సాక్షి, అమరావతి : తనపై ఎప్పుడైతే రాళ్లదాడి జరిపారో అప్పుడే భూమా కుటుంబంతో తనకున్న సంబంధాలు తెగిపోయాయని టీడీపీ నేత, దివంగత భూమా నాగిరెడ్డి సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డి అన్నారు. ఇక నుంచి ఆ కుటుంబాన్ని రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తానని ఆయన వ్యాఖ్యానించారు. ఆళ్లగడ్డలో సైకిల్ ర్యాలీ సందర్భంగా ఏవీ సుబ్బారెడ్డిపై రాళ్లదాడి జరిగిన విషయం తెలిసిందే. తనపై మంత్రి అఖిలప్రియే రాళ్ల దాడి చేయించారంటూ ఏవీ సుబ్బారెడ్డి అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అఖిలప్రియతో పాటు ఏవీ సుబ్బారెడ్డి అమరావతి రావాల్సిందిగా ఆదేశాలు అందాయి. అయితే అధిష్టానం నుంచి తనకు ఎలాంటి సమాచారం లేదంటూ అఖిలప్రియ ఆళ్లగడ్డలోనే ఉండిపోయారు. దీంతో ఆళ్లగడ్డ పంచాయితీ రేపటికి వాయిదా పడింది. మరోవైపు ఏవీ సుబ్బారెడ్డి ..అందుబాటులో ఉన్న పార్టీ సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. తనపై జరిగిన రాళ్లదాడి ఘటనకు సంబంధించిన ఆధారాలు అందచేశారు.
ఈ సందర్భంగా ఏవీ సుబ్బారెడ్డి అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ...‘ఏమైనా ఉంటే రాజకీయంగా చూసుకోవాలి. రాళ్లదాడులు సరికాదు. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. దాడికి సంబంధించిన ఆధారాల్నీ ముఖ్యమంత్రికి అందచేస్తా. పార్టీ ఆదేశాల మేరకే సైకిల్ ర్యాలీ చేశారు. రాజకీయంగా వారికి అడ్డు వస్తున్నాననే నాపై దాడులు చేస్తున్నారు. రాళ్లదాడి చెత్త. ఇలాంటివి చాలానే చూశాను. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదు. ఏవీ సుబ్బారెడ్డి అంటే భయం, భక్తి లేదు. కనీసం వయస్సుకు కూడా పెద్దరికం ఇవ్వలేదు. ప్రత్యర్థులు కూడా నాపై దాడి చేయడానికి సాహసం చేయరు. అలాంటిది ఆమె నాపైనే దాడి చేయిస్తుందా?.
అఖిలప్రియ భయపడుతోంది..
నా ఉనికికే ప్రమాదం వచ్చినప్పుడు స్పందించాలి కదా. మంత్రి సైకిల్ ర్యాలీ కంటే నాకే ఎక్కువ ఆదరణ లభించింది. అఖిలప్రియ తన గ్రాఫ్ పడిపోతోందని భయపడుతోంది. అందుకే ఇటువంటి చర్యలకు పాల్పడుతోంది. చిన్నప్పటి నుంచి ఆమె తెలుసు. అలాంటిది ఆమె గురించి మాట్లాడాలంటే నా పెద్దిరికం అడ్డు వస్తోంది. అందుకే నా తరఫున నా కూతురు మాట్లాడింది. ఇంత జరిగాక, ఆ కుటుంబంతో ఎలాంటి సంబంధాలు ఉండవు. అయితే రాజకీయపరంగా అధిష్టానం చెప్పినట్లు వినాల్సిందే. ఇక వ్యక్తిగతంగా వస్తే భూమా నాగిరెడ్డి కుటుంబంతో ఉన్న అనుబంధానికి తెరపడినట్లే. సీఎంతో సమావేశానికి అఖిల ఎందుకు రాలేదో అర్థం కాలేదు. రేపు సాయింత్రం సీఎంతో సమావేశం అవుతున్నాం.’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment