విందు రాజకీయాలకు స్వస్తి పలకాలి
రాష్ట్ర సాధన కోసం 14 సంవత్సరాలు పోరాటం చేసిన ఎందరో నాయకుల త్యాగం ఫలించింది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ అనుచరులను, కార్యకర్తలను మచ్చిక చేసుకోవడానికి విందు, కుళ్లు రాజకీయాలను నేరుగా నడుపుతున్నారు. నిర్ణయించిన అభ్యర్థులను గెలిపించడం కోసం అహర్నిశలు శ్రమించేటటువంటి కార్యకర్తలను రాజకీయ పార్టీల నాయకులు గుర్తించి, గౌరవించి పైకి తీసుకురావాలి. ఇందుకు భిన్నంగా కార్యకర్తలను ప్రలోభపెట్టి పబ్బం గడుపుకొనే ధోరణికి, విందు రాజకీయాలకు స్వస్తి పలకాలి.
- ఎస్ తిరుపతి, మామిడిపల్లి, ఆర్మూర్ మండలం
వాగ్దానాలను నిలబెట్టుకోవాలి
నవ తెలంగాణ నిర్మాణంలో ముఖ్యంగా రాజకీయ నాయకులు తమ వాగ్దానాలను నిలబెట్టుకోవాలి. పర్సంటేజీలకు ఆశపడి అవినీతిని ప్రోత్సహిస్తే నవ తెలంగాణ నిర్మాణం సాధ్యం కాదు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు తెలంగాణలో పునరుద్ధరించాలి. ఆరోగ్యశ్రీని తప్పనిసరిగా కొనసాగించాలి. రెండోశ్రేణి పట్టణాల్లో( రామగుండం, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్) పరిశ్రమలను ప్రోత్సహించి యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించాలి. మహిళలకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేయాలి. వరంగల్, ఆదిలాబాద్‌లో విమానాశ్రయం ఏర్పాటుకు కృషి చేయాలి. ఆదిలాబాద్‌లో చాలాకాలంగా మూతపడి ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించడానికి చర్యలు చేపట్టాలి. నదుల అనుసంధానం, అవసరమైన చోట ప్రాజెక్టులు కట్టించడానికి వెనుకాడొద్దు.
-ఎం. శ్రీకాంత్, ఫార్మసిస్టు, పీహెచ్‌సీ గిమ్మ, ఆదిలాబాద్
బంగారు తెలంగాణ
మనం కలలుగన్న బంగారు తెలంగాణ ఏర్పడాలంటే అత్యధిక ప్రాధాన్యం వ్యవసాయానికి ఇవ్వాలి. దేశానికి రైతు వెన్నెముక అని అంటారు కానీ మన సమాజంలో రైతంటే ఎంతో చిన్నచూపు ఉంది. నేటి యువతను ప్రశ్నిస్తే కలెక్టర్, డాక్టర్, యాక్టర్ కావాలనుకుంటున్నారు కానీ అన్నదాత కావాలని ఎవరూ భావించడం లేదు. నేటి యువతలో వ్యవసాయంపై మక్కువ పెంచేలా రైతు సమస్యల్ని పరిష్కరించేలా ప్రభుత్వం ఏర్పడి వ్యవసాయ వృత్తిని ఆదరించేలా చూడాలి. నేటి తెలంగాణ రైతు అనుభవిస్తున్న ప్రధాన సమస్యలైన సాగునీరు, విద్యుచ్ఛక్తి, మేలైన విత్తన సరఫరా, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై సత్వరం దృష్టి పెట్టాలి. రైతే రాజు అనే నానుడిని నిజం చేసే ప్రభుత్వం రావాలని కోరుతున్నాం.
- వి.ప్రణీత, విద్యార్థిని, చిన్నకోడూరు, జి.మెదక్
నవ తెలంగాణ నిర్మాణంలో భాగం కండి
నవ తెలంగాణ సామాజికంగా, ఆర్థికంగా, రాజ కీయంగా, సాంస్కృతికంగా మరింతగా వెలుగులీనా లంటే ఎలాంటి మేలిమి మార్పులు రావాలి? అందు కోసం ఏమేం చేయాలి? ఎవరెవరు ఎలా నడుం బిగించాలి? వీటిపై మీ అభిప్రా యాలు ‘సాక్షి’తో పంచు కోండి.
ఎలక్షన్ సెల్, సాక్షి దినపత్రిక,
రోడ్ నం.1 బంజారాహిల్స్, హైదరాబాద్
లేదా election@sakshi.comకు మెయిల్ చెయ్యండి.
జన తెలంగాణ
Published Mon, Apr 7 2014 12:00 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM
Advertisement