రాజకీయ రథ సారథులెవరో..! | new committees affter Diwali in TRS Party | Sakshi
Sakshi News home page

రాజకీయ రథ సారథులెవరో..!

Published Tue, Oct 25 2016 3:34 AM | Last Updated on Sat, Oct 20 2018 7:44 PM

రాజకీయ రథ సారథులెవరో..! - Sakshi

రాజకీయ రథ సారథులెవరో..!

ఆదిలాబాద్ జిల్లా , కొత్త కమిటీలు , దీపావళి
 దీపావళి తర్వాత పార్టీల్లో కొత్త కమిటీలు
 కసరత్తు ప్రారంభించిన రాజకీయ పార్టీలు
 జిల్లాల పునర్విభజనతో మారిన రాజకీయ స్వరూపం..
 పార్టీల బలోపేతంపై అధిష్టానాల దృష్టి
 
 ఆదిలాబాద్ రిమ్స్ : జిల్లాల పునర్విభజనతో రాజకీయ పార్టీల్లో కొత్త రథసారథుల కోసం వేట మొదలైంది. అన్ని పార్టీలు జిల్లా వారీగా కమిటీలను విభజించుకునేందుకు రంగం సిద్ధమైంది. అధికార టీఆర్‌ఎస్‌తోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, బీజేపీ, టీడీపీలు కూడా ఆ దిశగా కసరత్తు ప్రారంభించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇన్ని రోజులుగా ఒకే ప్రాంతానికి చెందిన రాజకీయ నేతల ఆధిపత్యం ఉమ్మడి జిల్లాలో కొనసాగడంతో ఆదిలాబాద్ ప్రాంతానికి సరైన గుర్తింపు రాలేదు. దీంతో పలుమార్లు పార్టీలో విభేదాలు కూడా తలెత్తాయి. ప్రస్తుతం జిల్లాలు విడిపోవడంతో అందరికీ అవకాశం రానుంది. ఇన్నాళ్లు రాజకీయంగా, సామాజికంగా, ఎదగలేని నేతలు, కార్యకర్తలే కాకుండా కొత్తగా రాజకీయాలపై ఆసక్తి చూపేవారు కూడా కొత్త జిల్లాల ఏర్పాటు రాజకీయ భవిష్యత్తుకు దారి చూపనుంది.
 
 దీపావళి తర్వాతే..
 జిల్లాల పునర్విభజన ప్రక్రియ పూర్తికావడంతో పలు రాజకీయ పక్షాలు కొత్త కమిటీలను ఏర్పాటు చేసే విషయంపై దృష్టి సారించాయి. ఇందుకోసం దీపావళి పండుగ తర్వాత ముహూర్తం పెట్టుకున్నాయి. అధ్యక్ష పదవి కోసం ఆయా పార్టీల్లో పోటీ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నూతన అధ్యక్షుడు, కమిటీల కోసం కసరత్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో ఆయా పార్టీల బలాబలాల ఆధారంగా కమిటీల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. రాజకీయంగా తమ స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు అన్ని రాజకీయ పక్షాలు సమాయత్తం అవుతున్నాయి. ఉద్యమ పార్టీలతోపాటు ప్రాంతీయ, జాతీయ పార్టీలు సైతం జిల్లాలో నూతన కమిటీల కోసం కసరత్తు ప్రారంభించాయి. జిల్లాలో రాజకీయ శక్తిగా ఎదగడానికి వ్యూహాలు రచిస్తున్నారుు. ఇందుకోసం తమ అధిష్టానం రాష్ట్ర నేతలతో సంప్రదింపులు జరుపుతున్నాయి. నూతన జిల్లాలో పూర్తిస్థాయిలో పార్టీ కమిటీలను ఏర్పాటు చేసి గ్రామస్థాయిలో బలోపేతం చేసుకోవడంపై పార్టీలు దృష్టి సారించాయి.
 
 మారనున్న రాజకీయ స్వరూపం..
 జిల్లాల పునర్విభజనతో ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయ స్వరూపం మారనుంది. ఈ దీపావళి పండుగ తర్వాత అన్ని పార్టీలు కొత్త కమిటీలను ఎన్నుకోనున్నారుు. టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా లోక భూమారెడ్డి కొనసాగుతున్నారు. అధికార పార్టీలో కూడా పండుగ తర్వాత కొత్త అధ్యక్షుడు, కమిటీలను ఎన్నుకోనున్నారు. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మహేశ్వర్‌రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం జిల్లాలు విడిపోవడంతో ఆ పార్టీ కూడా కొత్త అధ్యక్షుడి కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది.
 
  బీజేపీ విషయానికొస్తే ఆదిలాబాద్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడిగా పాయల్ శంకర్ కొనసాగుతున్నారు. ఆసిఫాబాద్, నిర్మల్‌లో బీజేపీ జిల్లా అధ్యక్షుల కోసం కసరత్తు చేస్తున్నారు. టీడీపీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న లోలం శ్యాంసుందర్ అధ్యక్షతన ఈ నెల 26న జిల్లా కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్ కొత్త అధ్యక్షుడిని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యమ పార్టీల పరిస్థితి కూడా అంతే. ప్రస్తుతం సీపీఐ జిల్లా కార్యదర్శిగా కలవేణి శంకర్ ఉన్నారు. నవంబర్‌లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి నూతన కార్యదర్శిని ఎన్నుకోనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
 
 వైఎస్సార్సీపీ విభజన షురూ..
 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విభజన కసరత్తు వేగవంతమైంది. ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న బెజ్జంకి అనిల్‌కుమార్ నుంచి ఇప్పటికే ఆ పార్టీ అధిష్ఠానం అధ్యక్షుల కోసం పోటీపడే వారి వివరాలు సేకరించింది. మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలకు కొత్త అధ్యక్షులను ఎన్నుకోనున్నారు. ఇక ఆదిలాబాద్‌కు అనిల్ కొనసాగుతారా.. లేదా ఆయన్ను రాష్ట్ర కమిటీలోకి తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. నూతన కమిటీ సభ్యులు, సీనియర్ నేతలకు రాష్ట్ర కమిటీలో చోటు దక్కే అవకాశం ఉంది.
 
 ముఖ్యంగా యువతకు పార్టీలో ప్రాధాన్యతను కల్పించనున్నారు. దీపావళి తర్వాత పూర్తిస్థాయి కమిటీలను ప్రకటిస్తామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనిల్‌కుమార్ పేర్కొన్నారు. మొత్తం మీద జిల్లాల విభజన పూర్తికావడంతో రాజకీయ పార్టీల విభజన ఎలా ఉంటుందో.. ఎవరు కొత్త అధ్యక్షులవుతారో.. ఎలాంటి పరిణామాలు జరుగుతాయనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement