
సాక్షి, చెన్నై: కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలపై సవతి ప్రేమ చూపిస్తోందని, దక్షిణాది రాష్ట్రాల నుంచి కేంద్రానికి అధికమొత్తంలో పన్నుల సొమ్ము చేరుతున్నా... మోదీ సర్కారు మాత్రం తమ రాష్ట్రాలకు తగినంత వాటా తిరిగి ఇవ్వడం లేదని దక్షిణాది ముఖ్యమంత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. దక్షిణాది నుంచి వెల్లువెత్తుతున్న అసంతృప్తుల నేపథ్యంలో ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సహకార సమాఖ్యవాదానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన గురువారం చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు. ఏ ఒక్క ప్రాంతం పట్ల వివక్ష చూపించడం లేదంటూ వారి అసంతృప్తిని తగ్గించే ప్రయత్నం చేశారు.
చెన్నై పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి భారీ నిరసనలు స్వాగతం పలికాయి. కావేరి జలాల వివాదం నేపథ్యంలో మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వమించారు. ఓ భారీ నల్లరంగు బెలూన్‌ను గాలిలోకి వదిలారు. అటు సోషల్ మీడియాలోనూ గోబ్యాక్‌మోదీ హాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
జనాభా నియంత్రణ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలు తమ రాష్ట్రాలను దెబ్బతీసేలా ఉన్నాయని దక్షిణాది నేతలు వ్యక్తం చేస్తున్న ఆందోళనను ప్రధాని మోదీ తోసిపుచ్చారు. ‘15వ ఆర్థిక సంఘం సిఫారసులు కొన్ని రాష్ట్రాలు, ఓ ప్రాంతం పట్ల వివక్ష చూపేలా ఉన్నాయంటూ నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. జనాభా నియంత్రణ కోసం కృషి చేస్తున్న రాష్ట్రాలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని కేంద్రం ఆర్థిక సంఘానికి సూచించింది. ఈ విషయంలో ఎంతో కృషి చేస్తూ.. వనరులు వినియోగిస్తున్న తమిళనాడు రాష్ట్రం లబ్ధి పొందనుంది’ అని ప్రధాని మోదీ అన్నారు. ‘సహకార సమాఖ్యవాదానికి కేంద్రం కట్టుబడి ఉంది. ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్’ మా మంత్రం. అందరూ కలిసి పనిచేసి.. మన స్వాతంత్ర్య పోరాటయోధులు గర్వపడే నవభారతాన్ని నిర్మిద్దాం’ అని మోదీ అన్నారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా కేంద్ర వాటాను రాష్ట్రాలకు ఇవ్వాలంటూ 15వ ఆర్థిక సంఘానికి కేంద్ర ప్రభుత్వం సూచించడంపై దక్షిణాది రాష్ట్రాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జనాభా నియంత్రణలో విఫలమైన ఉత్తరాది రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ వంటివాటికి ప్రత్యేక రాయితీలు ఇస్తూనే.. కేవలం దక్షిణాది రాష్ట్రాలకు నిధుల కోత పెట్టేందుకు జనాభా నియంత్రణ ప్రాతిపదికను తీసుకొస్తున్నారంటూ దక్షిణాది రాజకీయ నేతలు విమర్శిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment