
సాక్షి, అమరావతి: దేవినేని అవినాష్‌కు తెలుగు యువత పదవి కోసం ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు దగ్గరకెళ్లాం అంటూ టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇటీవల విజయవాడలో జరిగిన ఓ పార్టీ కార్యక్రమంలో బుద్దా చేసిన ఈ వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది. బుద్దా చేసిన ఈ వ్యాఖ్యలు టీడీపీకోసం ఇంటెలిజెన్స్ విభాగం పనిచేస్తోందనేందుకు నిదర్శనంగా నిలుస్తుండడమేగాక పార్టీ పదవుల కేటాయింపు, అధికారుల బదిలీల్లో ఇంటెలిజెన్స్ డీజీ కీలక పాత్ర పోషిస్తున్నారనేందుకు అద్దం పడుతున్నాయి. దీనిపై నెటిజన్లు ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం టీడీపీ అనుబంధమా అంటూ సెటైర్లు పేలుస్తుండడం విశేషం. అవినాష్‌కు తెలుగు యువత పదవి రావడానికి తనతోపాటు గద్దె రామ్మోహన్ కూడా కారణమని, తాము ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు దగ్గరకు వెళ్లి అవినాష్‌కు పదవి ఇవ్వాలని కోరామని బుద్దా ఇందులో చెప్పుకొచ్చారు.
వెంకటేశ్వరరావుకు చెప్పిన తర్వాత.. సీఎం చంద్రబాబును కూడా కలసి చెప్పడం జరిగిందని ఆయన సగర్వంగా వివరించుకున్నారు. ‘‘దేవినేని అవినాష్‌కు ఎక్కడినుంచి పోటీ చేయాలని ఉందో, అక్కడి నుంచి పోటీ చేస్తాడు.. అవన్నీ ఇప్పుడు చెప్పకూడదు’’ అంటూనే జరిగిన సంగతులన్నింటినీ ఆయన సభావేదిక సాక్షిగా బహిర్గతం చేశారు. ‘‘చంద్రబాబు నాయుడు ఏదైతే నెహ్రూ మోసగాడు కాదు అన్నారో.. మేము కూడా మోసగాళ్లం కాదు.. మమ్మల్ని నమ్ముకున్న వాళ్లకోసం ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎంత రిస్క్ అయినా పోరాటం చేయడం మా నేచర్. దేవినేని అవినాష్ యువత కూడా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అంతే కమిట్‌మెంట్‌తో పనిచేయాలి’’ అని బుద్దా అన్నారు.
తెలుగు యువత అధ్యక్ష పదవి రావడం మామూలు విషయం కాదని, అది ఒకప్పుడు ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ చేశారని చెప్పుకొచ్చారు. మరి ఆ పదవిని ఇప్పుడు అవినాష్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంత ప్రేమ.. మనోడు, మన మనిషి అని భావించి ఇచ్చారని బుద్దా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్నాయి. అంతేస్థాయిలో దీనిపై విమర్శలూ రేగుతున్నాయి.