అధికార నివాసం నుంచి ఇందిరాగాంధీ బయటకు వస్తుండగా ఉదయం సరిగ్గా 9.20 గంటలకు సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ అనే ఇద్దరు సిక్కు గార్డులు ఆటోమేటిక్ వెపన్ల ద్వారా ఆమెపైకి 30 తూటాలు పేల్చారు. అందులో మూడు తూటాలు ఆమెకు తగలకుండా పక్క నుంచి దూసుకుపోగా, 20 తూటాలు ఆమె శరీరంలోకి ఓ పక్కనుంచి లోపలికెళ్లి మరో పక్కనుంచి బయటకు దూసుకెళ్లాయి. ఏడు తూటాలు ఆమె శరీరంలో చిక్కుకున్నాయి. తొమ్మిదిన్నర ప్రాంతంలో ఆమెను హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆమె మరణాన్ని ఆస్పత్రి వర్గాలు ఆరోజు మధ్యాహ్నం 2.20 గంటలకు ధ్రువీకరించాయి. ఆరోజు సాయంత్రం వార్తల్లో దూరదర్శన్ ఇందిరాగాంధీ మరణాన్ని అధికారికంగా ప్రకటించింది.
ఇందిగాంధీ హత్య జరిగిన రోజున రాజీవ్ గాంధీ పశ్చిమ బెంగాల్ టూర్‌లో ఉన్నారు. రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ విదేశీ పర్యటనలో ఉన్నారు. కేంద్ర హోం మంత్రి పీవీ నరసింహారావు ఢిల్లీలోనే ఉన్నారు. రాజీవ్ గాంధీ నాలుగు గంటల ప్రాంతంలో ఢిల్లీకి చేరుకోగా, ఐదు గంటల ప్రాంతంలో జైల్ సింగ్ ఢిల్లీకి చేరుకున్నారు. ఆ తర్వాత గంటలోపలే రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రిగా రాష్ట్రపతి చేతుల మీదుగా బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రం నుంచే సిక్కులకు వ్యతిరేకంగా అల్లర్లు ప్రారంభమయ్యాయి. ఈ అల్లర్లను ముందుగానే ఊహించి నివారించేందుకు ఐదుగురు సిక్కు ప్రముఖులు చేసిన విశ్వప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగా ఫలించలేదు.
అక్టోబర్ 31వ తేదీన ప్రముఖ రచయిత పత్వంత్ సింగ్‌కు ఉదయం 10 గంటలకే ఇందిరాగాంధీ మరణం గురించి తెల్సింది. ఆయన వెంటనే జరగబోయే దారుణాల గురించి ఊహించారు. వెంటనే 1971లో బంగ్లాదేశ్‌తో జరిగిన యుద్ధంలో హీరోగా గుర్తింపు పొందిన లెఫ్ట్ నెంట్ జనరల్ జగ్జీత్ సింగ్‌కు ఫోన్ చేసి సంప్రతించారు. అనంతరం వారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అప్పటి ఏకైక మార్షల్ అర్జున్ సింగ్, దౌత్యవేత్త గురుచరణ్ సింగ్. రిటైర్డ్ బ్రిగేడియర్ సుఖ్‌జీత్ సింగ్‌లను కలుసుకొని అల్లర్లు నిరోధించేందుకు ఏం చేయాలని మంతనాలు జరిపారు. అప్పటికీ ఇందిరాగాంధీ వర్గంలో కీలక వ్యక్తిగా ఉన్న ఇందర్ కుమార్ గుజ్రాల్ (ఆ తర్వాత ప్రధానమంత్రి అయిన)ను సంప్రతించాలని నిర్ణయించి ఫోన్ చేశారు. అప్పటికే ఆయన తన కుటుంబ సభ్యులతో కలసి ఎయిమ్స్ ఆస్పత్రికి వెళ్లినట్లు తెల్సింది.
ఈ ఐదుగురు సిక్కు ప్రముఖులు నవంబర్ ఒకటవ తేదీ మధ్యాహ్నం రాష్ట్రపతి జ్ఞాని జైల్‌సింగ్‌ను కలసుకున్నారు. అల్లర్లను నివారించేందుకు వెంటనే సైన్యాన్ని రంగంలోకి దింపాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఎక్కువ సేపు మౌనం పాటించిన ఆయన సైన్యాన్ని రంగంలోకి దింపితే అనవసరంగా ప్రజల్లో భయాందోళనలు పెరుగుతాయని అన్నారు.
‘సార్ ఇప్పటికే ఢిల్లీ తగులబడి పోతోంది. వందలాది ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఇప్పటికే వందమందికిపైగా మత్యువాత పడ్డట్టూ వార్తలందుతున్నాయి. సైన్యాన్ని రంగంలోకి దింపడానికి ఇంతకన్నా ఉద్రిక్త పరిస్థితులు ఏం కావాలి?’ అని వారు ప్రశ్నించారు. అయినా సైన్యాన్ని రంగంలోకి దింపే అధికారం తనకు లేదని జైల్‌సింగ్ సమాధానం ఇచ్చారు. హోం మంత్రి పీవీ నరసింహారావుతో మాట్లాడమని సూచించగా ఆయన కార్యదర్శి హోం శాఖకు ఫోన్ చేసి కనుక్కొన్నారు. హోం మంత్రి అత్యవసర సమావేశంలో ఉన్నారని, మాట్లాడడం సాధ్యం కాదని అవతలి నుంచి సమాధానం వచ్చింది. చేసేదేమీ లేక ఈ ఐదుగురు సిక్కు ప్రముఖులు వెనుతిరిగి వచ్చారు.
అదేరోజు ఈ ఐదుగురు సిక్కులు హోం మంత్రి పీవీ నరసింహారావును కలసుకొన్నారు. అప్పటి వరకు సైన్యాన్ని దింపేందుకు ఇష్టపడని ఆయన అప్పుడు సైన్యాని రప్పించేందుకు నిర్ణయించినట్లు, సాయంత్రానికల్లా సైన్యం రంగంలోకి వస్తుందని హామీ ఇచ్చారు. అంతకు ముందు సైన్యాన్ని రంగంలోకి దింపొద్దని ప్రధాని కార్యాలయం నుంచే హోం శాఖకు ఆదేశాలు వచ్చాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సైన్యం, పోలీసులకు మధ్య సమన్వయానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్న ప్రశ్నకు పీవీ నిర్లిప్తంగా సమాధానం ఇచ్చారు. ఆ విషయం ఆర్మీ ఏరియా కమాండర్, ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌ను కలుసుకొని మాట్లాడుకుంటారని సమాధానం ఇచ్చారు.
ఆ తర్వాత సిక్కు ప్రముఖులు ప్రధాని రాజీవ్ గాంధీని కలసుకునేందుకు ప్రయత్నించారు. రాజీవ్ అప్పాయింట్‌మెంట్ ఇవ్వాల్సిందిగా రాజేష్ పైలట్‌ను కోరారు. సంతాపం తెలియజేసేందుకు ఇప్పిస్తాగానీ, సిక్కుల ఊచకోత అంశాన్ని చర్చిస్తానంటే మాత్రం ఇప్పియ్యనని ఆయన సమాధానం ఇచ్చారు. సంతాపం ఎలాగూ తెలియజేస్తాం, సిక్కుల ఊచకోత అంశం కూడా ముఖ్యమేకదా, దాన్ని కూడా ప్రస్తావిస్తామని చెప్పడంతో అప్పాయింట్‌మెంట్ నిరాకరించారు. నవంబర్ రెండవ తేదీన ఢిల్లీ నగరం సైన్యం ఆధీనంలోకి వచ్చాక అల్లర్లు తగ్గాయి. తాము చెప్పినట్లు ముందుగానే ప్రభుత్వం స్పందించి ఉంటే చరిత్రలో ఇంత రక్తపాతం జరిగి ఉండేది కాదన్నది సిక్కు ప్రముఖుల వాదన. ఇదే అల్లర్ల విషయమై అప్పుడు రాజీవ్ గాంధీని మీడియా ప్రశ్నించగా ‘ఒక మహావృక్షం కూలిపోయినప్పుడు ప్రకంపనలు రావడం చాలా సహజం’ అని వ్యాఖ్యానించారు.
(ఐదుగురు సిక్కు ప్రముఖులు, ఇందర్ కుమార్ గుజ్రాల్ డైరీ, పలు విచారణ కమిషన్ నివేదికలు, పౌరహక్కుల సంఘాల నివేదికలు, అప్పటి పోలీసు అధికారులు వెల్లడించిన అంశాల ఆధారంగా ఇస్తున్న వార్తా కథనం ఇది)