
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లకు బీజేపీ కొత్త అధ్యక్షులు రాబోతున్నారని ఆ పార్టీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు చెప్పారు. ‘తెలంగాణ, ఏపీలో బీజేపీ ద్విగుణీకృతమైన ఉత్సా హంతో ముందుకు సాగే అవకాశం ఉంది. మొన్న జరిగిన తెలంగాణ మున్సి పల్ ఎన్నికల్లో ఓట్ల శాతం పెరగడమే కాకుండా.. కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ లేకుండా పోయింది. ఇక్కడ బీజేపీనే టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయమని స్పష్ట మైన సంకేతాలు వెలువడ్డాయి. ఏపీలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అక్కడా తొందరగా మార్పులు వచ్చే అవకాశం ఉంది..’అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్,బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలసిన అనంతరం విద్యాసాగర్‌రావు మీడియాతో మాట్లాడారు.
సీఏఏతో నష్టం లేకున్నా..
టీఆర్‌ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని విద్యాసాగర్‌రావు అన్నారు. ‘సీఏఏలో ఎలాంటి నష్టదాయక చర్యలు లేకున్నప్పటికీ దానిపై తుపాకీ పెట్టి నరేంద్రమోదీ, బీజేపీకి వ్యతిరేకంగా విమర్శలు గుప్పిస్తున్నారు. సీఏఏపై మజ్లిస్, టీఆర్‌ఎస్‌ల ఆలోచన ప్రమాదకరమైనది. ప్రతిపక్షాల ఆలోచనలు దేశానికే నష్టం కలిగించేలా ఉన్నాయి. వీటిని అణచాల్సిన బాధ్యత బీజేపీపై ఉంది. కాబట్టి ఆ దిశగా ముందుకెళ్తాం. ముస్లిం సోదరుల పౌరసత్వం తిరస్కరణకు గురవుతుందన్న ఆలోచన సరికాదు. ఇప్పుడున్న చట్టం ప్రకారం ఒక ముస్లిం వ్యక్తి దరఖాస్తు చేసుకుంటే హోంశాఖ ఇస్తుంది.
నేను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు పాకిస్తాన్ నుంచి వచ్చిన యువతికి పౌరసత్వం ఇచ్చాను. అందువల్ల మీ ఆలోచన సరికాదు. జాతి సమైక్యతకు ఎన్‌ఆర్సీ, సీఏఏ, ఎన్పీఆర్‌ల అవసరం ఎంతో ఉంది. ముస్లిం యువత జాతీయ జెండాలతో బయటకు వస్తుండటం ఆహ్వానించదగ్గ పరిణామం. నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్న ముస్లిం యువత వందేమాతరం, జనగణమన ఆలపించి కార్యక్రమాన్ని ముగించగలరా..? తెలంగాణలో పార్టీ కార్యక్రమాలపై చర్చిస్తాం. సెప్టెంబర్ 17కు సంబంధించి తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా అమలు చేయాలని నిరసనలు చేపడతాం..’అని వెల్లడించారు. బీజేపీ కార్యకర్తగా పార్టీ ఇచ్చే కార్యక్రమాలు అమలు చేస్తాను..’అని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment