హైదరాబాద్: జన తెలంగాణ పార్టీ (జేటీ పీ) పేరుతో ఓయూ విద్యార్థులు సోమవారం కొత్త పార్టీ స్థాపించారు. రాష్ట్రం ఏర్పడి ఐదేళ్లు గడిచినా ప్రజల జీవన విధానంలో ఎలాంటి మార్పు రానందున పార్టీని స్థాపించినట్లు జేటీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఓయూ పరిశోధక విద్యార్థి కొర్వి బాలకృష్ణముదిరాజ్ వెల్లడించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో విద్యార్థులు, నిరుద్యోగుల ఆధ్వర్యంలో పార్టీని స్థాపించినట్లు తెలిపారు.
రాష్ట్రం ఏర్పడి మన వారే పాలిస్తున్నా.. రైతులు నష్టపోతూనే ఉన్నారని, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు సన్న గిల్లుతున్నాయని పేర్కొన్నారు. మరోవైపు అసమానతలు పెంచేందుకు ప్రైవేట్ వర్సిటీల స్థాపనకూ రంగం సిద్దం చేశారన్నారు. నిరుద్యోగులకు ఉద్దేశపూర్వకంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను దూరం చేస్తున్నారని, రాష్ట్రంలో భూస్వామ్య వ్యవస్థకు పురుడు పోస్తూ ప్రజల్ని వెట్టి వైపు మళ్లించేందుకు కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. ఇలా అనేక అంశాలను చర్చించి కొత్త పార్టీని స్థాపించాలని నిర్ణయించినట్లు చెప్పారు. విద్యార్థులు, నిరుద్యో గులు, రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజానీ కాన్ని కలుపుకొని సాగుతామని బాలకృష్ణ వివరించారు. కార్యక్రమంలో జీటీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్దగౌని సుదర్శన్, నాయకులు గోపికృష్ణ, శివ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment