
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఎంపిక ఏకగ్రీవమైంది. గడువు నిన్నటితోనే ముగియటం.. ఇప్పటిదాకా ఒకే ఒక్క నామినేషన్ రావటంతో ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ పేరును ప్రకటించటమే మిగింది.
రాహుల్‌కి మద్దతుగా మొత్తం 89 నామినేషన్లు వచ్చాయి. అవన్నీ పరిశీలించి సహేతుకంగానే ఉన్నాయని ఎంపీ, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం రామచంద్రన్ తెలిపారు. ఈ మేరకు అధికారికంగా స్క్రూటినీ నివేదికను విడుదల చేసింది. ఏ క్షణమైన రాహుల్ ను అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశం ఉంది.
పార్టీని 19 ఏళ్లుగా (పదేళ్లపాటు యూపీఏ పాలనతో కలిపి) నడుపుతున్న అధ్యక్షురాలు సోనియా గాంధీ నుంచి రాహుల్ పగ్గాలు స్వీకరించబోతున్నారు. 2013లో పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమితుడైనప్పటినుంచీ రాహుల్‌కు పూర్తిస్థాయి బాధ్యతలపై అడపాదడపా చర్చ జరిగినా.. చివరకు దేశంలో రాజకీయ వాతావరణం ఆసక్తికరంగా మారటం, 2019 ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో పార్టీ కీలక బాధ్యతలు అందుకోనున్నారు. యువరాజు నాయకత్వంలో.. ఇటీవలి కాలంలో వరుస ఓటములతో కుదేలైన పార్టీకి తిరిగి పునర్‌వైభవం వస్తుందని పలువురు యువ, సీనియర్ నాయకులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment