మోదీజీ.. అప్పుడెందుకు నోరు విప్పలేదు?
(వెబ్‌సైట్ ప్రత్యేకం)
దేశంలో 'అసహనం' పెరిగిపోతోందనడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారసభలో మాట్లాడిన తీరే నిదర్శనం. సిక్కులకు వ్యతిరేకంగా 1984లో జరిగిన అల్లర్ల గురించి ఎన్నడూ గట్టిగా నోరు విప్పని మోదీ నిన్నటి సభలో 'సహనం' కోల్పోయి '1984 నాటి అల్లర్ల బాధితుల కన్నీళ్లు ఇంకా ఆరిపోలేదు. వారి గాయాలు నేటికి మానలేదు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల బాధితులను ఆదుకునేందుకు అన్ని సామాజిక వర్గాల వారు ముందుకొచ్చి తమ వంతు చేయూతను అందించగా, ఆరెస్సెస్ గానీ, దాని పరివార్ పార్టీ బీజేపీ గానీ ఎందుకు ముందుకు రాలేదు? కనీసం ఏడాది వరకు అల్లర్లను ఆరెస్సెస్ అధికారికంగా ముఖస్తుతిగానైనా ఎందుకు ఖండించలేదు? అల్లర్లలో అసువులు బాసిన సిక్కులకన్నా కాశ్మీర్ పండిట్ల కుటుంబానికి చెందిన ఇందిరాగాంధీ మరణానికి ఖరీదు కట్టారా? లేదా ఆ అల్లర్లలో ఆరెస్సెస్ పాత్ర కూడా ఉందని మౌనం వహించారా? కొన్ని ప్రాంతాలలో ఆరెస్సెస్ వారు తమపై దాడులు జరిపినట్టు 'పీపుల్స్ యూనియన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్, పీపుల్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్' సంస్థలు చేసిన ఇంటర్వ్యూలలో బాధితులు ఆరోపించారు. 1984 నాటి అల్లర్లపై ఈ రెండు పౌరసంఘాలు సర్వేలు జరిపి సమగ్ర నివేదికలు రూపొందించాయి.
నాడు బాధితులను ఆదుకోవడంలో ఈ రెండు పౌరసంఘాల సభ్యులతోపాటు స్వామి అగ్నివేశ్, ప్రొఫెసర్ సుమంతా బెనర్జీ, రజనీ కొఠారి, దినేష్ మోహన్ లాంటి సామాజిక కార్యకర్తలతోపాటు నాగరిక్ ఏకతా మంచ్ అనే సంస్థ ప్రముఖ పాత్ర వహించాయి. బాధిత శిబిరాల్లో జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ, ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థులు స్వచ్ఛంద సేవలు అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పనిచేసిన ప్రముఖ చరిత్రకారులు ప్రొఫెసర్ రొమిల్లా థాపర్ అల్లర్లను తీవ్రంగా ఖండించారు. నాటి బాధితుల కన్నీళ్లు ఇంకా ఆరిపోలేదని అంటున్న నరేంద్ర మోదీగానీ, ఆయన పార్టీ బీజేపీ గానీ, నేడు సమాజంలో అసహనం పెరిగిపోవడానికి ప్రత్యక్షంగా కారణం అవుతున్న ఆరెస్సెస్ గానీ ఎక్కడికి పోయారు?
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు జరిగిన అల్లర్లలో 1984, 2002లో జరిగిన అల్లర్లను ప్రత్యేకంగా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే రెండూ కూడా ప్రభుత్వ అండదండలతో జరిగినవే. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన సిక్కుల ఊచకోత వ్యవహారంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుల ప్రత్యక్ష పాత్ర ఉందనే విషయం ప్రపంచానికంతా తెలుసు. అలాగే 2002లో గుజరాత్‌లో ముస్లింలకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో పరోక్షంగానైనా మోదీ పాత్ర ఉందనీ తెలుసు. ఈ రెండు కేసులు నేటికీ కొనసాగుతున్నా.. దోషులు స్పేచ్ఛగా సంచరించారని, సంచరిస్తున్నారనీ తెలుసు. 1984 నాటి అల్లర్ల బాధితులను ఊరడించేందుకు అన్ని సామాజిక వర్గాల ప్రజలు ముందుకొచ్చారు. వారికి నయానో, భయానో ప్రభుత్వం కూడా సహకారం అందించింది. 2002లో జరిగిన అల్లర్ల విషయంలో ఇది పూర్తి భిన్నం. ముస్లిం బాధితులను ఆదుకునేందుకు సెతల్వాద్ లాంటి కొందరు తప్ప పౌర సమాజం పెద్దగా స్పందించలేదు, స్పందించిన వారిని కూడా హిందూ వ్యతిరేక శక్తులంటూ అడ్డుకున్నారు. ఇప్పుడు కూడా దేశంలో ఆనాటి అల్లర్లకు దోహదపడిన పరిస్థితులే సమాజంలో నెలకొంటున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఆసరా చేసుకొని అదే పరివారానికి చెందిన కొన్ని మత ఛాందసవాద శక్తులు 'సహనం'ను చంపేస్తున్నాయి.
నేడు ఓ రాజకీయ పార్టీకో, వర్గానికి చెందినవారే కాకుండా అన్ని వర్గాల ప్రజలు అసహనం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? గోమాంసం పేరిట జరిగిన మొన్నటి మొహమ్మద్ అఖ్లాక్ హత్య, గులాం అలీ ఖాన్ కచేరి రద్దు, పాక్ క్రికెట్ టీమ్‌లను బెదిరించడం, ఇటీవల ఇద్దరు దళిత బాలిల సజీవ దహనం, కర్ణాటక రచయిత, హేతువాది కల్బుర్గీ హత్య, సుధీంద్ర కులకర్ణి లాంటి వారిపై సిరా దాడులు, గోమాంసం వడ్డిస్తున్నారంటూ ఢిల్లీలోని కేరళ భవన్‌లోకి ముందస్తు అనుమతి లేకుండా పోలీసులు చొచ్చుకుపోవడం, ప్రశాంత పరిస్థితులు నెలకొన్న కశ్మీర్‌లో నిత్యం తుపాకుల మోత వినిపించడం తదితర పరిణామాలు దేనికి సంకేతం..?