నిర్మల్ - నాలుగోసారి గెలిచి మళ్లీ మంత్రి అయిన ఇంద్రకరణ్ రెడ్డి
ఆదిలాబాద్ జిల్లాలో ప్రముఖ నాయకుడుగా ఉన్న ఇంద్రకరణ్ రెడ్డి మరోసారి నిర్మల్ నియోజకవర్గం నుంచి గెలిచారు. ఆయన నాలుగోసారి తన సమీప ప్రత్యర్ది మహేష్‌రెడ్డిపై 9271 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు. గతంలో ఎమ్.పిగా, జడ్పి చైర్మన్‌గా కూడా పనిచేసిన ఇంద్రకరణ్ రెడ్డి టిడిపితో రాజకీయాలలోకి వచ్చారు. తదుపరి కాంగ్రెస్‌ఐలోకి వచ్చారు. 2014లో అనూహ్యంగా ఆయన బిఎస్పి టిక్కెట్‌పై గెలుపొంది, ఆ తర్వాత టిఆర్‌ఎస్‌లో విలీనం అయ్యారు. దాంతో ఆయన మంత్రి అయ్యారు. 2018లో టిఆర్‌ఎస్ గెలిచి కెసిఆర్ క్యాబినెట్‌లో మరోసారి స్థానం సంపా దించుకున్నారు. ఇంద్రకరణ్ రెడ్డి 79985 ఓట్లు రాగా, మహేష్ రెడ్డికి 70714 ఓట్లు వచ్చాయి. కాగా బిజపి పక్షాన పోటీచేసిన డాక్టర్ ఇండ్ల సువర్ణారెడ్డికి 16900 ఓట్లు వచ్చి మూడో స్థానంలో ఉన్నారు. ఇంద్రకరణ్ రెడ్డి సామాజికంగా రెడ్డి వర్గానికి చెందినవారు.
2014లో ఎ.ఇంద్రకరణ్ రెడ్డి 8497 ఓట్ల మెజార్టీ సాధించి తన సత్తా చాటుకున్నారు. 2009 ఎన్నికలలో ప్రజారాజ్యం అభ్యర్దిగా రంగంలోకి వచ్చిన మహేష్ రెడ్డిపై స్వల్ప తేడాతో ఓడిపోయినా తర్వాత ఇంద్రకరణ్ రెడ్డి వరసగా రెండుసార్లు విజయం సాధించడం విశేషం. ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం అవడంతో మహేష్ రెడ్డి కాంగ్రెస్ ఐ ఎమ్మెల్యే అయ్యారు. ఇంద్రకరణ్ కొంతకాలం వై.ఎస్.ఆర్. కాంగ్రెస్‌లోకి వెళ్లారు. తెలంగాణ ఆవిర్భావంతో తిరిగి కాంగ్రెస్ ఐలోకి వచ్చారు. కాని 2014లో టిక్కెట్ రాదని అర్ధం అవడంతో బిఎస్పి టిక్కెట్ లపై నిర్మల్ నుంచి పోటీచేసి గెలుపొందడం విశేషం. నిర్మల్‌లో అత్యధికంగా పదమూడుసార్లు రెడ్లు ఎన్నిక కాగా, మూడుసార్లు బ్రాహ్మణులకు అవకాశం వచ్చింది.
ఒక ఎస్.సి కూడా ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్నప్పుడు గెలిచారు.నిర్మల్ నియోజకవర్గానికి కాంగ్రెస్, కాంగ్రెస్ ఐలు కలిసి ఆరుసార్లు, టిడిపి ఐదుసార్లు సోషలిస్టు పార్టీ, ప్రజారాజ్యం పార్టీ, బిఎస్పి, టిఆర్‌ఎస్ ఒక్కోసారి గెలుపొందాయి. ఒక ఇండి పెండెంటు కూడా నెగ్గారు. ఇక్కడ నుంచి మాజీ మంత్రి పి.నర్సారెడ్డి మూడుసార్లు గెలిస్తే ఒకసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు నర్సారెడ్డి లోక్‌సభకు కూడా ఎన్నిక య్యారు. 1985 నుంచి టిడిపి సీనియర్ నేతగా ఉండి ఎస్. వేణుగోపాల్‌చారి మూడుసార్లు ఇక్కడ గెలిచి, ఆ తరువాత మూడుసార్లు ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. రాష్ట్ర మంత్రిగా కేంద్ర మంత్రిగా పనిచేసిన చరిత్రను ఈయన సొంతం చేసుకున్నారు. 2009లో ముధోల్ నుంచి పోటీచేసి వేణుగోపాలాచారి గెలిచారు. తదుపరి టిఆర్‌ఎస్‌లో చేరి 2014లో ముధోల్‌లో తిరిగి పోటీచేసి ఓడిపోయారు. ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలు అయిన వారిలో వేణుతో పాటు ఇంద్రకరణ్‌రెడ్డి, నర్సారెడ్డి, గంగారెడ్డిలు కూడా ఎమ్.పిలుగా ఎన్నికయ్యారు.
2008లో టిఆర్‌ఎస్‌కు చెందిన లోక్‌సభ సభ్యుడు రాజీనామా చేసిన కారణంగా జరిగిన ఉప ఎన్నికలో ఇంద్రకరణ్‌రెడ్డి కాంగ్రెస్ ఐ తరుఫున పోటీ చేసి గెలుపొందడం విశేషం. కాని 2009లో శాసనసభ ఎన్నికలలో ఓటమి పాలయ్యారు. ఇక్కడ నుంచి గెలిచి మంత్రులైన వారిలో నర్సారెడ్డి, వేణుగోపాలాచారి, పి.గంగారెడ్డి, ఎ. ఇంద్రకరణ్‌రెడ్డి ఉన్నారు. గంగారెడ్డి 1978లో చెన్నారెడ్డి క్యాబినెట్‌లో ఉండగా. నర్సారెడ్డి అప్పట్లో పి.వి., జలగం క్యాబినెట్‌లలో పనిచేసారు. జిల్లా పరిషత్ ఛ్కెర్మన్‌గా పనిచేసిన ఇంద్రకరణ్‌రెడ్డి గతంలో టిడిపి తరుఫున లోక్‌సభకు ఎన్నికైనా, ఆ తరువాత పి.వి. నరసింహారావు ప్రభుత్వాన్ని రక్షించడం కోసం పార్టీ మారినవారిలో ఉన్నారు. నిర్మల్‌లో గెలిచిన మరో నేత ఎ.భీమ్‌రెడ్డి 1983లో డిప్యూటీ స్పీకర్ పదవి నిర్వహించారు.
నిర్మల్ గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
Comments
Please login to add a commentAdd a comment