భాగల్పూర్/సిల్చార్: కేంద్రంలో మోదీ మరోసారి అధికారంలోకి వస్తే తమ అవినీతి దుకాణాలు, వారసత్వ రాజకీయాలు మూతపడతాయని ప్రతిపక్షాలు భయపడుతున్నాయని ప్రధాని మోదీ విమర్శించారు. తనను అడ్డుకునేందుకు దేశంలోని విపక్షాలు ‘మహాకల్తీ గ్యాంగ్’గా మారాయని దుయ్యబట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బిహార్, అస్సాం రాష్ట్రాల్లో గురువారం జరిగిన బహిరంగ సభల్లో మోదీ విపక్షాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
రిజర్వేషన్లపై దుష్ప్రచారం..
ఈ సందర్భంగా ప్రతిపక్షాలన్నీ కలిసి ఏర్పడ్డ మహాకూటమిని మోదీ మహాకల్తీ గ్యాంగ్‌గా అభివర్ణించారు. ‘‘మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే ఇక ఎన్నికలు ఉండవనీ, రాజ్యాంగబద్ధమైన సంస్థలన్నీ ప్రమాదంలో పడతాయనీ, రిజర్వేషన్లు ఎత్తివేస్తాడని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి. కానీ డా.బీ.ఆర్.అంబేడ్కర్ తీసుకొచ్చిన కోటా వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఈ చౌకీదార్ (కాపలాదారు) అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నాడు. అందులో భాగంగానే ఇతరులకు నష్టం జరగకుండా ఆర్థికంగా బలహీనవర్గాల(ఈడబ్ల్యూసీ)కు 10 శాతం రిజర్వేషన్ కల్పించాం. మోదీ మళ్లీ అధికారంలోకొస్తే తాము ఫినిష్ అయిపోతామని ఈ వేర్పాటువాద గ్యాంగ్ (ప్రతిపక్షాలు) భయపడుతోంది’ అని అన్నారు.
నేటికీ పాక్‌లో వేధింపులు..
పౌరసత్వ చట్టాన్ని తెచ్చేందుకు బీజేపీ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. అస్సాంలోని సిల్చార్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ మాట్లాడారు. ‘ఎన్డీయే అధికారంలోకిరాగానే సమాజంలోని అన్నివర్గాలతో చర్చించి పౌరసత్వ చట్టాన్ని తెస్తాం. అస్సాం ప్రజల భాష, సంస్కృతి, గుర్తింపు, హక్కులకు రక్షణ కల్పిస్తాం. కాంగ్రెస్ దేశవిభజన సమయంలో పాక్‌లోని మైనారిటీల గురించి ఆలోచించలేదు. పాక్‌లోని మతోన్మాదులు మన సోదరుల్ని, సోదరీమణుల్ని చిత్రహింసలు పెట్టారు. ఇందుకు కాంగ్రెస్ పార్టీ దోషి కాదా? మన కుమార్తెలు నేటికీ పాక్‌లో వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఎన్డీయే ప్రభుత్వం ఈసారి అధికారంలోకి వచ్చినవెంటనే ట్రిపుల్ తలాక్ బిల్లును ఆమోదించేందుకు ప్రయత్నిస్తాం. మన ఆడబిడ్డలకు న్యాయం చేస్తాం’ అని హామీ ఇచ్చారు.
‘కల్తీ గ్యాంగ్’కు భయం: మోదీ
Published Fri, Apr 12 2019 8:21 AM | Last Updated on Fri, Apr 12 2019 9:59 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment