సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న ప్రొటెం స్పీకర్ శంబంగి అప్పలనాయుడు , తొలి రోజు శానససభకు హాజరైన ఎమ్మెల్యేలు , ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సభా నాయకుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, అమరావతి: కొంగొత్తగా కొలువుదీరిన ఆంధ్రప్రదేశ్ 15వ శాసనసభలో 173 మంది శాసనసభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం నిరాడంబరంగా, సంప్రదాయబద్ధంగా పూర్తయింది. వైఎస్సార్‌సీపీ సభ్యులంతా పార్టీ కండువాలు ధరించి సభకు రాగా టీడీపీ సభ్యుల్లో ఇద్దరు మినహా మిగతావారంతా పచ్చ చొక్కాలతో సభకు వచ్చారు. ఎన్నికైన సభ్యులంతా సభకు వచ్చిన వెంటనే పరస్పరం అభినందించుకున్నారు. మంత్రులు చాలామంది శాసనసభ్యుల స్థానాల వద్దకు వెళ్లి అభినందనలు తెలపగా అధికార పక్ష సభ్యులు మంత్రుల వద్దకు వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. పరస్పర అభినందనలు, కరచాలనాలతో సభలో ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించింది. తాజాగా ఎన్నికైన 175 మంది శాసనసభ్యుల్లో ప్రొటెం స్పీకర్‌తో కలిపి 174 మంది సభకు హాజరయ్యారు. శంబంగి చిన వెంకట అప్పల నాయుడు ఈనెల 8వ తేదీన గవర్నరు ఎదుట ఎమ్మెల్యేగా, ప్రొటెం స్పీకరుగా ప్రమాణ స్వీకారం చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం 149 మంది వైఎస్సార్ సీపీ సభ్యులతోపాటు 23 మంది టీడీపీ సభ్యులు, జనసేన నుంచి ఒక్క సభ్యుడు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. నరసరావుపేట వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తన మాతృమూర్తి పెద్ద కర్మ ఉన్నందున ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయిన వెంటనే శాసనసభ గురువారానికి వాయిదా పడింది.
హర్షధ్వానాల మధ్య సభలోకి సీఎం జగన్
సరిగ్గా ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఉదయం 11.05 గంటలకు అధికార పక్ష సభ్యుల హర్షధ్వానాల మధ్య సభా నాయకుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శాసనసభలోకి ప్రవేశించారు. ముకుళిత హస్తాలతో రెండు చేతులూ జోడించి అందరికీ నమస్కరిస్తూ వైఎస్ జగన్ సభలోకి ప్రవేశించారు. జై జగనన్నా, జయహో జగనన్నా, జోహార్ వైఎస్సార్ అంటూ అధికార పక్ష సభ్యులంతా నినదించారు. ఆ వెంటనే ప్రొటెం స్పీకర్ శంబంగి చిన వెంకట అప్పలనాయుడు సభలోకి ప్రవేశించడంతో అందరూ గౌరవసూచికంగా లేచి నిలబడి ఆయనకు నమస్కరించారు. ఉదయం పది గంటలకే శాసనసభ ప్రాంగణం సభ్యులు, సందర్శకులతో కిటకిటలాడింది. సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం కావడంతో చాలామంది ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు, బంధువులు రావడంతో అసెంబ్లీ ప్రాంగణం కళకళలాడింది.
జాతీయ గీతాలాపనతో ప్రారంభం
ఉదయం 11.06 గంటలకు జాతీయ గీతాలాపనతో సభ ఆరంభమైంది. ఆ కార్యక్రమం ముగిసిన వెంటనే ప్రొటెం స్పీకర్ శంబంగి చిన వెంకట అప్పలనాయుడు సభ్యులందరి చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు అసెంబ్లీ కార్యదర్శి కృష్ణమాచార్యులు ప్రకటించారు. రాజ్యాంగంలోని 188 ఆర్టికల్ ప్రకారం సభ్యులంతా ప్రమాణ స్వీకారం చేయాలని ప్రొటెం స్పీకరు ప్రకటించారు. ప్రమాణ స్వీకారం అనంతరం శాసన సభ్యులుగా బాధ్యతలు స్పీకరించినట్లు సంతకాలు చేయాలని ప్రొటెం స్పీకరు సూచించారు. ఆ ప్రకారం ప్రొటెం స్పీకర్ పేర్లు చదవగా పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ముఖ్యమంత్రి, సభా నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తొలుత ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం కుప్పం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత అక్షర క్రమంలో మొదట అంజాద్ బాషా (కడప శాసన సభ్యుడు, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి) ప్రమాణ స్వీకారం చేశారు.
తదుపరి అక్షర క్రమంలో శాసనసభ కార్యదర్శి ఒక్కొక్కరి పేరును చదవగా స్పీకర్ ఎదుట పోడియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బల్ల వద్ద 173 మందితో శాసన సభ్యులుగా ప్రమాణం చేయించారు. ఉప ముఖ్యమంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, పాముల పుష్ప శ్రీవాణి, ఆళ్ల నాని, అంజాద్ బాషా, కె.నారాయణస్వామితో పాటు మంత్రులు మేకతోటి సుచరిత, బొత్స సత్యనారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మేకపాటి గౌతంరెడ్డి, కురసాల కన్నబాబు, తానేటి వనిత, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాసరావు, మోపిదేవి వెంకటరమణ, అనిల్‌కుమార్ యాదవ్, పినిపే విశ్వరూప్, శ్రీరంగనాథరాజు, పేర్ని నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన కృష్ణదాస్, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్, గుమ్మునూరు జయరాం, బాలినేని శ్రీనివాసరెడ్డి, శంకర నారాయణలతోపాటు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, ఇతర శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.
ముగ్గురు నానీలు.. ఇద్దరు శ్రీదేవిలు
తాజా శాసససభలో కొడాలి శ్రీవేంకటేశ్వరరావు (నాని), పేర్ని వెంకట్రామయ్య (నాని), ఆళ్ల వంశీకృష్ణ శ్రీనివాస్ (నాని) ముగ్గురూ తమ పేర్లతో పాటు ‘నాని’ అని కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ముగ్గురు సభ్యుల నిక్ నేమ్స్ ‘నాని’ కావడం, వారు ప్రమాణ స్వీకారంలో ‘నాని’ అని పేర్కొనటం విశేషం. అలాగే ఇంటి పేర్లు వేరైనప్పటికీ సభలో ఇద్దరు శ్రీనివాసరావులు (ముత్తంశెట్టి , వెలంపల్లి), ఇద్దరు రామచంద్రారెడ్డిలు (కాపు, పెద్దిరెడ్డి) ఉండటం ఆసక్తికరమైన అంశం. ఇంటి పేర్లు వేరైనప్పటికీ ఇద్దరు శ్రీదేవిలు (ఉండవల్లి, కంగాటి) కూడా ఉన్నారు.
సీఎం హోదాలో తొలిసారి సభకు వైఎస్ జగన్
ఎన్నికల్లో అఖండ మెజారిటీతో విజయం సాధించిన తరువాత ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం తొలిసారిగా శాసనసభకు వచ్చారు. ప్రతిపక్ష నేతగా ఉండగా శాసనసభ ఎడమ వైపు ద్వారం నుంచి వచ్చిన వైఎస్ జగన్ ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో కుడి ద్వారం నుంచి ప్రధాన గేటు ద్వారా కాన్వాయ్‌తో సభా ప్రాంగణంలోకి చేరుకున్నారు. ఉదయం 10.45 గంటలకు ఆయన సభ వద్దకు చేరుకోగానే ముఖద్వారం వద్ద శాసనసభ కార్యదర్శి (ఇంచార్జి) పి.బాలకృష్ణమాచార్యులు పుష్ఫగుచ్ఛాన్ని అందచేసి స్వాగతం పలికారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వాహనం నుంచి దిగగానే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పినిపె విశ్వరూప్, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వి.విజయసాయిరెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు ఆయనకు ఎదురేగి స్వాగతం పలికారు. వేద పండితులు ఆశీర్వచనాల నడుమ వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రి ఛాంబర్‌లోకి తోడ్కొని వెళ్లారు. జగన్ అందరికీ వినమ్రంగా నమస్కరిస్తూ, పలుకరిస్తూ ముందుకు సాగారు. ఆయన తన కుర్చీలో కూర్చోగానే గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డితో కలసి ఫొటో దిగారు. మరికొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా సీఎం వైఎస్ జగన్‌తో కలసి ఫోటోలు తీయించుకున్నారు. పాస్టర్ ఒకరు కుటుంబ సమేతంగా వచ్చి వైఎస్ జగన్‌ను దీవించారు.
‘‘వైఎస్ జగన్ అనే నేను....’’
దైవసాక్షిగా ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సభా నాయకుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో అధికార పక్ష సభ్యులంతా అభినందన పూర్వకంగా బల్లలు చరుస్తూ చప్పట్లతో హర్షధ్వానాలు చేశారు. సరిగ్గా ఉదయం 11.11 గంటలకు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార టేబుల్ వద్దకు చేరుకుని ‘‘వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి’’ అనే నేను అని పలకగానే సభలో హర్షధ్వానాలు వెల్లివిరిశాయి. ‘‘వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారత దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని..’’ పేర్కొంటూ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దైవసాక్షిగా ప్రమాణం చేశారు.
రెండో ప్రమాణం
‘‘ఆంధ్రప్రదేశ్ శానసభ సభ్యుడినైన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నా’’ అని వైఎస్ జగన్ ప్రతిజ్ఞ చేశారు. సభ్యులంతా ఇదే విధంగా రెండు ప్రమాణాలు చేశారు.
సభ జరిగిన క్రమమిది..
నిరాడంబరంగా తొలి సమావేశం
– బుధవారం 15వ శాసనసభ తొలి సమావేశం నిరాడంబరంగా ప్రారంభమైంది. నూతన ముఖ్యమంత్రి సభలోకి ప్రవేశించే తొలిరోజు అయినప్పటికీ ఎక్కడా హంగామా, ఆర్భాటం లేకుండా ప్రమాణ స్వీకార కార్యక్రమం నిరాడంబరంగా జరిపించారు. శాసనసభ ప్రధాన ద్వారం, ముఖ్యమంత్రి ప్రవేశ ద్వారాలకు మాత్రమే సంప్రదాయబద్ధంగా పూలమాలలు వేశారు. అంతకుమించి అలంకరణలు చేయలేదు.
– ఉదయం 10.30 గంటల నుంచే అధికార పక్ష సభ్యులు సభలోకి రావడం ప్రారంభమైంది.
– వైఎస్సార్‌సీపీ సభ్యుల్లో అత్యధికులు పార్టీ కండువాలను ధరించి రాగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి శేషవస్త్రాన్ని కండువాగా కప్పుకున్నారు. చెవిరెడ్డి సభలోకి ప్రవేశించే ముందు అసెంబ్లీ ద్వారానికి మొక్కారు. తర్వాత తన సీటుకు కూడా నమస్కరించి ఆశీనులయ్యారు.
– సభ్యుల్లో అత్యధికులు తెలుగులో దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. మేకపాటి గౌతంరెడ్డి, ఉషా శ్రీచరణ్, అబ్బయ్య చౌదరి, అబ్దుల్ హఫీజ్‌ఖాన్, నవాజ్ బాషా తదితరులు ఇంగ్లీష్‌లో ప్రమాణ స్వీకారం చేశారు.
– రెడ్డిశాంతి, డాక్టర్ శ్రీదిరి అప్పలరాజు(వైఎస్సార్‌సీపీ), గద్దె రామ్మోహన్‌రావు (టీడీపీ) తదితరులు పవిత్ర హృదయంతో ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు ప్రకటించారు.
– ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, నవాజ్ బాషా తదితరులు అల్లా సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు.
– నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి దైవసాక్షిగా, నా ఆరాధ్య నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సాక్షిగా అంటూ ప్రమాణ స్వీకారం చేయడం ఆసక్తికరంగా మారింది.
– అసెంబ్లీ కార్యదర్శి తన పేరు పిలవగానే స్పీకరు పోడియం వద్దకు వెళ్లి ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేరుగా ప్రొటెం స్పీకరు సీటు వద్దకు వెళ్లి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం స్పీకరు వెల్ నుంచి కిందకు వస్తూ విపక్షనేతతోపాటు సభ్యులందరికీ ముకుళిత హస్తాలతో నమస్కరించారు. సభ్యులంతా ఆయనకు ప్రతి నమస్కారాలు చేశారు.
– ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, సభ్యులు ప్రమాణ స్వీకారం చేయగానే స్పీకరు వద్దకు వెళ్లి కృతజ్ఞతలు తెలియచేశారు. అనంతరం ఎమ్మెల్యేలుగా బాధ్యతలు స్వీకరించినట్లు సంతకాలు చేశారు.
– టీడీపీ సభ్యుల్లో ఇద్దరు మినహా మిగిలిన వారంతా పచ్చ చొక్కాలు ధరించి వచ్చారు.
– పూతలపట్టు ఎమ్మెల్యే ఎం.ఎస్.బాబు ప్రమాణ స్వీకార పత్రాన్ని చదవలేక తడబడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment