గుంటూరు జిల్లా ముప్పాళ్ల గ్రామంలో పాదయాత్ర బస వద్ద వైఎస్సార్‌సీపీ ఎంపీలు మేకపాటి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, వరప్రసాదరావు, వేమిరెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి, పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులతో సమావేశమైన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ప్రజాసంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: పార్లమెంట్ సమావేశాలు ఎప్పుడు నిరవధికంగా వాయిదాపడ్డా.. ఆ మరుక్షణమే స్పీకర్ ఫార్మాట్‌లో తమ ఎంపీలు రాజీనామాలు చేస్తారని వైఎస్సార్‌సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలు కూడా తమతో కలసి వచ్చి రాజీనామాలు చేయాలని కోరారు. రాష్ట్రానికి చెందిన 25 మంది ఎంపీలు ఏకతాటిపైకి వచ్చి రాజీనామాలు సమర్పిస్తే కేంద్రం దిగి వస్తుందన్నారు. ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీల అమలు డిమాండ్‌తో తాము ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి ఇప్పుడు అన్ని పార్టీల నుంచి మద్దతు లభిస్తోందని తెలిపారు. ప్రజాసంకల్ప పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్ సోమవారం గుంటూరు జిల్లా ముప్పాళ్ల వద్ద పార్టీ ఎంపీలతో సమావేశమై తాజా రాజకీయ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. దాదాపు 1.45 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ప్రత్యేక హోదా, రాష్ట్ర ప్రయోజనాలపై చర్చించారు. పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగితే ఎలాంటి వ్యూహం అనుసరించాలో పార్టీ ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చేశారు. మీ కృషి వల్లే ప్రత్యేక హోదా అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందని పార్టీ ఎంపీలను జగన్ అభినందించారు. టీడీపీ ఎంపీలను రాజీనామాలు చేయాలని గట్టిగా కోరాలని, ఒకవేళ వారు చేయకున్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీనామాలకు సిద్ధం కావాలని పార్టీ ఎంపీలను ఆదేశించారు.
ఎవరు ఏం చేస్తున్నారో ప్రజలకు తెలుసు
వైఎస్సార్ సీపీ అందరికంటే ముందుగా అవిశ్వాసం నోటీసులు ఇవ్వటం, ప్రత్యేక హోదా కోసం ప్రజల నుంచి వ్యక్తమవుతున్న తీవ్ర ఆగ్రహావేశాల వల్లే సీఎం చంద్రబాబు గత్యంతరం లేక ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారని జగన్ చెప్పారు. మనం లోక్‌సభ స్పీకర్‌కు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చేంతవరకూ చంద్రబాబుకు ఆ ఆలోచన కూడా లేదని తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా హోదా కావాలనే బలమైన ఆకాంక్షతో ఉన్నారన్నారు. హోదా సాధన కోసం ఎవరేం చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచడంలో మనమే ముందున్నామని, వైఎస్సార్ సీపీ వల్లే హోదా వస్తుందనే విశ్వాసం ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోందని ఈ సందర్భంగా ఎంపీలతో జగన్ పేర్కొన్నట్లు సమాచారం.
హోదా కోసం జనం కదలి వస్తున్నారు
ప్రత్యేక హోదా, రాష్ట్ర ప్రయోజనాల కోసం వైఎస్సార్ సీపీ చేపట్టిన ఆందోళన దేశవ్యాప్తంగా అన్ని పార్టీల దృష్టికి వచ్చిందని, ప్రజలంతా ఇది ప్రతిపక్షం సాధించిన విజయంగా భావిస్తున్నారని సమావేశంలో కొందరు ఎంపీలు పేర్కొన్నారు. అవిశ్వాస తీర్మానం మీరు పెడితే మేం మద్దతిస్తాం.. మేం పెడితే మీరు మద్దతివ్వాలి అని ప్రకటించి మనం ముందుగా తీర్మానం నోటీసులు ఇవ్వటం దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిందని వైఎస్సార్ సీపీ ఎంపీలు చెప్పారు. ఈ విషయంలో పార్టీ మొదటి నుంచీ పారదర్శకంగానే ఉందని, ఇక ముందు కూడా అలాగే ఉంటామని ప్రజలకు చెప్పాలని ఎంపీలకు జగన్ సూచించారు. ఎప్పుడు ఏం చేయబోతున్నామో ముందే చెప్పడం, వెనుకడుగు వేయకుండా ఆందోళనలు చేపట్టడం ద్వారా ప్రత్యేక హోదా ప్రజల్లోకి దూసుకెళ్లిందన్నారు. ఇప్పుడు జనమే హోదా కోసం కదిలివచ్చే పరిస్థితి ఏర్పడిందనే అభిప్రాయం సమావేశంలో వెల్లడైంది.
మా నిర్ణయాలన్నీ ప్రజల ఎదుటే
రాజీనామాల ప్రకటన నుంచి అవిశ్వాసం పెట్టే వరకూ మన నిర్ణయాలన్నీ చిత్తశుద్ధితోనే ఉన్నాయని, వాటిని నేరుగా ప్రజల ముందే ఉంచుతున్నామని ఈ సందర్భంగా ఎంపీలకు జగన్ తెలిపారు. విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతానని నాటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీపై దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా చూడాలని, అప్పుడు మన రాష్ట్ర ప్రయోజనాలు ఎంత న్యాయమైనవో అందరికీ తెలుస్తుందని జగన్ పేర్కొన్నారు. పార్లమెంట్‌లో ఎక్కడ చూసినా ప్రత్యేక హోదాపై విస్తృత చర్చ జరుగుతోందని, ఈ దిశగా జగన్ పోరాటాన్ని పార్టీలన్నీ ప్రశంసిస్తున్నాయని పలువురు ఎంపీలు జగన్ దృష్టికి తెచ్చారు. çహోదా కోసం తాము చేస్తున్న ప్రతి విషయాన్ని ప్రజల ముందు ఉంచడం వల్ల ఎవరు ఏమిటో తెలిసిపోయిందని జగన్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ఉండాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment