కర్నూలులో జరిగిన సభలో అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ‘‘ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి అనేక ప్రాజెక్టులు మంజూరు చేశాం. రాష్ట్రానికి ఐఐఐటీ, ఐఐఎం, ఎన్‌ఐటీ, కేంద్రీయ, గిరిజన విశ్వవిద్యాలయం, పెట్రోలియం కాంప్లెక్స్ వంటి అనేక ప్రాజెక్టులను ఈ చౌకీదార్ ప్రధాని మంజూరు చేశారు. పోలవరానికి రూ.7 వేల కోట్ల నిధులు మంజూరు చేశాం. ఈ నిధులకు లెక్కలు చెప్పమని అడిగేసరికి ఆయన (చంద్రబాబు) యూటర్న్ తీసుకున్నారు. కేంద్రంపై విమర్శలు చేస్తున్నారు. తన రాజకీయ స్వార్థంకోసం తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ఆయన అబద్ధాలు చెబుతున్నారు. అంతేకాదు.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ యోజన, ఇళ్ల నిర్మాణం, గ్యాస్ కనెక్షన్ల మంజూరు వంటి పథకాలకు కేంద్రం స్టిక్కరు తీసేసి ఆయన స్టిక్కరు వేసుకుంటున్నారు. తద్వారా కేంద్రం నుంచి వచ్చే పథకాలను తమవని చెప్పుకుంటున్నారు. అందుకే ఆయన యూ టర్న్ బాబు... స్టిక్కర్ బాబు’’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు.
శుక్రవారం కర్నూలులో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల సభలో ప్రధాని ప్రసంగించారు. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు వైఖరిపై తనదైన శైలిలో ప్రధాని విమర్శనాస్త్రాలు సంధించారు. కేంద్రం మంజూరు చేసిన పథకాలకు తన స్టిక్కరు తగిలించుకోవడంతోపాటు మంజూరు చేసిన నిధులకు లెక్కలు అడిగేసరికి ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చి ఈ చౌకీదార్(మోదీ)ని ఓడించేందుకు అందరితో జతకడుతూ యూటర్న్ బాబుగా మారారని దుయ్యబట్టారు. సాధారణంగా ఏదైనా ఒక పథకం అమలులో అవినీతి జరుగుతుందని... కానీ రాష్ట్రంలో మాత్రం అవినీతి కోసమే పథకాలను రూపొందిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ రాష్ట్రంలో ప్రతి పనీ అవినీతిమయమేనన్నారు. తన కుటుంబం కోసమే ఆయన(చంద్రబాబు) పరిపాలన చేస్తున్నారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో కూడా ఆయన బంధుగణం, ఆయన ద్వారా లబ్ధి పొందినవారే పోటీ చేస్తున్నారన్నారు. రాష్ట్రానికి మరిన్ని పనులు చేసేందుకు కావాల్సిన ఆలోచనలు తన వద్ద ఉన్నాయని, కానీ ఇక్కడి ప్రభుత్వం సహకరించట్లేదని ప్రధాని చెప్పారు.
కొడుకు వికాసం కోసమే...!
‘‘సన్ రైజ్ ఏపీ.. సూర్యోదయ ఆంధ్రప్రదేశ్ అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటున్నారు. అయితే జరుగుతోంది ఎస్‌యుఎన్... సన్ సూర్యుడు కాదు... ఎస్‌ఓఎన్ సన్ రైజ్.. కొడుకు అభివృద్ధి కోసమే ఆయన పాలన చేస్తున్నారు’’ అని మోదీ ధ్వజమెత్తారు. సూర్యోదయ ఆంధ్రప్రదేశ్ కావాలా.. పుత్రోదయ ఏపీ కావాలా? అనే విషయాన్ని ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. బీజేపీకి ఓటేస్తే ఉదయించే ఏపీ ఏర్పడుతుందన్నారు. రాష్ట్రంలో పుత్రుడి భవిష్యత్తుకు సూర్యాస్తమయం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి కిసాన్ యోజన(పీఎంకేవై) కింద రైతులకు రూ.75 వేల కోట్ల సహాయం చేశామని... రాష్ట్రంలో దీనికి కూడా చంద్రబాబు తన స్టిక్కర్ వేసుకున్నారని ప్రధాని తప్పుపట్టారు. అదేవిధంగా కేంద్రం మంజూరు చేసిన 2.5 లక్షల ఇళ్లు, 3 లక్షల గ్యాసు కనెక్షన్ల మంజూరు, బీమా వంటి పథకాలకు పేరు మార్చి... చంద్రబాబు తన స్టిక్కరు అతికించుకున్నారని విమర్శించారు. ఆయన చంద్రబాబు కాదు.. స్టిక్కర్ బాబు, యూ టర్న్ బాబు అని ప్రధాని దుయ్యబట్టారు. దేశం కోసం కష్టపడుతున్న ఈ చౌకీదార్‌ను ఓడించడానికి... బెయిల్‌పై వచ్చిన వారితో చేతులు కలపి పని చేస్తున్నారని మండిపడ్డారు. దేశానికి సేవ చేస్తున్న ఈ చౌకీదార్‌ను ఓడించడానికి ఏకంగా పాకిస్తాన్ హీరో కావాలని చంద్రబాబు అనుకుంటున్నారని విమర్శించారు. బ్రిటీష్ వారిపై తిరగబడిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్ఫూర్తితో అవినీతి పార్టీ టీడీపీని ఓడించేందుకు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. అదేవిధంగా కుటుంబపాలనలో ఉన్న టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీలను ఓడించి.. రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీకి అధికారం ఇస్తే డబుల్ ఇంజన్ వేగంతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
ఏపీకి ఎన్నో ఇచ్చాం...!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక చౌకీదార్‌గా ఎన్నో ప్రాజెక్టులు మంజూరు చేశామని ప్రధాని తెలిపారు. తమ మొదటి కేబినెట్‌లోనే పోలవరం ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పించి మంజూరు చేసింది ఎవరని సభికులను ఆయన ప్రశ్నించారు. ‘‘అదేవిధంగా అనంతపురం జిల్లాలో కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేసింది ఈ చౌకీదారే. కర్నూలులో మెగా సోలార్ పార్కును ప్రారంభించిందీ ఈ చౌకీదారే. కర్నూలులో ట్రిపుల్‌ఐటీతోపాటు విశాఖకు రైల్వేజోన్, ఎన్‌ఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు మంజూరు చేసింది కూడా ఈ చౌకీదారేనని గుర్తుంచుకోవాలి. రాష్ట్రంలోనే మొట్టమొదటి గిరిజన యూనివర్సిటీతోపాటు విపత్తు నిర్వహణ సంస్థ ఏర్పాటు, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం యూనివర్సిటీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్యాకింగ్ వంటి వాటిని మంజూరు చేసిందీ ఈ చౌకీదారే.
పెట్రోలియం కాంప్లెక్స్‌కు అనుమతులిచ్చింది.. విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేసిందీ ఈ చౌకీదారే. అందుకే మరోసారి పట్టం కడితే దేశానికి, రాష్ట్రానికి మరింత సేవ చేస్తాం’’ అని మోదీ కోరారు. అంతేగాక విశాఖ, తిరుపతి, విజయవాడ విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా అభివృద్ధి చేయడంతోపాటు రాజమండ్రి విమానాశ్రయాన్ని విస్తరిస్తున్నామని వివరించారు. రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడి విలువ కలిగిన సాగరమాల ప్రాజెక్టుకు అనుమతులిచ్చామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని ప్రధాని చెప్పారు. రాయలసీమను రతనాల సీమగా అభివృద్ధి చేస్తామని హామీనిచ్చారు. వాల్మీకీల మనోభావాలు తనకు తెలుసని... వారికి న్యాయం చేస్తానని మోదీ ఈ సందర్భంగా చెప్పారు.
బాబుకు మళ్లీ అధికారం అప్పగిస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారు: కన్నా
సభలో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ దోపిడీదారుడైన చంద్రబాబుకు మళ్లీ అధికారం అప్పగిస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారని మండిపడ్డారు. ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని విమర్శించారు. ఆయన చంద్రబాబు కాదు... ‘చందా’బాబు అని బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ థియోడర్ అభివర్ణించారు. కార్యక్రమంలో కర్నూలు ఎంపీ అభ్యర్థి పార్థసారథితోపాటు ఎమ్మెల్యే అభ్యర్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment