చంద్రబాబునాయుడు నీచాతినీచమైన, ఒక పశు ప్రవర్తన కలిగిన వ్యక్తి. తెలుగుదేశం పార్టీని అన్న నందమూరి తారక రామారావు స్థాపించి తన చెమట, రక్తంతో ఒక స్థాయికి తీసుకొచ్చారు. అలాంటి అన్నకు వెన్నుపోటు పొడిచాడు. ఉచ్ఛం, నీచం లేని దుర్మార్గుడు చంద్రబాబు అని నేను ఎన్టీఆర్ అభిమానిగా ముందునుంచీ చెబుతూనే వస్తున్నా.
– కొడాలి వెంకటేశ్వరరావు (నాని), వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే
సాక్షి, అమరావతి: తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు పేరు ఎక్కడా కనిపించకుండా, వినిపించకుండా చేయాలని, ఇప్పుడదే పార్టీకి అధినేతగా ఉన్న సీఎం చంద్రబాబు, తోక పత్రిక రాధాకృష్ణతో కలసి పన్నిన కుట్రపై రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ అభిమానుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచి, పార్టీనీ, అధికారాన్నీ లాక్కుని, ఓట్ల కోసం ఆ మహానుభావుడి పేరునే వాడుకుంటూ.. చివరకు ఆయనకే ద్రోహం తలపెడతారా? చరిత్ర పుటల్లో ఆయన పేరు లేకుండా చేయాలనే పన్నాగం పన్నుతారా? అంటూ అభిమానులు మండిపడుతున్నారు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీలో వాడి (రామారావు) పేరు తొలగించాలని, కొత్త పేరు పెట్టి విస్తృతంగా ప్రచారం చేద్దామంటూ, ఇక వాడి పని అయిపోయినట్టేనంటూ.. టీవీ లైవ్ షోకు ముందు చంద్రబాబు – రాధాకృష్ణలు జరిపిన సంభాషణల వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం తెలిసిందే. ఈ సంభాషణలను ‘సాక్షి’ బహిర్గతం చేసిన నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానులు రగిలిపోతున్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవమే పరమావధిగా తెలుగుదేశం పార్టీని ఏర్పాటుచేసిన ఎన్టీ రామారావు పేరును తుడిచేసేందుకు ఇంతటి విషపు కుట్రలకు తెగబడతారా? అంత నీచానికి దిగజారుతారా? అంటూ మండిపడుతున్నారు.
ఎన్టీఆర్ పేరుంటే తప్పేమిటి?
‘లక్ష్మీపార్వతి ఏదో చేస్తోందంటూ అసత్యాలు చెప్పి, ఆయన కుటుంబసభ్యులందరినీ మీ వైపు తిప్పుకుని, కుట్రకు పాల్పడి ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుణ్ణి చేశారు. వైస్రాయ్ హోటల్‌లో ఎమ్మెల్యేల క్యాంపు నిర్వహించి ఆయనపై చెప్పులు వేయించారు. అసెంబ్లీలో మాట్లాడటానికి కూడా అవకాశం లేకుండా చేసి, రామారావు కంటతడి పెట్టుకునేలా చేశారు. రెండు రూపాయలకే కిలో బియ్యం వంటి పథకాలతో ప్రజా సంక్షేమానికి కొత్త నిర్వచనం చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్. అలాంటి వ్యక్తి పేరిట ప్రభుత్వ ఆరోగ్య పథకం (ఎన్టీఆర్ వైద్యసేవ) ఉంటే తప్పేమిటి?’ అంటూ ఎన్టీఆర్ అభిమానులు, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిలదీస్తున్నారు. ‘‘చంద్రబాబు స్వార్థపరుడు కాబట్టే ఇలా కుట్రలు చేస్తుంటారు. ఎన్టీఆర్‌ను వాడు అనడం మరీ దారుణం. బాబుకు ప్రచార యావ ఎక్కువైంది. చంద్రన్న బీమా, చంద్రన్న పెళ్లి కానుక, చంద్రన్న ఉగాది కానుక..అంటూ పేర్లు పెట్టుకోవడమే ఇందుకు నిదర్శనం. బతికున్న వారి పేర్లను ఎవరూ పథకాలకు పెట్టరు. బతికుండి ప్రభుత్వ పథకాలకు తన పేరు పెట్టుకున్న ఏకైక వ్యక్తి చంద్రబాబే..’ అని సీనియర్ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు.
చంద్రబాబు నీచాతినీచమైన వ్యక్తి
చంద్రబాబునాయుడు నీచాతినీచమైన, ఒక పశు ప్రవర్తన కలగిన వ్యక్తి. తెలుగుదేశం పార్టీని అన్న నందమూరి తారక రామారావు స్థాపించి తన చెమట, రక్తంతో ఒక స్థాయికి తీసుకొచ్చారు. అలాంటి అన్నకు వెన్నుపోటు పొడిచి ఆయన పదవినీ, పార్టీని లాక్కుని ఆయన మరణానికి కారకుడైన దుర్మార్గుడు చంద్రబాబు. ఉచ్చం, నీచం లేని దుర్మార్గుడు చంద్రబాబు అని నేను ఎన్టీఆర్ అభిమానిగా ముందునుంచీ చెబుతూనే వస్తున్నా. బయట అలా మాట్లాడితే ప్రజలు రాళ్లతో కొడతారని, అన్న విగ్రహాలకు దండలు వెయ్యటం, పథకాలకు పేర్లు పెట్టి నటిస్తుంటారు. ఎన్టీఆర్‌ను కించపరిచే విధంగా మాట్లాడిన చంద్రబాబునాయుణ్ణి రాజకీయంగా భూస్థాపితం చేయటానికి నేను ముందు ఉంటా. ఎన్టీఆర్ అభిమానులు అందరూ నాతో కలసి రావాలని కోరుతున్నా. చంద్రబాబు మాటలు విన్నాక కూడా ఎన్టీఆర్ అభిమానులు ఇంకా ఆయన వెంటే ఉంటే ఎన్టీఆర్ అత్మ క్షోభిస్తుంది.
– కొడాలి వెంకటేశ్వరరావు (నాని), వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే
ఎన్టీఆర్‌కు భారతరత్నబాబే అడ్డుకున్నాడేమో?
ఇది ఎన్టీఆర్ జ్ఞాపకాలను ప్రజల్లో నుంచి తొలగించేందుకు తలపెట్టిన కుట్రగా స్పష్టమవుతోంది. ఇదంతా చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్‌కు ‘భారతరత్న’ పురస్కారం ఇస్తామన్నా.. చంద్రబాబే అడ్డుతగిలాడా? అన్న అనుమానం కలుగుతోంది. అలాగే ఎన్టీ రామారావుకు వెన్నుపోటు ఉదంతంలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ప్రమేయం కూడా ఉందేమోనని అనుమానం కలుగుతోంది. ఎన్టీ రామారావును పార్టీలకు అతీతంగా అందరూ గౌరవవిస్తారు. తెలుగు ప్రజలను, తెలుగు జాతిని దేశం గుర్తించే విధంగా చేసిన ఘనత ఎన్టీ రామారావుది. అలాంటి ఎన్టీఆర్ గురించి చంద్రబాబు, రాధాకృష్ణలు మాట్లాడుకున్న వీడియో చూసిన తరువాత ఎన్టీఆర్‌పై ఈర‡్ష్య, ద్వేషంతో చంద్రబాబు, రాధాకృష్ణ రగిలిపోతున్నట్టుగా ఆర్ధమైంది. వాడిపేరు తీసేద్దామంటూ మాట్లాడుకోవడం దారుణం.
– ముప్పాళ్ల సుబ్బారావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు
ఎన్టీఆర్‌ను దూషించటం తగదు...
తెలుగువారి ఆత్మగౌరవాన్ని దశదిశలా చాటిన గొప్పవ్యక్తి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్. ఎంతోమందికి పేదలకు మేలు చేశారు. అటువంటి మహనీయుడిని సీఎం చంద్రబాబునాయుడు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అవమానిస్తూ మాట్లాడటం దారుణం. ఎన్టీఆర్ చంద్రబాబును ఎంతగానో నమ్మారు. కానీ చంద్రబాబు ఆయనకే వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారణమయ్యాడు. చంద్రబాబు కుట్ర రాజకీయాల్ని టీడీపీ కార్యకర్తలు అర్థం చేసుకోవాలి.
– కాట్రగడ్డ మస్తాన్‌రావు, నాదెండ్ల, గుంటూరు జిల్లా
దమ్ముంటే ఎన్టీఆర్ పేరు లేకుండా ఎన్నికలకు వెళ్లు
చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే అన్ని పథకాల్లో ఎన్టీఆర్ పేరు తొలగిస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించాలి. ఆయన పేరు చెప్పకుండా ఎన్నికలకు వెళ్లాలి. ఎన్టీఆర్ పార్టీకి నారావారి పార్టీ అని పేరు పెట్టుకుంటే డిపాజిట్లు కూడా రావు. నేను ఎన్టీఆర్ హయాంలో రెండుసార్లు మంత్రిగా పనిచేశా. వెన్నుపోటు పొడిచి పది సంవత్సరాలు బతకాల్సిన ఎన్టీఆర్‌ను చంపేశారు. ఆ పాపం ఊరికే పోదు. చనిపోయిన ఒక మహానేతను వాడు వీడు అని సంబోధిస్తారా? ఎన్టీఆర్ భిక్షతో బతుకుతున్న చంద్రబాబుకు ఆయన అభిమానుల సత్తా ఏమిటో తెలిసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.
– దాడి వీరభద్రరావు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఎన్టీఆర్ పేరును తుడిచేయలేరు
టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పేరును ఎక్కడా లేకుండా చేయాలనుకోవడం అవివేకం. చంద్రబాబు నీచ రాజకీయాలకు నిదర్శనం. ఆయన పేరును తుడిచేయలేరు. చంద్రబాబు కారణంగానే ఎన్టీఆర్ ఆత్మక్షోభకు గురై చనిపోయారు. ఇలాంటి వ్యక్తి ప్రజలకు ఏం మేలు చేస్తాడు?
–పెంటేల వీరయ్య,గణపవరం, నాదెండ్ల మండలం, గుంటూరు జిల్లా
ఎన్టీఆర్‌ను దూషిస్తూ మాట్లాడటం దారుణం
సంజీవపురం(ఓబులవారిపల్లె): టీడీపీ వ్యవస్థాపకులు దివంగత ఎన్టీ రామారావును చంద్రబాబు వాడు అంటూ మాట్లాడటం దారుణమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి సి.రామచంద్రయ్య అన్నారు. ఆయన సోమవారం వైఎస్సార్ జిల్లా సంజీవపురంలో విలేకరులతో మాట్లాడుతూ.. పిల్లనిచ్చిన మామ తండ్రితో సమానమని, ఎన్టీఆర్ ఫొటో పెట్టుకుని సీఎం అయిన చంద్రబాబుకు ఇంగితజ్ఞానం లేదని దుయ్యబట్టారు. ఇలాంటి విలువలులేని వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవసరమా? అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment