రాళ్లు విసురుతున్న యువతపై ప్రధాని కామెంట్!
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో ఆదివారం తాను ప్రారంభించిన చెనానీ-నష్రీ సొరంగ మార్గాన్ని అభివృద్ధికి ప్రతీకగా ప్రధాని నరేంద్రమోదీ అభివర్ణించారు. జమ్మూకశ్మీర్ అభివృద్ధిలో ఈ సొరంగమార్గం అతిపెద్ద ముందడుగు అని పేర్కొన్నారు. ఉధంపూర్‌లో జరిగిన బహిరంగసభలో ప్రధాని మోదీ ప్రసంగించారు.
పర్యావరణానికి, హిమాలయాలకు ఏమాత్రం విఘాతం కలుగకుండా ప్రపంచస్థాయి ప్రమాణాలు, సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సొరంగ మార్గాన్ని నిర్మించామని, ఇందుకు కేంద్రం నిధులివ్వగా, దీని నిర్మాణంలో కశ్మీర్ యువత చెమటోడ్చడం ద్వారా రాష్ట్రాభివృద్ధికి తమ వంతు కృషి చేశారని కొనియాడారు. ఇటీవలికాలంలో కశ్మీర్ యువత తరచూ భద్రతా దళాలపై రాళ్లు విసురుతున్నారన్న వార్తలపై ప్రధాని మోదీ తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర యువత ముందు రెండు మార్గాలు ఉన్నాయని, ఒకటి టూరిజం కాగా, మరొకటి టెర్రరిజం.. ఈ రెండింటిలో ఏది కావాలో యువత నిర్ణయించుకోవాలని సూచించారు.
'ఒకవైపు తప్పుదోవ పట్టిన కొంతమంది యువత రాళ్లు విసురుతున్నారు. మరోవైపు అకుంఠిత దీక్ష కలిగిన కశ్మీర్ యువత అవే రాళ్లను దేశ నిర్మాణానికి ఉపయోగిస్తున్నారు. రక్తపాతం ద్వారా ఎవరూ లబ్ధిపొందరు. దానివల్ల ఎవరికీ ఎలాంటి మేలు ఒనగూడదు' అని మోదీ అన్నారు. తాజా సొరంగ నిర్మాణంలో కశ్మీర్ లో అభివృద్ధిని కొంత పుంతలు తొక్కిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.