శనివారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న నర్సారెడ్డి. చిత్రంలో ఒంటేరు ప్రతాప్‌రెడ్డి తదితరులు
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఓడిస్తామని ఆ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. గజ్వేల్ టీఆర్‌ఎస్ నేత, రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ తూంకుంట నర్సారెడ్డి, ఎమ్మెల్సీ రాములు నాయక్ శనివారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా పార్టీ కండువాలు కప్పి రాహుల్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జి ఆర్సీ కుంతియా, రాహుల్ కార్యాలయం కార్యదర్శి కొప్పుల రాజు, గజ్వేల్ కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. గత ఎన్నికల్లో తమ మధ్య పోటాపోటీగా జరిగిన పోరులో కేసీఆర్ స్వల్ప మెజారిటీతో గెలుపొందారని, అయితే ఇప్పుడు తామంతా ఒకటవడంతో కేసీఆర్‌ను ఓడించి గజ్వేల్‌లో కాంగ్రెస్‌ను గెలిపించి బహుమతిగా ఇస్తామని రాహుల్‌కు హామీ ఇచ్చినట్లు నర్సారెడ్డి, ఒంటేరు తెలిపారు.
ఆత్మగౌరవం ఉన్నవారు టీఆర్‌ఎస్‌లో ఉండరు: నర్సారెడ్డి
‘రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని గత ఎన్నికల అనంతరం కేసీఆర్ కోరితే తాను టీఆర్‌ఎస్‌లో చేరాను. రాజకీయ నాయకులు సేవ చేయాలనుకుంటే ప్రజల్లో ఉండాలనుకుంటారు. అయితే కేసీఆర్‌లో ఆ గుణం లేదు. టీఆర్‌ఎస్‌లో ఎవరికీ గౌరవం, విలువ ఇవ్వరు. కేసీఆర్ నిరంకుశ ధోరణితో ప్రజలకు దూరంగా ఉంటున్నారు. నేను గజ్వేల్ ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నా. అందుకే తిరిగి కాంగ్రెస్‌లో చేరుతున్నా. నాకు జరిగిన ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత ఎన్నడూ కేసీఆర్ నన్ను పరామర్శించలేదు. అయితే పీసీసీ చీఫ్ ఉత్తమ్ మాత్రం పాత పరిచయంతో నన్ను పరామర్శించారు. కాంగ్రెస్‌లో నేతలకు గౌరవం ఇస్తారు. తాను ఏ స్థానం నుంచి టికెట్ ఆశించట్లేదు. పార్టీ గెలుపు కోసం పనిచేస్తా’అని నర్సారెడ్డి అన్నారు.
30 సీట్లకు టీఆర్‌ఎస్ పరిమితం: రాములు నాయక్
‘టీఆర్‌ఎస్‌కు వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు వచ్చే అవకాశమే లేదు. ఆ పార్టీ 25–30 సీట్లతో ప్రతిపక్షానికే పరిమితం అవుతుంది. బంగారు తెలంగాణ కాస్త కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ తెలంగాణగా మారింది. కాంగ్రెస్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యం. కాంగ్రెస్‌లో చేరినందుకు సంతోషంగా ఉంది. గతంలో గిరిజనులకు జనాభా దామాషా ప్రకారం ఇందిరా గాంధీ ఇచ్చిన రిజర్వేషన్లను తిరిగి అమలు చేయాలని రాహుల్ గాంధీని కోరా. రాహుల్‌ను ప్రధానిగా చూస్తాం’అని రాములు నాయక్ అన్నారు.
20 వేల మెజారిటీలో ఉన్నాం: ఒంటేరు
‘గత ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే టీడీపీ తరఫున పోటీ చేసిన నాకు 68 వేల ఓట్లు, నర్సారెడ్డికి 34 వేలు, కేసీఆర్‌కు 86 వేల ఓట్లు వచ్చాయి. నాకు, నర్సారెడ్డికి వచ్చిన ఓట్లు కలిపితే ఇప్పుడు మేం 20 వేల మెజారిటీలో ఉన్నాం. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను కచ్చితంగా ఓడిస్తాం. కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తాం. గత నాలుగున్నరేళ్ల పాలనలో కేసీఆర్ చేసిందేమీ లేదు. మిషన్ కాకతీయ, మల్లన్న సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టులను రీడిజైన్ చేసి కమీషన్లు దొచుకోవడం తప్ప తెలంగాణ ప్రజల ఆశయాలను నెరవేర్చడంలో కేసీఆర్ విఫలమయ్యారు’అని ఒంటేరు ప్రతాప్‌రెడ్డి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment