
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని ఉస్మానియా యూని వర్సిటీ లోపలికి అనుమతించే విషయంపై సస్పెన్స్ నెలకొంది. యూనివర్సిటీల్లోకి రాజకీయ నాయకులు ప్రసంగాలు అనుమతించవద్దన్న ఉన్నత స్థాయి నిర్ణయాన్ని రాహుల్ విషయంలో అమలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 14న మధ్యాహ్నం 2 నుంచి ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ ఎదుట బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘాలు నిర్ణయించి ఈ మేరకు అనుమతి కోసం శనివారం వైస్ చాన్స్‌లర్‌కు వినతిపత్రం సమర్పించాయి.
దీనికి ప్రతిగా కొన్ని విద్యార్థి సంఘాలు రాహుల్ వస్తే అడ్డుకుంటా మని ఆదివారం ర్యాలీ నిర్వహించాయి. దీంతో ఆర్ట్స్ కాలేజీ సమీపంలో నిర్వహించతలపెట్టిన బహిరంగ సభ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని ఠాగూర్ ఆడిటోరియంలో ‘భారత్‌లో విద్య– ఉపాధి’అనే అంశంపై రాహుల్‌తో ఉపన్యాసం ఇప్పించేందుకు అనుమతివ్వాలని వీసీని కోరా లని కొన్ని విద్యార్థి సంఘాలు నిర్ణయించాయి. ఈ మేరకు సోమవారం భారీ ర్యాలీగా వెళ్లి వీసీకి మరో వినతిపత్రం సమర్పించనున్నాయి.
ఇంకా నిర్ణయం తీసుకోలేదు: వీసీ
రాహుల్‌గాంధీ ఓయూలో సభ నిర్వహించేందు కు అనుమతించాలని కొన్ని విద్యార్థి సంఘాలు ఇచ్చిన విజ్ఞాపనపై ఇంత వరకు నిర్ణయం తీసుకోలేదని వీసీ రామచంద్రం తెలిపారు. ఆయన ఆదివారం సాక్షితో మాట్లాడుతూ.. రాహుల్‌కి జెడ్ కేటగిరీ భద్రత కల్పించే స్థితి లేదని, ఆయన నిజాం కాలేజీ లేదా కోఠి ఉమెన్స్ కాలేజీల్లో నిర్వ హించుకునే అంశాలను పరిశీలిస్తామన్నారు.