Jana telangana
-
జన తెలంగాణ పార్టీ ఆవిర్భావం
హైదరాబాద్: జన తెలంగాణ పార్టీ (జేటీ పీ) పేరుతో ఓయూ విద్యార్థులు సోమవారం కొత్త పార్టీ స్థాపించారు. రాష్ట్రం ఏర్పడి ఐదేళ్లు గడిచినా ప్రజల జీవన విధానంలో ఎలాంటి మార్పు రానందున పార్టీని స్థాపించినట్లు జేటీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఓయూ పరిశోధక విద్యార్థి కొర్వి బాలకృష్ణముదిరాజ్ వెల్లడించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో విద్యార్థులు, నిరుద్యోగుల ఆధ్వర్యంలో పార్టీని స్థాపించినట్లు తెలిపారు. రాష్ట్రం ఏర్పడి మన వారే పాలిస్తున్నా.. రైతులు నష్టపోతూనే ఉన్నారని, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు సన్న గిల్లుతున్నాయని పేర్కొన్నారు. మరోవైపు అసమానతలు పెంచేందుకు ప్రైవేట్ వర్సిటీల స్థాపనకూ రంగం సిద్దం చేశారన్నారు. నిరుద్యోగులకు ఉద్దేశపూర్వకంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను దూరం చేస్తున్నారని, రాష్ట్రంలో భూస్వామ్య వ్యవస్థకు పురుడు పోస్తూ ప్రజల్ని వెట్టి వైపు మళ్లించేందుకు కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. ఇలా అనేక అంశాలను చర్చించి కొత్త పార్టీని స్థాపించాలని నిర్ణయించినట్లు చెప్పారు. విద్యార్థులు, నిరుద్యో గులు, రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజానీ కాన్ని కలుపుకొని సాగుతామని బాలకృష్ణ వివరించారు. కార్యక్రమంలో జీటీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్దగౌని సుదర్శన్, నాయకులు గోపికృష్ణ, శివ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
జన తెలంగాణ
విందు రాజకీయాలకు స్వస్తి పలకాలి రాష్ట్ర సాధన కోసం 14 సంవత్సరాలు పోరాటం చేసిన ఎందరో నాయకుల త్యాగం ఫలించింది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ అనుచరులను, కార్యకర్తలను మచ్చిక చేసుకోవడానికి విందు, కుళ్లు రాజకీయాలను నేరుగా నడుపుతున్నారు. నిర్ణయించిన అభ్యర్థులను గెలిపించడం కోసం అహర్నిశలు శ్రమించేటటువంటి కార్యకర్తలను రాజకీయ పార్టీల నాయకులు గుర్తించి, గౌరవించి పైకి తీసుకురావాలి. ఇందుకు భిన్నంగా కార్యకర్తలను ప్రలోభపెట్టి పబ్బం గడుపుకొనే ధోరణికి, విందు రాజకీయాలకు స్వస్తి పలకాలి. - ఎస్ తిరుపతి, మామిడిపల్లి, ఆర్మూర్ మండలం వాగ్దానాలను నిలబెట్టుకోవాలి నవ తెలంగాణ నిర్మాణంలో ముఖ్యంగా రాజకీయ నాయకులు తమ వాగ్దానాలను నిలబెట్టుకోవాలి. పర్సంటేజీలకు ఆశపడి అవినీతిని ప్రోత్సహిస్తే నవ తెలంగాణ నిర్మాణం సాధ్యం కాదు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు తెలంగాణలో పునరుద్ధరించాలి. ఆరోగ్యశ్రీని తప్పనిసరిగా కొనసాగించాలి. రెండోశ్రేణి