మనుషుల పట్ల గుండె లోతుల్లో ప్రేమ...కళ్లలో ఆత్మవిశ్వాసం.. జీవితంలో ఔన్నత్యం.. ఆయన సొంతం..శక్తివంతులంతా కలిసి ఒక్కుమ్మడిగా మీదకొచ్చినా.. అదరలేదు, బెదరలేదు..ఒంటరిగా ప్రవాహానికి ఎదురీదుతున్న ధీశాలి..ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆశయ సాధనలో ముందుకుసాగాలనే సంకల్పంఎక్కడున్నా... ఏం చేసినా.. ఏం మాట్లాడినా... విలువలే ఆలంబన, జన శ్రేయస్సే నైజం..అందుకే ఆయన ఓ సంచలనం.. ఓ ప్రభంజనం.. ఆయన మాటే ఓ జన కెరటం...
ప్రజలపై ప్రేమ, సమభావం
తన వద్ద పనిచేస్తున్న ఉద్యోగులకు తాను టీ తాగితే టీ ఇస్తారు. తాను జ్యూస్ తాగితే జ్యూస్ ఇస్తారుతప్ప వేరేలాగ చూడరు. తన దగ్గర పనిచేసే ఉద్యోగులను అన్నా అని సంభోదిస్తారు తప్ప ఉద్యోగిగా చూడని గొప్ప మనసు గల వ్యక్తి జగన్. ఎదుట మనిషిని చిన్న అయినా పెద్ద అయినా ఒకేలాగ గౌరవం ఇస్తారు. సుదీర్ఘ పాదయాత్రలో మహిళలు, వృద్ధులు, వికలాంగులు కనిపిస్తే చాలు ఆగి వారిని పలకరించి వారి కష్టాలను తెలుసుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు. నిలబడలేని వికలాంగులు కనిపిస్తే..జగన్ కాళ్ల మీద కూర్చుని మరీ పలకరించారు. పాదయాత్రలో కుష్టు వ్యాధిగల వ్యక్తులను కూడాదగ్గరకు తీసుకునే కారుణ్య గుణం కలిగిన నేత. ఎన్నికల మేనిఫెస్టో తనకు పవిత్ర గ్రంథమని జగన్‌విశ్వసిస్తారు. అందులో ఇచ్చే హామీలు నెరవేర్చకపోతే.. మళ్లీ ఓటు అడిగే హక్కు ఉండకూడదని ఆయన ఘంటాపథంగా చెబుతారు. ఈ కారణాలన్నింటి వల్లే రాజ్యాంగ విలువలు, మానవీయ భావజాలం, ప్రజాస్వామ్య సిద్ధాంతాలకు పూర్తిగా కట్టుబడి రాజకీయాలు చేస్తూ.. జగన్ అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారని పరిశీలకులు ప్రశంసిస్తున్నారు. అధికారంలోకి రాగానే ‘పార్టీలు చూడం... కులాలు చూడం... మతాలు చూడం.. రాజకీయాలు చూడం.. అందరికీ సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు అందిస్తాం’అని వైఎస్ జగన్ విస్పష్టంగా ప్రకటిస్తుండటాన్ని అందరూ స్వాగతిస్తున్నారు.
సాక్షి, అమరావతి :ఇచ్చిన మాట కోసం, విలువల కోసం వైఎస్ జగన్ ఎంతగా కట్టుబడతారో అనడానికి పదేళ్లుగా ఆయన అప్రతిహతంగా సాగిస్తున్న ప్రజాప్రస్థానమే నిదర్శనం. 2010లో కాంగ్రెస్‌ను వీడి తనదైన విలువల బాటలో రాజకీయ ప్రయాణం మొదలుపెట్టాక.. అడుగడుగునా ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. అందరూ ఒక్కటై కుట్రలు చేసినా.. అక్రమ కేసులు పెట్టి వేధించినా.. మోసపూరిత హామీలతో ప్రజల్ని వంచించి తనకు అధికారం దక్కకుండా చేసినా.. తన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను ప్రలోభపెట్టి కొనుగోలు చేసినా.. జగన్ మాత్రం విలువలకే కట్టుబడ్డారు. సిద్ధాంతాలకు నిబద్ధుడై నిలబడ్డారు.
తండ్రి రెక్కల కష్టాన్ని కూల్చనంటూ
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణానంతరం దాదాపు అందరూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాలని ఆకాంక్షించారు. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసి మరీ అధికారంలోకి వద్దామని కొందరు సూచించారు. అందుకు జగన్ ఏమాత్రం సమ్మతించలేదు. ‘మా నాన్న రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వాన్ని కూల్చను. ప్రజలే నా భవిష్యత్‌ను నిర్ణయిస్తారు’ అని చెప్పి విలువలకు కట్టుబడ్డారు.
పదవులను త్యజించి మరీ
‘కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ మరో నాలుగేళ్లు అధికారంలో ఉంటుంది. అంతవరకు కాంగ్రెస్‌లో కొనసాగి లబ్ధి పొందవచ్చు. ఇప్పుడు కేంద్రమంత్రి పదవి ఇస్తారు. కొన్నాళ్ల తరువాత సీఎం పదవి కూడా ఇస్తారు’అని కాంగ్రెస్ అధిష్టానం తరపున కేంద్రమంత్రి గులాంనబీ ఆజాద్ రాయబారం నడిపారు. కానీ పదవుల కంటే ప్రజలకు ఇచ్చిన మాటే తనకు ముఖ్యమని వైఎస్ జగన్ తేల్చిచెప్పి.. కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. కడప ఎంపీ పదవికి వైఎస్ జగన్, పులివెందుల ఎమ్మెల్యే పదవికి వైఎస్ విజయమ్మ రాజీనామా చేశారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై మరీ ఆయనపై అక్రమ కేసులు పెట్టాయి. అప్పుడు కూడా మళ్లీ కాంగ్రెస్‌లోకి తిరిగి వస్తే కేసులు లేకుండా చూస్తామని కబురు పంపారు. కానీ వైఎస్ జగన్ మాత్రం తాను నమ్మిన విలువలు, సిద్ధాంతాలకే కట్టుబడ్డారు.
అవిశ్వాస తీర్మానం... పదవుల త్యాగం
2011లో అప్పటి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై అసెంబ్లీలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని వైఎస్సార్‌సీపీ బలపరిచింది. అప్పటికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఉన్న 16మందితోపాటు పీఆర్పీ ఎమ్మెల్యే ఒకరు, టీడీపీ ఎమ్మెల్యే ఒకరు కూడా వైఎస్సార్ సీపీ పక్షాన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. అలా ఓటు వేస్తే ఎమ్మెల్యే పదవులను కోల్పోతారని వైఎస్ జగన్‌కు తెలుసు. కానీ పదవుల కంటే కూడా రైతుల సంక్షేమమే ముఖ్యమని చెప్పి అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. అందుకే అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్‌సీపీని 15 నియోజకవర్గాల్లో గెలిపించారు. అదేవిధంగా 2013లో కూడా కిరణ్ ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. స్పీకర్ అనర్హత వేటు వేస్తారని తెలిసినప్పటికీ కూడా.. జగన్ వెంట ఉన్న కాంగ్రెస్, టీడీపీలకు చెందిన 15మంది ఎమ్మెల్యేలు వైఎస్సార్‌సీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చారు. తమ పదవులను త్యజించారు. ఆ విధంగా వైఎస్ జగన్ మొదటి నుంచీ కూడా తనతోపాటు తన వెంట వచ్చిన ఎమ్మెల్యేలను కూడా విలువలతో కూడిన రాజకీయాలే అనుసరించేలా చేశారు.
మోసపుచ్చే హామీలు ఇవ్వలేదు
2014 ఎన్నికల హామీల విషయంలోనూ జగన్ తన నిబద్ధతను చాటుకున్నారు. ఓ వైపు చంద్రబాబు అసాధ్యమైన, అబద్ధపు హామీలు ఇష్టానుసారంగా ఇచ్చేస్తున్నారు. దీన్ని ప్రస్తావిస్తూ కొందరు సన్నిహితులు జగన్‌తో.. ‘మనం కూడా రైతులకు రుణమాఫీ వంటి హామీలు ఇద్దాం’ అని చెప్పారు. అందుకు జగన్ ఏమాత్రం సమ్మతించలేదు. ‘అధికారంలోకి రావడం ముఖ్యమే. అంతకన్నా విశ్వసనీయతను కాపాడుకోవడం ప్రధానం. సాధ్యమయ్యే హామీలే ఇద్దాం. మనం నిజాయతీగా ఉందాం. అంతిమ నిర్ణయం ప్రజలకు విడిచిపెడదాం’ అని కుండబద్దలు కొట్టారు.సామాన్యుల చెంతకు రాజకీయంటీడీపీ తరపున రాజ కుటుంబీకులు, కార్పోరేట్ పెద్దలు, బడా కాంట్రాక్టర్లు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో.. జగన్ తమ పార్టీ తరపున సామాన్యులను బరిలో నిలిపారు.
హిమాలయ శిఖరం.. ఆ ఉన్నత వ్యక్తిత్వం
ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని దగ్గరగా చూసిన వారు.. సమకాలీన రాజకీయాల్లో ఆయన విలక్షణ వ్యక్తిత్వం చూసి ఆశ్చర్యపోతుంటారు. ఎందుకంటే.. ప్రస్తుత సీఎం చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా.. వైఎస్ జగన్ రాజకీయాల్లోకి రాకముందు నుంచే ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు దుష్ప్రచారానికి పాల్పడ్డారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడిగా, ప్రతిపక్ష నేతగా.. ప్రజాసమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తున్నా.. జగన్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు అసెంబ్లీలోనూ, బయటా చంద్రబాబు అండ్ కో చేయని ప్రయత్నం లేదు. వైరి పక్షం ఎంతగా రెచ్చగొడుతున్నా.. జగన్ ఎక్కడా సహనం కోల్పోలేదు.. ఎన్నడూ మాట తూలలేదు. గత తొమ్మిదేళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎంతో పరిణతితో, సంయమనంతో వ్యవహరించారు. పాదయాత్రలో గానీ, మరెక్కడైనా గానీ ఎవ్వరికైనా సాయం చేస్తానని మాట ఇస్తే.. ఆ మాట నెరవేరిందా లేదా అనేది స్వయంగా తనే పర్యవేక్షణ చేస్తారు. ఒక్కసారి మాట ఇస్తే... ఎంత కష్టమైనా దానికి కట్టుబడి ఉండే గుణం ఆయన సొంతం.
సత్యమేవ జయతే..
ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో ప్రజల పక్షాన గళమెత్తడంలో కూడా వైఎస్ జగన్ చాలా హోంవర్క్ చేస్తారు. ఏది పడితే అది మాట్లాడేందుకు ఆయన అసలు ఇష్టపడరు. రేపు అసెంబ్లీలో ప్రజలకు సంబంధించిన ఏ అంశాన్ని ప్రస్తావించాలనుకుంటారో.. ఆ అంశంపై ముందు రోజు నుంచి చాలా సీరియస్‌గా అధ్యయనం చేస్తారు. ఇందుకోసం పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థిలా తెల్లవారుజామున 4 గంటల నుంచే అధ్యయనం చేస్తారు. ఏ అంశం గురించైనా ఎవరితో మాట్లాడితే అసలు విషయాలు తెలుస్తాయనుకుంటే.. వారితో ఆయనే స్వయంగా మాట్లాడి ధృవీకరించుకుంటారు.
ఆరునూరైనా... నిర్ణయానికి తిరుగుండదు
ప్రతిపక్ష నేతగా ప్రజల సమస్యల విషయంలోనైనా.. పార్టీ కార్యకలాపాల అంశంలోనైనా.. ఎవరు ఏమి చెప్పినా సావధానంగా వింటారు జగన్. ఆ క్రమంలో ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేసుకుంటారు. ముందే అన్ని కోణాల్లో లోతుగా ఆలోచించాకే నిర్ణయం తీసుకుంటారు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే.. ఎంత కష్టమైనా దానికి కట్టుబడి ఉండే æమనస్తత్వం గల నేత జగన్. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలని ఒకసారి లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాక... ప్రతిపక్ష నేతగా ప్రత్యేక హోదాపై దీక్షలతోనే సరిపుచ్చలేదు. అసెంబ్లీలో ప్రస్తావించి వదిలేయలేదు. ప్రతీ జిల్లాలో యువభేరి సదస్సులను నిర్వహించి.. యువతలో ప్రత్యేక హోదాపై అవగాహన కల్గించారు. ప్రత్యేక హోదాతో ఏం వస్తుందని ముఖ్యమంత్రి హేళనచేస్తూ మాట్లాడినా తన అభిప్రాయం మార్చుకోలేదు. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా ఇవ్వద్దని చెప్పిందని చంద్రబాబు చెప్పగా.. అందులో వాస్తవం ఉందా లేదా అనే దానిపై విస్తృత అధ్యయనం చేశారు. అసెంబ్లీలో సీఎంను నిలదీయడానికి అవసరమైన ఆధారాలను సేకరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు ఎంత అవాస్తవమో శాసనసభలో సోదాహరణంగా వివరించారు. ప్రత్యేక హోదాపై ఇటు రాష్ట్రంపైన, కేంద్రంపైనా రాజీలేని పోరాటం చేసిన వ్యక్తి ఒక్క జగన్ మాత్రమే.
పొత్తులకు, పదవులకు వెంపర్లాడలేదు
2011లో కడప ఎంపీ, పులివెందుల ఎమ్మెల్యేస్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లోనే తమది లౌకికవిధానమని జగన్ స్పష్టం చేస్తూ ఏ పార్టీతో పొత్తుపెట్టుకోబోమని ప్రకటించారు. కాగా 2014 ఎన్నికల్లోను,ప్రస్తుత ఎన్నికల్లోను వైఎస్సార్ సీపీతో పొత్తుల కోసంవివిధ పార్టీలు ప్రయత్నాలు చేసినా ససేమిరా అన్నారు.కడప ఉప ఎన్నికల్లో చెప్పిన విషయానికే కట్టుబడ్డారు.రాజకీయ అవసరాల ముసుగులో సిద్ధాంతాలను
వదలుకోనని స్పష్టంచేశారు. పలు సందర్భాల్లో పదవులు ఇస్తామనే ఆఫర్లు వచ్చినా వాటికోసం వెంపర్లాడలేదు.
ఆ పదవులకు రాజీనామాచేస్తేనే పార్టీలో చేరిక
2014 ఎన్నికల్లో తృటిలో అధికారం చేజారినప్పటికీ.. జగన్ తన రాజకీయ విలువలనువిడనాడలేదు. చంద్రబాబు 23మందివైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను ప్రలోభపెట్టి టీడీపీలో చేర్చుకున్నారు. వైఎస్సార్‌సీపీ ద్వారా గెలిచిన పదవులకు రాజీనామాలుచేయకుండా రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించారు. పైగా వారిలో నలుగురికి చంద్రబాబు మంత్రి పదవులు కూడా ఇచ్చారు. సీఎం ఇంతగా రాజ్యాంగ విలువలను కాలరాస్తున్నా.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మాత్రం విలువలకే కట్టుబడ్డారు. నంద్యాల ఉపఎన్నికల సమయంలో టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి వైఎస్సార్‌సీపీలో చేరుతాను అంటే.. ఎమ్మెల్పీ పదవికి రాజీనామా చేసిన తరువాతే పార్టీలో చేర్చుకున్నారు. అదేవిధంగా టీడీపీ ఎంపీలు అవంతి శ్రీనివాస్, రవీంద్రబాబు, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డిలను పార్టీలో చేర్చుకునే ముందు వారితో ఆ పదవులకు రాజీనామా చేయించారు. రాజ్యాంగ విలువల పట్లజగన్ తన నిబద్ధతను చాటుకున్నారు.
ఆనాడు తండ్రి మాటకుకట్టుబడి శ్రీరాముడు రాజ్యాన్నీ,సర్వభోగాలను త్యజించి అడవులబాట పట్టాడు. దుష్ట సంహారంచేసి రామరాజ్యం స్థాపించాడు.అది రామాయణం..
తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక గుండెలు ఆగిన అభిమానుల కుటుంబాలను ఓదారుస్తానని ఇచ్చిన మాట కోసం.. వైఎస్ జగన్ ప్రజల చెంతకు బయలుదేరారు. కుట్రలూ కుతంత్రాలకు ఎదురొడ్డుతూ.. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాజన్న రాజ్యాన్నిస్థాపించాలనే ఆశయ సాధన కోసం రాజకీయ ప్రస్థానంకొనసాగిస్తున్నారు. – ఇదీ వర్తమానరాష్ట్ర రాజకీయం..
Comments
Please login to add a commentAdd a comment