సాక్షి అమరావతి : ఎన్నికల సందర్భంగా ఓటర్లను డబ్బుతో కొనడం, ఓటర్లకు డబ్బు, రకరకాల వస్తువులను పంపిణీ చేసి ప్రలోభపెట్టడం మనదేశంలో సర్వసాధారణంగా మారింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 123(1) ‘లంచగొండితనం’ గురించి స్పష్టమైన నిర్వచనాన్ని ఇస్తోంది. అభ్యర్థి లేదా అతని తరఫున ఎవరైనా వ్యక్తి, ఇతరులను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రలోభపెట్టేందుకు బహుమతి, ఉచిత కానుక, హామీ ఇవ్వడం లంచగొండితనం కిందకు వస్తుందని ఈ సెక్షన్ చెబుతోంది. ఎన్నికల్లో ఓ అభ్యర్థి పోటీ చేసేందుకు, పోటీ చేయకుండా ఉండేందుకు, పోటీ నుంచి ఉపసంహరించుకునేందుకు, ఉపసంహరించుకోకుండా ఉండేందుకు ప్రలోభ పెట్టడం, ఓటు వేయడానికి, వేయకుండా ఉండేందుకు ఓటరును ప్రభావితం చేయడమూ లంచగొండితనమే అవుతుంది. అలాగే ఐపీసీ సెక్షన్ 171(బీ) కూడా లంచగొండితనానికి వివరణిచ్చింది. ఓటు హక్కును వినియోగించుకునే విషయంలో ఓటరును ఏ రకంగా ప్రలోభపెట్టినా అది నేరమే అవుతుందని ఈ చట్టంలో ఉంది. స్వేచ్ఛగా సాగే ఎన్నికల్లో జోక్యం చేసుకొంటూ ఓటర్లను ప్రభావితం చేయడం నేరమని ఐపీసీ సెక్షన్ 171(సీ) చెబుతోంది. అయితే ఇలా ఎన్నికల్లో లంచగొండితనానికి పాల్పడితే అది ప్రస్తుతం బెయిల్ ఇవ్వదగ్గ నేరంగానే ఉంది.– యర్రంరెడ్డి బాబ్జీ, సాక్షి అమరావతి
కాగ్నిజబుల్ నేరంగా పరిగణించాలని..
ఎన్నికల్లో లంచగొండితనాన్ని కట్టడి చేసేందుకు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని భావించి, ఎన్నికల సంఘం 2012లో కేంద్ర హోంశాఖకు ఓ ప్రతిపాదన చేసింది. ఎన్నికల్లో లంచగొండితనాన్ని కాగ్నిజబుల్ (విచారణకు స్వీకరించదగ్గ) నేరంగా పరిగణించాలని, ఆ మేర చట్ట సవరణ చేయాలని కోరింది. కాగ్నిజబుల్ నేరం అయితే వారెంట్ లేకుండా ఉల్లంఘనలకు పాల్పడిన వ్యక్తిని నేరుగా అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఉంటుంది. సులభంగా బెయిల్ ఇచ్చేందుకు ఆస్కారం ఉండదు. 2 ఏళ్ల జైలు శిక్ష విధించవచ్చు. అయితే ఈ ప్రతిపాదన ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. దీనిపై 2018లో సుప్రీంలో పిటిషన్ దాఖలైంది. దీనిపై ధర్మాసనం.. కేంద్రం, ఎన్నికల సంఘంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల్లో లంచగొండితనాన్ని కాగ్నిజబుల్ నేరంగా ఎందుకు పరిగణించరాదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 24కు వాయిదా వేసింది.
ఓటుకు నోటు కేసు...
ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబునాయుడు కూడా ఎన్నికల్లో లంచగొండితనానికి పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయారు. 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు అప్పటి టీడీపీ కీలక నేతగానున్న రేవంత్‌రెడ్డి చేత రూ.5 కోట్లు ఇవ్వజూపి, అడ్వాన్స్‌గా రూ.50 లక్షలు పంపారు. అనంతరం స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు స్వయంగా సెల్‌ఫోన్‌లో మాట్లాడారు. తన సన్నిహితుడు మత్తయ్య ద్వారా చంద్రబాబు ఇదంతా నడిపించారు. స్టీఫెన్‌సన్ ఇంటిలో జరిగిన, ఈ ఘటన మొత్తం వీడియోగ్రఫీ కావడంతో చంద్రబాబు, రేవంత్ తదితరులు అడ్డంగా దొరికిపోయారు. రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ‘ఓటుకు నోటు’ కేసుగా ఇది రెండు రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందింది. ‘బ్రీఫ్డ్ మీ’ అంటూ స్టీఫెన్‌సన్‌తో మాట్లాడిన చంద్రబాబు మాటలు దేశవ్యాప్తంగా అందరూ విన్నారు. ఆ గొంతు తనది కాదని చంద్రబాబు ఇప్పటి వరకు చెప్పలేదు. స్టీఫెన్‌సన్‌తో మాట్లాడిన ఆడియోలో ఉన్నది చంద్రబాబు స్వరమేనని కొన్ని ల్యాబ్‌లు కూడా నిర్ధారించాయి. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment