మోదీ వస్తున్నా శాంతి మాత్రం రాలేదు! | Narendra Modi Repeats An Old Fallacy In Kashmir | Sakshi
Sakshi News home page

మోదీ వస్తున్నా శాంతి మాత్రం రాలేదు!

Published Mon, May 21 2018 5:18 PM | Last Updated on Wed, Aug 15 2018 2:40 PM

Narendra Modi Repeats An Old Fallacy In Kashmir - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌ను శనివారం సందర్శించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి అభివృద్ధి మంత్రం పఠించారు. ‘అభివృద్ధి, అభివృద్ధి, అభివృద్ధి ఒక్కటే కశ్మీర్‌ కల్లోలానికి పరిష్కారం’ అని ఆయన వ్యాఖ్యానించారు. లేహ్‌ రోడ్డులో లడక్‌ నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలను కలుపుతూ నిర్మించిన జోజిల్లా భూగర్భ రోడ్డు మార్గాన్ని ప్రారంభించిన మోదీ, జమ్మూలో ఓ విద్యుత్‌ ప్రాజెక్టు, ఓ రింగ్‌ రోడ్డును, కశ్మీర్‌లో ఓ సెమీ రింగ్‌ రోడ్డును, కిషన్‌ గంగ జల విద్యుత్‌ కేంద్రాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. రంజాన్‌ సందర్భంగా సైనిక కాల్పుల విరమణ ప్రకటన కూడా మోదీ చేశారు.

భారత్, పాక్‌ దేశాల మధ్య మాజీ ప్రధాన మంత్రి అటల్‌ బిహారి వాజపేయి రైలు సర్వీసును ప్రారంభించిన విషయాన్ని, స్వచ్ఛ భారత్‌ స్ఫూర్తిగా దాల్‌ సరస్సులో ఓ ఐదేళ్ల బాలిక చెత్తను ఏరివేయడాన్ని, మొదటిసారి రాళ్లు విసిరిన యువకులకు క్షమాభిక్ష ప్రసాదించిన ప్రస్తావించిన నరేంద్ర మోదీ ‘భారత్‌ మాతా’ నినాదాన్ని కూడా ప్రస్థావించారు. కానీ ఆయన రాక సందర్భంగా కశ్మీర్‌లో ఇంటర్నెట్‌ను పూర్తిగా బ్లాక్‌ చేశారు. ఆయన అభివృద్ధికి చిహ్నాలుగా పేర్కొన్న పెద్ద పెద్ద రోడ్లు, మంచి ఆస్పత్రులు, పాఠశాలలు, కాలేజీలు అన్నీ కూడా మూతపడి ఉన్నాయి. ప్రధాని రాక సందర్భంగా శాంతియుతంగా ప్రదర్శన జరుపుతామని కశ్మీర్‌ వేర్పాటు వాదులు ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర యంత్రాంగం ఈ ఏర్పాట్లు చేసింది. మోదీకి మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈసారి కశ్మీర్‌ అభివృద్ధికి నరేంద్ర మోదీ మరో 25వేల కోట్ల రూపాయలను ప్రకటించారు.

ఆయన 2014లో కశ్మీర్‌కు వరదలు వచ్చి భారీ నష్టం వచ్చినప్పుడు కశ్మీర్‌ను సందర్శించి 80 వేల కోట్ల రూపాయలను ప్రకటించారు. అందులో ఇంతవరకు 20వేల కోట్ల రూపాయలను మాత్రమే ఖర్చు పెట్టారు. ప్రకటించిన మొత్తం సొమ్ములో 22 శాతం నిధులను మాత్రమే ఖర్చు పెట్టినట్లు పార్లమెంటరీ కమిటీ కూడా ఇటీవల ఓ నివేదికలో పేర్కొంది. 2016లో మోదీ కశ్మీర్‌ను సందర్శించినప్పుడు యువకుల చేతుల్లో రాళ్లు కాదు ఉండాల్సిందీ, లాప్‌టాప్‌లు అని పిలుపునిచ్చారు. 2017లో కశ్మీర్‌ను సందర్శించినప్పుడు టెర్రరిజమ్‌ కాదు, టూరిజాన్ని ఆశ్రయించండి అని హితవు చెప్పారు. కశ్మీర్‌ సమస్యకు అభివృద్ధి ఒక్కటే పరిష్కారం అని చెబుతూ వచ్చిందీ ఒక్క మోదీయే కాదు, గత ప్రభుత్వాలన్నీ ఇదే చెబుతు వచ్చాయి. యూపీఏ నాయకులు కూడా కశ్మీర్‌ వచ్చి పలు రైల్వే, విద్యుత్‌ ప్రాజెక్టులను ప్రారంభించి వెళ్లారు. రైళ్లు వచ్చాయి. ఇంతవరకు శాంతి మాత్రం రాలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement