ఏడాదికి 99 కోట్ల పెట్రోల్ ఆదా!
- దేశంలో అతిపెద్దదైన చెనానీ-నష్రీ సొరంగమార్గం ప్రారంభం
- జమ్ము నుంచి శ్రీనగర్‌కు ప్రయాణసమయం రెండుగంటలు కట్
-
జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్రమోదీ
దేశంలోనే అతిపెద్ద సొరంగమైన చెనానీ-నష్రీ టన్నెల్ మార్గాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం ప్రారంభించి జాతికి అంకితం చేశారు. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన ఈ సొరంగ మార్గం వల్ల ప్రయాణదూరం గణనీయంగా తగ్గనుంది. జమ్మూ-శ్రీనగర్ మధ్య ప్రయాణదూరం 300 కిలోమీటర్లు కాగా.. ఈ సొరంగమార్గం ఏర్పాటు వల్ల అందులో 41 కిలోమీటర్ల దూరం.. 10.9 కిలోమీటర్లకు తగ్గనుంది. దీంతో ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణసమయం కూడా రెండుగంటలు ఆదా కానుంది. అంతేకాకుండా పెట్రోల్ రూపంలో ఏడాదికి రూ. 99 కోట్లు ఆదా కానున్నట్టు భావిస్తున్నారు.
ఉధంపూర్ జిల్లాలో ఆస్ట్రియన్ టెక్నాలజీతో ఈ సొరంగాన్ని ఏర్పాటు చేశారు. ఈ సొరంగాన్ని ప్రారంభించిన అనంతరం జమ్మూకశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ, గవర్నర్ వోహ్రాతో కలిసి ప్రధాని మోదీ ఫొటోలకు ఫోజు ఇచ్చారు. అనంతరం ఆయన ఉధంపూర్‌లో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారని తెలుస్తోంది.