పట్టణాల్లో( రామగుండం, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్) పరిశ్రమలను ప్రోత్సహించి యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించాలి. మహిళలకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేయాలి. వరంగల్, ఆదిలాబాద్‌లో విమానాశ్రయం ఏర్పాటుకు కృషి చేయాలి. ఆదిలాబాద్‌లో చాలాకాలంగా మూతపడి ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించడానికి చర్యలు చేపట్టాలి. నదుల అనుసంధానం, అవసరమైన చోట ప్రాజెక్టులు కట్టించడానికి వెనుకాడొద్దు. -ఎం. శ్రీకాంత్, ఫార్మసిస్టు, పీహెచ్సీ గిమ్మ, ఆదిలాబాద్ బంగారు తెలంగాణ మనం కలలుగన్న బంగారు తెలంగాణ ఏర్పడాలంటే అత్యధిక ప్రాధాన్యం వ్యవసాయానికి ఇవ్వాలి. దేశానికి రైతు వెన్నెముక అని అంటారు కానీ మన సమాజంలో రైతంటే ఎంతో చిన్నచూపు ఉంది. నేటి యువతను ప్రశ్నిస్తే కలెక్టర్, డాక్టర్, యాక్టర్ కావాలనుకుంటున్నారు కానీ అన్నదాత కావాలని ఎవరూ భావించడం లేదు. నేటి యువతలో వ్యవసాయంపై మక్కువ పెంచేలా రైతు సమస్యల్ని పరిష్కరించేలా ప్రభుత్వం ఏర్పడి వ్యవసాయ వృత్తిని ఆదరించేలా చూడాలి. నేటి తెలంగాణ రైతు అనుభవిస్తున్న ప్రధాన సమస్యలైన సాగునీరు, విద్యుచ్ఛక్తి, మేలైన విత్తన సరఫరా, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై సత్వరం దృష్టి పెట్టాలి. రైతే రాజు అనే నానుడిని నిజం చేసే ప్రభుత్వం రావాలని కోరుతున్నాం. - వి.ప్రణీత, విద్యార్థిని, చిన్నకోడూరు, జి.మెదక్ నవ తెలంగాణ నిర్మాణంలో భాగం కండి నవ తెలంగాణ సామాజికంగా, ఆర్థికంగా, రాజ కీయంగా, సాంస్కృతికంగా మరింతగా వెలుగులీనా లంటే ఎలాంటి మేలిమి మార్పులు రావాలి? అందు కోసం ఏమేం చేయాలి? ఎవరెవరు ఎలా నడుం బిగించాలి? వీటిపై మీ అభిప్రా యాలు ‘సాక్షి’తో పంచు కోండి. ఎలక్షన్ సెల్, సాక్షి దినపత్రిక, రోడ్ నం.1 బంజారాహిల్స్, హైదరాబాద్ లేదా election@sakshi.comకు మెయిల్ చెయ్యండి. -
జన తెలంగాణ కావాలె!
నవ తెలంగాణ: తెలంగాణ వచ్చింది. సంతోషమే. కానీ వస్తుందనుకున్న తెలంగాణ రాలేదు. భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది. రాజకీయ తెలంగాణ మాత్రమే వచ్చింది. దీనివల్ల ప్రజలకు ఏం లాభం. ప్రజల తెలంగాణ రావలసి ఉండే. దోపిడీ, పీడన లేని తెలంగాణ వస్తే బాగుండేది. రాజకీయ దోపిడీ, శ్రమ దోపిడీ లేని తెలంగాణ కావాలె. భూమి లేని వాళ్లందరికీ భూమి దక్కాలే. ఒకప్పుడు దొర గడీలను కూలగొట్టి తెలంగాణ సాయుధ పోరాటంలో దూకిన ఉద్యమకారుడు ఆయన. మార్క్సిజాన్ని, మానవత్వాన్ని, ఆధ్యాత్మికతను, తరతరాల సాహిత్య, సాంసృృతిక వారసత్వాన్ని వైవిధ్యభరితంగా ఆవిష్కరించిన గొప్ప రచయిత. దార్శనికుడు. ఆయనే అక్షరవాచస్పతి దాశరథి రంగాచార్య. తన జీవితకాలంలో వస్తుందో రాదో అనుకున్న తెలంగాణ వచ్చేసింది కానీ అది తాను కోరుకున్న తెలంగాణ కాదన్నది ఆయన ఆవేదన. సాక్షితో ఆ సాహితీ స్రష్ట పంచుకున్న భావాలు.. ఆయన మాటల్లోనే..! - దాశరథి రంగాచార్య అంతరంగం ‘తెలంగాణ వచ్చింది కదా సంతోషమేనా అని చాలా మంది అడుగుతున్నారు. ఫోన్లు చేసి పలకరిస్తున్నారు. ఏదో ఒకటి వచ్చినందుకు సంతోషమే కానీ, ఇది పెద్ద సంతోషమైతే కాదు. వచ్చింది రాజకీయ తెలంగాణ. దీనివల్ల ప్రజలకు ఏం పని.. ప్రజలకు మేలు చేసే తెలంగాణ రావలసి ఉండె. ప్రజల తెలంగాణ కోసం పోరాటం జరగవలసి ఉండే. అట్లా జరుగలేదు. తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులు సాధించిన ఫలితాలు ప్రజలకు దక్కినప్పుడే తెలంగాణ ప్రజల ఆకాంక్ష తీరినట్లు. కమ్యూనిస్టులు పంచిన లక్షలాది ఎకరాల భూములను దొరలు తిరిగి హస్తగతం చేసుకున్నారు. ఆ భూములు తిరిగి ప్రజల పరమైనప్పుడే తెలంగాణ లక్ష్యం నెరవేరినట్లు లెక్క. అదెట్లా సాధ్యమనుకోవద్దు. చిత్తశుద్ధి ఉండే ఏ మాత్రం కష్టం కాదు. ప్రజలకు భూమి మీద హక్కు లభించినప్పుడే వాళ్ల ఆత్మగౌరవం నిలబడుతుంది. గౌరవప్రదంగా బతుకుతారు. సాయుధ పోరాటం నుంచి నేటి దాకా ఎంతో రక్తాన్ని ధారపోసింది తెలంగాణ. ఇప్పుడు ప్రజలు ప్రశాంతంగా, సంతోషంగా బతికే సదుపాయాలు కావాలె. అట్లా బతుకాల్నంటే భూమి లేని వాళ్లందరికీ భూమి దక్కాలే. సకల జనుల అభివృద్ధి జరగాలె.. ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడేందుకు కాళోజీ లేడు. జయశంకర్ లేడు. తెలంగాణకు దిశానిర్దేశం చేసే పెద్దవాళ్లెవరు ఉన్నారు? చాలా అప్రమత్తంగా ఉండవలసిన సమయం ఇది. రాజకీయ నిరుద్యోగం కారణంగా నష్టం జరిగే అవకాశం ఉంది. చిన్న చిన్న పార్టీలు కూడా ముందుకొస్తాయి. రాజకీయ అనిశ్చితి పెరుగుతుంది. కొట్లాటలు పెరుగుతాయి. తెలంగాణ అభివృద్ధికి ఇది అవరోధం. ఈ రాక్షస క్యాపిటలిస్టు ఉత్పత్తి విధానంలో సామాన్యుడు ఏమవుతాడోననేదే నా ఆవేదన. ఈ ధనపతులు మానవాళిని, మానవతను నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు. భవిష్యత్తు తరాలకు మట్టి చిప్ప కూడా దక్కకుండా చేస్తున్నారు. ఇప్పటికైనా పరిశ్రమల్లో కార్మికులకు భాగస్వామ్యం ఉండే విధంగా విధానాలు రూపొందించాలి. కార్మికుల జీవితాల్లో గొప్ప ముందడుగు రావాలి. అందుకు చక్కటి దార్శనికత అవసరం. ఒక్క మాటలో చెప్పాలంటే సకల జనుల ఉద్యమ భాగస్వామ్యంతో వచ్చిన తెలంగాణలో సకల జనుల అభివృద్ధికి, సంక్షేమానికి బాటలు పడాలి. అప్పుడే తెలంగాణ స్వయంపాలన సాధించుకున్నట్లు. సాంస్కృతిక తెలంగాణ రావాలె.. నిజాం నిరంకుశ పాలనను,రజాకార్ల హింసను చవి చూసింది తెలంగాణ. ప్రజలు అనతి కాలంలోనే ఆ హింసను మరిచి నిజాంను ఒక ప్రభువుగా కీర్తిస్తారేమోననే భయం పట్టుకుంది నాకు. ఎందుకంటే అప్పటికే నిజాం కట్టించిన హైకోర్టును, ఉస్మానియా యూనివర్సిటీని పొగిడేవాళ్లు బయలుదేరారు. నాకు అత్యంత ప్రీతిపాత్రమైన తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజలకు అర్ధమయ్యే సులభ శైలిలో ‘చిల్లర దేవుళ్లు’ నవల రాశాను. ఆంధ్రప్రదేశ్ అవతరణ తరువాత తెలంగాణ భాష, యాస, సంస్కృతి,సాహిత్యం అన్నీ అస్తిత్వాన్ని కోల్పోయినై. మన భాషా సాహిత్యాలను, సంస్కృతిని, కళలను పరిరక్షించే సాంస్కృతిక తెలంగాణ కోసం కృషి జరగాలే. మన యాసను కాపాడుకోవాలె. అందుకోసం పాలకుల దృష్టికోణం మా రాలె. సాహిత్యాన్ని మరింత సుసంపన్నం చేయాలె. రాయటం చేతనైతే బాగుండు.. తెలంగాణ జీవితాన్ని, సమాజాన్ని ఇతివృత్తంగా చేసుకొని రాశాను. ఇప్పటికీ రాయాలనిపిస్తుంది. నేను అనుకున్నవన్నీ రాసేవాన్ని. ఇప్పుడు నా వయస్సు 86. నేను వృద్ధున్నే అయినా మనస్సు మాత్రం యువకగానే ఉంది. శరీరమే సహకరించడం లేదు. నా ఉచ్ఛ్వాసం రచన.నిశ్వాసం పఠనం. అవి రెండూ లేకుండానే బతికేస్తున్నాను. చౌరస్తా.. చైతన్యానికి మారుపేరు.. ఎగ్లాస్పూర్ ఓటర్లు నేతల తలరాతలు మార్చే ఓటుహక్కును తప్పనిసరిగా వినియోగించుకుంటూ చైతన్యానికి మారుపేరుగా నిలుస్తున్నారు కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలంలోని ఎగ్లాస్పూర్ గ్రామస్తులు. విప్లవోద్యమాలకు పుట్టినిల్లయిన ఈ మారుమూల గ్రామంలో నక్సల్స్ ఆజ్ఞలను సైతం బేఖాతరు చేస్తూ ప్రజాస్వామ్యంపై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ప్రస్తుతం గ్రామ జనాభా 619 కాగా, 380మంది ఓటర్లున్నారు. వీరిలో 40మంది విదేశాల్లో ఉన్నారు. 1994 ఎన్నికల్లో 72శాతం, 1996, 98లో 78శాతం, 2009 ఎన్నికల్లో 80శాతం, ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 85శాతం మంది ఓటు హక్కు వినియోగించుకుని ఆదర్శంగా నిలిచారు. - న్యూస్‌లైన్, కోనరావుపేట(కరీంనగర్) అక్కడ టీడీపీకి 2 ఓట్లే: ఎ(వి)లక్షణం మూడు దశాబ్దాలు గడిచిపోయినా అక్కడ టీడీపీకి పోలైన ఓట్లపై ఇప్పటికీ ప్రచారం జరుగుతోంది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీరామారావు స్వయంగా ప్రచారం చేసినా రెండంటే రెండే ఓట్లు రావడం చర్చనీయాంశమైంది. 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంజయ్‌విచార్‌మంచ్ అభ్యర్థిగా పెద్దపల్లి నుంచి ఎన్నికైన గోనె ప్రకాశ్‌రావు తర్వాత రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక నిర్వహించారు. టీడీపీ అభ్యర్థిగా వేముల రమణయ్య బరిలోకి దిగారు. అప్పుడు ఆయన విజయం కోసం స్వయంగా ఎన్టీ రామారావు రంగంలోకి దిగి కాల్వశ్రీరాంపూర్ మండలంలోని జాఫర్‌ఖాన్‌పేట, ఇద్లాపూర్ గ్రామాల్లో విస్తత ప్రచారం చేశారు. ఇంత చేసినా ఆ గ్రామాల్లో టీడీపీకి రెండంటే రెండే ఓట్లు పోలయ్యాయి. -న్యూస్‌లైన్, పెద్దపల్లి