Chenani-Nashri tunnel
-
మోదీ వస్తున్నా శాంతి మాత్రం రాలేదు!
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌ను శనివారం సందర్శించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి అభివృద్ధి మంత్రం పఠించారు. ‘అభివృద్ధి, అభివృద్ధి, అభివృద్ధి ఒక్కటే కశ్మీర్ కల్లోలానికి పరిష్కారం’ అని ఆయన వ్యాఖ్యానించారు. లేహ్ రోడ్డులో లడక్ నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలను కలుపుతూ నిర్మించిన జోజిల్లా భూగర్భ రోడ్డు మార్గాన్ని ప్రారంభించిన మోదీ, జమ్మూలో ఓ విద్యుత్ ప్రాజెక్టు, ఓ రింగ్ రోడ్డును, కశ్మీర్లో ఓ సెమీ రింగ్ రోడ్డును, కిషన్ గంగ జల విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. రంజాన్ సందర్భంగా సైనిక కాల్పుల విరమణ ప్రకటన కూడా మోదీ చేశారు. భారత్, పాక్ దేశాల మధ్య మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారి వాజపేయి రైలు సర్వీసును ప్రారంభించిన విషయాన్ని, స్వచ్ఛ భారత్ స్ఫూర్తిగా దాల్ సరస్సులో ఓ ఐదేళ్ల బాలిక చెత్తను ఏరివేయడాన్ని, మొదటిసారి రాళ్లు విసిరిన యువకులకు క్షమాభిక్ష ప్రసాదించిన ప్రస్తావించిన నరేంద్ర మోదీ ‘భారత్ మాతా’ నినాదాన్ని కూడా ప్రస్థావించారు. కానీ ఆయన రాక సందర్భంగా కశ్మీర్లో ఇంటర్నెట్ను పూర్తిగా బ్లాక్ చేశారు. ఆయన అభివృద్ధికి చిహ్నాలుగా పేర్కొన్న పెద్ద పెద్ద రోడ్లు, మంచి ఆస్పత్రులు, పాఠశాలలు, కాలేజీలు అన్నీ కూడా మూతపడి ఉన్నాయి. ప్రధాని రాక సందర్భంగా శాంతియుతంగా ప్రదర్శన జరుపుతామని కశ్మీర్ వేర్పాటు వాదులు ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర యంత్రాంగం ఈ ఏర్పాట్లు చేసింది. మోదీకి మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈసారి కశ్మీర్ అభివృద్ధికి నరేంద్ర మోదీ మరో 25వేల కోట్ల రూపాయలను ప్రకటించారు. ఆయన 2014లో కశ్మీర్‌కు వరదలు వచ్చి భారీ నష్టం వచ్చినప్పుడు కశ్మీర్‌ను సందర్శించి 80 వేల కోట్ల రూపాయలను ప్రకటించారు. అందులో ఇంతవరకు 20వేల కోట్ల రూపాయలను మాత్రమే ఖర్చు పెట్టారు. ప్రకటించిన మొత్తం సొమ్ములో 22 శాతం నిధులను మాత్రమే ఖర్చు పెట్టినట్లు పార్లమెంటరీ కమిటీ కూడా ఇటీవల ఓ నివేదికలో పేర్కొంది. 2016లో మోదీ కశ్మీర్‌ను సందర్శించినప్పుడు యువకుల చేతుల్లో రాళ్లు కాదు ఉండాల్సిందీ, లాప్‌టాప్‌లు అని పిలుపునిచ్చారు. 2017లో కశ్మీర్‌ను సందర్శించినప్పుడు టెర్రరిజమ్ కాదు, టూరిజాన్ని ఆశ్రయించండి అని హితవు చెప్పారు. కశ్మీర్ సమస్యకు అభివృద్ధి ఒక్కటే పరిష్కారం అని చెబుతూ వచ్చిందీ ఒక్క మోదీయే కాదు, గత ప్రభుత్వాలన్నీ ఇదే చెబుతు వచ్చాయి. యూపీఏ నాయకులు కూడా కశ్మీర్ వచ్చి పలు రైల్వే, విద్యుత్ ప్రాజెక్టులను ప్రారంభించి వెళ్లారు. రైళ్లు వచ్చాయి. ఇంతవరకు శాంతి మాత్రం రాలేదు. -
మోదీ టూర్: శ్రీనగర్‌లో గ్రనేడ్ దాడి!
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో తీవ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన నేపథ్యంలో పాత శ్రీనగర్ నౌహట్టా ప్రాంతంలో ఆదివారం గ్రనేడ్ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఓ పోలీసు మృతి చెందగా, 11 మంది పోలీసులకు గాయాలయ్యాయి. నౌహట్టా ప్రాంతంలోని గంజ్‌బక్ష పార్కు సమీపంలో పహరా కాస్తున్న పోలీసులు లక్ష్యంగా తీవ్రవాదులు గ్రనేడ్ దాడి చేశారని అధికారులు తెలిపారు. ఈ దాడిలో గాయపడిన పోలీసులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఇదే ప్రాంతంలో కొందరు దుండగులు పోలీసులపై రాళ్లు రువ్వారని, ఈ క్రమంలోనే గ్రనేడ్ దాడి జరిగిందని అధికారులు చెప్తున్నారు. జమ్మూకశ్మీర్ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం ఉధంపూర్‌లో దేశంలో అతి పెద్దదైన చెనానీ-నష్రీ సొరంగమార్గాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన ఈ సొరంగ మార్గం వల్ల ప్రయాణదూరం గణనీయంగా తగ్గనుంది. ఈ సందర్భంగా ఉధంపూర్ బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. 'ఒకవైపు తప్పుదోవ పట్టిన కొంతమంది యువత రాళ్లు విసురుతున్నారు. మరోవైపు అకుంఠిత దీక్ష కలిగిన కశ్మీర్ యువత అవే రాళ్లను దేశ నిర్మాణానికి ఉపయోగిస్తున్నారు. రక్తపాతం ద్వారా ఎవరూ లబ్ధిపొందరు. దానివల్ల ఎవరికీ ఎలాంటి మేలు ఒనగూడదు' అని హితబోధ చేసిన సంగతి తెలిసిందే. -
రాళ్లు విసురుతున్న యువతపై ప్రధాని కామెంట్!
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో ఆదివారం తాను ప్రారంభించిన చెనానీ-నష్రీ సొరంగ మార్గాన్ని అభివృద్ధికి ప్రతీకగా ప్రధాని నరేంద్రమోదీ అభివర్ణించారు. జమ్మూకశ్మీర్ అభివృద్ధిలో ఈ సొరంగమార్గం అతిపెద్ద ముందడుగు అని పేర్కొన్నారు. ఉధంపూర్‌లో జరిగిన బహిరంగసభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. పర్యావరణానికి, హిమాలయాలకు ఏమాత్రం విఘాతం కలుగకుండా ప్రపంచస్థాయి ప్రమాణాలు, సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సొరంగ మార్గాన్ని నిర్మించామని, ఇందుకు కేంద్రం నిధులివ్వగా, దీని నిర్మాణంలో కశ్మీర్ యువత చెమటోడ్చడం ద్వారా రాష్ట్రాభివృద్ధికి తమ వంతు కృషి చేశారని కొనియాడారు. ఇటీవలికాలంలో కశ్మీర్ యువత తరచూ భద్రతా దళాలపై రాళ్లు విసురుతున్నారన్న వార్తలపై ప్రధాని మోదీ తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర యువత ముందు రెండు మార్గాలు ఉన్నాయని, ఒకటి టూరిజం కాగా, మరొకటి టెర్రరిజం.. ఈ రెండింటిలో ఏది కావాలో యువత నిర్ణయించుకోవాలని సూచించారు. 'ఒకవైపు తప్పుదోవ పట్టిన కొంతమంది యువత రాళ్లు విసురుతున్నారు. మరోవైపు అకుంఠిత దీక్ష కలిగిన కశ్మీర్ యువత అవే రాళ్లను దేశ నిర్మాణానికి ఉపయోగిస్తున్నారు. రక్తపాతం ద్వారా ఎవరూ లబ్ధిపొందరు. దానివల్ల ఎవరికీ ఎలాంటి మేలు ఒనగూడదు' అని మోదీ అన్నారు. తాజా సొరంగ నిర్మాణంలో కశ్మీర్ లో అభివృద్ధిని కొంత పుంతలు తొక్కిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఏడాదికి 99 కోట్ల పెట్రోల్ ఆదా!
దేశంలో అతిపెద్దదైన చెనానీ-నష్రీ సొరంగమార్గం ప్రారంభం జమ్ము నుంచి శ్రీనగర్‌కు ప్రయాణసమయం రెండుగంటలు కట్ జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్రమోదీ దేశంలోనే అతిపెద్ద సొరంగమైన చెనానీ-నష్రీ టన్నెల్ మార్గాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం ప్రారంభించి జాతికి అంకితం చేశారు. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన ఈ సొరంగ మార్గం వల్ల ప్రయాణదూరం గణనీయంగా తగ్గనుంది. జమ్మూ-శ్రీనగర్ మధ్య ప్రయాణదూరం 300 కిలోమీటర్లు కాగా.. ఈ సొరంగమార్గం ఏర్పాటు వల్ల అందులో 41 కిలోమీటర్ల దూరం.. 10.9 కిలోమీటర్లకు తగ్గనుంది. దీంతో ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణసమయం కూడా రెండుగంటలు ఆదా కానుంది. అంతేకాకుండా పెట్రోల్ రూపంలో ఏడాదికి రూ. 99 కోట్లు ఆదా కానున్నట్టు భావిస్తున్నారు. ఉధంపూర్ జిల్లాలో ఆస్ట్రియన్ టెక్నాలజీతో ఈ సొరంగాన్ని ఏర్పాటు చేశారు. ఈ సొరంగాన్ని ప్రారంభించిన అనంతరం జమ్మూకశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ, గవర్నర్ వోహ్రాతో కలిసి ప్రధాని మోదీ ఫొటోలకు ఫోజు ఇచ్చారు. అనంతరం ఆయన ఉధంపూర్‌లో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారని తెలుస్తోంది.