సాక్షి, విజయవాడ : ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తున్న ప్రభుత్వానికి మద్దతు ఇస్తూనే ఉంటానని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అన్నారు. రాజధాని విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న సాహసం గొప్పదని ఆయన పేర్కొన్నారు. కృష్ణాజిల్లా గుడివాడలో ఎన్టీఆర్ టు వైఎస్సార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలు జాతి ఎద్దుల బండలాగుడు పోటీలను మంత్రి కొడాలి నానితో కలిసి ఎమ్మెల్యే రాపాక ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మా నాయకుడు పవన్ కల్యాణ్‌కు నాకు మధ్య ఎటువంటి చర్చలు ఉండవు. ఇక్కడకు రావటంలో ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదు. నా అభిప్రాయాలను నేను కచ్చితంగా చెప్తాను. రాజధాని రైతులు రోడ్డు మీద ధర్నాలు చేసే బదులు ముఖ్యమంత్రిని కలిస్తే న్యాయం జరుగుతుంది. ఎడ్ల పందేలంటే ఇష్టంతోనే గుడివాడ వచ్చాను. నన్ను ఈ పందేలకు ఆహ్వానించిన మంత్రి కొడాలి నాని కి ధన్యవాదాలు’అన్నారు.
(చదవండి : మూడు రాజధానులు మంచిదే)
గ్రాఫిక్స్ రాజధాని కాదు.. మూడు ప్రాంతాల అభివృద్ధి
23 సీట్లిచ్చి ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా చంద్రబాబుకు బుద్ధి రాలేదని మంత్రి కొడాలి నాని అన్నారు. ఉద్యమాల పేరుతో బాబు రాజధాని రైతులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబులాగా గ్రాఫిక్స్ రాజధాని కాకుండా మూడు ప్రాంతాల్ని అభివృద్ధి చేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. రాజకీయ భవిష్యత్తు కోసం ఎంత మందినైనా వాడుకుని వదిలివేయటం చంద్రబాబు కు అలవాటని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన ఆయనకు జోలె పట్టుకొని రాజకీయం చేయడం పెద్ద విషయం కాదని అన్నారు. బాబు మాటలు విని రాజధాని రైతులు మోసపోవద్దని కోరారు. రైతులకు ఏమి కావాలో చర్చిస్తే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి అన్నారు. రాపాక వరప్రసాద్ నాకు మంచి మిత్రుడని మంత్రి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment