హైదరాబాద్: వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై పోటీ చేయనున్నట్టు ప్రకటించిన నిజామాబాద్‌కు చెందిన వారు టీఆర్‌ఎస్ కార్యకర్తలేనని, వారిలో పసుపు రైతులు లేరని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానంటూ 2014 ఎన్నికల్లో హామీనిచ్చి విస్మరించిన కల్వకుంట్ల కవిత కనుసన్నల్లో జరుగుతున్న రాజకీయ డ్రామా అని ఆరోపించారు. ఇటీవలి ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీ చేసిన రైతుల్లో వీళ్లు లేరని, అప్పుడు పోటీ చేసిన వారు కవితపై కోపంతో మనస్ఫూర్తిగా పోటీ చేశారని గుర్తు చేశారు. బుధవారం మధ్యాహ్నం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
ఇదంతా సమ్మర్ ప్యాకేజీ వ్యవహారం..
తన మీద రైతులు గుర్రుగా ఉన్న విషయాన్ని పక్క దారి పట్టించేందుకు కవిత కావాలనే కొందరు టీఆర్‌ఎస్ కార్యకర్తలను సిద్ధం చేసి మోదీపై పోటీకి పంపుతున్నారని అరవింద్ అన్నారు. వీరంతా ఇటీవలి ఎన్నికల్లో గులాబీ కండువాలు కప్పుకుని టీఆర్‌ఎస్ కోసం పనిచేసిన ఆ పార్టీ కార్యకర్తలేనని పేర్కొన్నా రు. మోదీపై పోటీ చేయనున్నట్టు ప్రకటించిన వారి పేర్లు, టీఆర్‌ఎస్‌తో వారికున్న సంబంధాలను వెల్లడించారు. ఇదంతా సమ్మర్ ప్యాకేజీ వ్యవహార మ న్నారు.
నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని 2014 ఎన్నికల్లో బీజేపీ వాగ్దానం చేయలేదని, అది కవిత హామీ మాత్రమేనని గుర్తు చేశారు. ఆ ఎన్నికల్లో గెలిచిన కవిత విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లకుండా, ఇతర రాష్ట్రాల సీఎంల దృష్టికి తీసుకెళ్తూ రాజకీయం చేయడానికే పరిమితమమయ్యార ని విమర్శించారు. కానీ ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ పసుపు బోర్డు విషయంలో స్పష్టమైన హామీ ఇచ్చిందని, దాన్ని కచ్చితంగా సాధిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment