షిల్లాంగ్: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈశాన్య భారతంలో ఎన్డీయే కూటమికి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద పౌరసత్వ బిల్లు-2016ను ఈశాన్య ప్రాంతంలోని పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో కొనసాగుతున్న పార్టీలు బిల్లుకు నిరసనగా బయటకు రావాలని యోచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మేఘాలయ ముఖ్యమంత్రి, నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) అధినేత కాన్రాడ్ సంగ్మా వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
ఎన్డీయేతో సంబంధాలు తెంచుకునేందుకు తగిన సమయంకోసం ఎదురుచుస్తున్నామని సంగ్మా అన్నారు. పౌరసత్వ బిల్లుకు రాజ్యసభలో తమ పార్టీ సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేస్తారని ఆయన స్పష్టంచేశారు. మేఘాలయ అసెంబ్లీలో ఇద్దరు శాసన సభ్యులున్న బీజేపీ, ఇతర పార్టీల మద్దతుతో గత ఏడాది సంగ్మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మేఘాలయతో పాటు మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్‌లో ఎన్‌పీపీ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాలే నడుస్తున్నాయి. మణిపూర్, అరుణాచల్ ప్రద్‌శ్‌లో బీజేపీకి సంగ్మా మద్దతు ప్రకటించడంతో అక్కడ బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. ఎన్డీయే కూటమి నుంచి ఎన్‌పీపీ బయటకు వచ్చినట్లుయితే ఆ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు పడిపోయే అవకాశం ఉంది.
మేఘాలయలో కాంగ్రెస్ 21 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచినా.. రెండే సీట్లు గెలిచిన బీజేపీ ఇతరుల మద్దతు కూడగట్టి ఎన్‌పీపీ అధికారంలోకి వచ్చేలా చక్రం తిప్పింది. బీజేపీ నుంచి విడిపోతే మేఘలయ తమకు ఇతర ప్రాంతీయ పార్టీల మద్దతు ఉందని సంగ్మా ఇదివరకు ప్రకటించారు. మరికొన్ని పార్టీలు కూడా బీజేపీని వీడేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈశాన్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారనున్నాయి. కాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం లోక్‌సభలో ఆమోదం పొందిన బిల్లును త్వరలోనే రాజ్యసభ ప్రవేశపెట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment