విలేకరులతో మాట్లాడుతున్న దాసోజు శ్రవణ్. చిత్రంలో కోదండరెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రతిపాదించిన కనీస ఆదాయ యోజన పథకంతో పేదలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని ఏఐసీసీ ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ చెప్పారు. మంగళవారం మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్, కిసాన్‌సెల్ నేత కోదండరెడ్డితో కలసి శ్రవణ్ గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. కనీస ఆదాయ యోజన పథకంతో దేశంలో 20 శాతం కుటుంబాలు పేదరికం నుంచి బయటపడతాయన్నారు. తెలంగాణలోని 3.5 కోట్ల మందికి 2.75 కోట్ల మంది బీపీఎల్ కేటగిరీలో ఉన్నారని, మొత్తం 50 లక్షల మందికి పైగా ప్రజలకు ఈ పథకం నుంచి లబ్ధి చేకూరుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే పేదరికం నిర్మూలించటం జరుగుతుందని స్పష్టం చేశారు. కనీస ఆదాయ యోజన పథకాన్ని బీజేపీ నేతలు విమర్శించడాన్ని ఆయన ఖండించారు. ఈ పథకం పూర్తిస్థాయి పరిశోధన, విశ్లేషణ తర్వాతనే ముసాయిదాను రూపొందించారని చెప్పారు.
త్వరలో టీఆర్‌ఎస్ యుగం ముగుస్తుంది..
టీఆర్‌ఎస్ యుగం త్వరలో ముగుస్తుందని దాసోజు జోస్యం చెప్పారు. ఆదిలాబాద్–కరీంనగర్–నిజామాబాద్–మెదక్ ఎమ్మెల్సీ సీటును గ్రాడ్యుయేట్ల కోటా లో కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి గెలుచుకున్నారని, టీఆర్‌ఎస్ మద్దతు గల అభ్యర్థులు వరంగల్–ఖమ్మం–నల్లగొండ, మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో ఓడారని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు అనుకూలంగా ఓటు వేస్తారని చెప్పారు.
‘కనీస ఆదాయ’ పథకంతో పేదలకు లబ్ధి: వీహెచ్
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన కనీస ఆదాయ భద్రత పథకంతో దేశంలో 25 కోట్ల మంది పేదలకు లబ్ధి కలుగుతుందని ఏఐసీసీ కార్యదర్శి వి.హన్మంతరావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈ పథకం ద్వారా దేశంలో అత్యంత నిరుపేదలైన కుటుంబాలకు నెలవారీ రూ.6 వేల చొప్పున ఏటా రూ.72 వేలు నేరుగా వారి ఖాతాలకు జమ చేస్తామని తెలిపారు. ఈ పథకానికి ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పిస్తామని, తద్వారా తెలంగాణలో కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంపై స్పందిస్తూ ప్రజా తీర్పును అపహాస్యం చేస్తే ఏదో ఒకరోజు ప్రజలే తిరగబడతారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment