న్యూఢిల్లీ : రెండు దశాబ్దాల క్రితం సిక్కుల ఊచకోత అంశానికి సంబంధించి ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరిందర్‌సింగ్, కాంగ్రెస్ నేత జగదీష్ టైట్లర్‌కు క్లీన్‌చిట్ ఇవ్వడంపై సిక్కులు ఆగ్రహించారు. ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయం ముందు పెద్ద సంఖ్యలో నిరసన తెలిపారు. ఎన్నికల సంఘానికి తాము ఫిర్యాదు చేస్తామని చెప్పారు. 1984 అల్లర్లకు కాంగ్రెస్సే కారణమని.. సోనియా, రాహుల్ అమరిందర్‌కు అమృత్‌సర్ లోకసభ టిక్కెట్టు ఇస్తే... ఆయనేమో జగదీష్ టైట్లర్‌కు క్లీన్‌చిట్ ఇస్తున్నాడని శిరోమణి అకాళీదళ్ ఢిల్లీ అధ్యక్షుడు మంజిత్ సింగ్ విమర్శించారు.
నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కేనన్లు ప్రయోగించారు. అనంతరం 70 మంది ఆందోళనకారులను అరెస్టు చేసి తుగ్లక్‌రోడ్డు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మరోవైపు ఇదే విషయంపై బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ మండిపడ్డారు. వాస్తవమేంటో చట్టాలు తేలుస్తాయి... ఇలా విచారణలో ఉన్న విషయానికి కెప్టెన్ అమరిందర్ సింగ్ క్లీన్‌చిట్ ఇవ్వడమేంటని ఆయన ప్రశ్నించారు.