‘‘కాంగ్రెస్‌లో చేరతా.. బీఆర్‌ఎస్‌ను ఓడిస్తా.. ప్రతీకారం తీర్చుకుంటా’’.. టికెట్ దక్కకపోవడంపై ఖానాపూర్(నిర్మల్) ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ సెన్సేషన్ రియాక్షన్ ఇది. అంత స్వరం పెంచినా.. బుజ్జగింపులకు బీఆర్‌ఎస్ అధిష్టానం దిగింది. అయినా ఆమె చల్లారలేదు. దీంతో ‘ప్రతీకార చర్యలకు’ దిగిందనే ఆరోపణలు తలెత్తుతున్నాయి. మొదట కూతురు భర్త.. ఇప్పుడు తన భర్తనే టార్గెట్ చేయడంపై ఎమ్మెల్యే రేఖా నాయక్ స్పందించారు కూడా.
సొంత ఎమ్మెల్యే రేఖనాయక్‌ను బీఆర్‌ఎస్ టార్గెట్ చేసింది!. అత్తమీద కోపం అల్లుడి మీద ప్రదర్శించింది. మహబూబ్ బాద్ ఎస్పీగా పని చేస్తున్నా శరత్ చంద్రపవార్‌ను.. ఉన్నపళంగా ఏమాత్రం ప్రాధాన్యత లేని పోస్టుకు బదిలీ చేసింది. ఈ రివెంజ్ ఇక్కడితోనే ఆగిపోలేదు. రేఖా నాయక్ దూకుడు తగ్గించేందుకు మరో అడుగు ముందుకేసింది. రేఖా నాయక్ కుటుంబ అక్రమాలను తవ్వే ప్రయత్నం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఆమె భర్త. శ్యామ్ నాయక్‌పై ఉన్న కేసును ఏసీబీ ద్వారా తిరగదోడేందుకు సిద్దమవుతోందని సమాచారం. తద్వారా రేఖానాయక్‌కు చెక్ పెట్టడంతో పాటు ఆసిఫాబాద్‌లో ఆమె భర్త పోటీ చేయకుండా ఉండేందుకు ఎత్తుగడ వేస్తోందనే ప్రచారం నడుస్తోంది.
బహిరంగంగా దూకుడు..
నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖనాయక్‌కు బీఆర్‌ఎస్ టికెట్ దక్కలేదు. ఆ టిక్కెట్‌ను ఆమె రాజకీయ ప్రత్యర్ధిగా భావించే జాన్సన్ నాయక్‌కు కేటాయించింది బీఆర్‌ఎస్ అధిష్టానం. దీంతో.. ముచ్చటగా మూడోసారి పోటీ చేయాలని బావించిన రేఖనాయక్ ఆశలు అవిరయ్యాయి. టిక్కెట్ దక్కలేదనే ప్రస్ట్రేషన్‌లో రేఖానాయక్.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌పై అగ్రహం వెల్లగక్కింది. కాంగ్రెస్‌లో చేరి పోటీ చేస్తానని బహిరంగంగానే ప్రకటించారు కూడా. ఈ క్రమంలో.. పార్టీ బుజ్జగింపులు చేసిన దారిలేదు. పైగా పార్టీ తిరుగుబాటు చేయడం పార్టీ పెద్దలకు నచ్చలేదట!. పైగా ఖానాపూర్‌తో పాటు ఆసిఫాబాద్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థుల్ని ఓడించి తీరతామని ప్రకటనలు చేయడం మరింత మండిపోయేలా చేసింది. అందుకే ఆమెను దారికి తేవడానికి ఎత్తుగడలు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
భార్యభర్తలపై..
రేఖా నాయక్ భర్త ఇప్పటికే శ్యామ్ నాయక్ కాంగ్రెస్‌లో చేరారు. మోటర్ వెహికల్ ఇన్స్‌పెక్టర్‌గా పని చేసిన శ్యామ్.. ఈ మధ్యే వీఆర్‌ఎస్ తీసుకున్నారు. అయితే.. భోరజ్ చెక్‌పోస్ట్ వద్ద ఎంవీఐగా పని చేసే సమయంలో ఆయనపై ఏసీబీ ఓ కేసు నమోదు చేసింది. ఆ కేసును ఇప్పుడు బయటకు తీయించాలనే ప్రయత్నాల్లో ఉంది. అలాగే.. రేఖా నాయక్ సైతం ఎమ్మెల్యేగా పలు అక్రమాలకు పాల్పడ్డారని.. ప్రధానంగా మిషన్ భగీరథ, దళిత బందు, వివిద పథకాల విషయంలో ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమాలపై విచారణ ద్వారా ఆమె దూకుడుకు చెక్ పెట్టాలని బీఆర్‌ఎస్ సర్కార్ భావిస్తోందట. అయితే ఇదంతా బీఆర్‌ఎస్ శ్రేణుల ద్వారా చేయిస్తున్న ప్రచారమని.. బెదిరింపుల ద్వారా రేఖా నాయక్, ఆమె భర్తను లొంగదీసుకునే ప్రయత్నమనే ఆమె అనుచరులు మండిపడుతున్నారు.
కుట్ర అంతా..
అవినీతి, అక్రమ ఆరోపణలను రేఖ, శ్యామ్‌లు సైతం కోట్టిపారేస్తున్నారు. ‘‘సర్కార్ బెదిరింపులకు భయపడేది లేదు. ఎలాంటి అక్రమాలకు పాల్పపడలేదు. ఎలాంటి విచారణకైనా సిద్ధం’’ అని ఆమె చెబుతున్నారు. అదేవిధంగా శ్యామ్ నాయక్ సైతం తాను వీఆర్‌ఎస్ తీసుకునేటప్పుడు ఏసీబీ క్లియరెన్స్ ఇచ్చిందని, కేసు కొట్టిపారేసిన తర్వాతనే వీఆర్‌ఎస్‌కు ప్రభుత్వం అమోదం ఇచ్చిందన్న విషయాన్ని ప్రస్తావిస్తున్న ఆయన.. కేసుతో అయ్యేది లేదంటున్నారు. ‘‘ప్రజల్లో మాకు పెరుగుతున్న అదరణ చూసి బీఆర్‌ఎస్ కుట్రలు పన్నుతోంది’’ అని మండిపడుతున్నారు ఈ భార్యభర్తలు. ఏది ఏమైనా.. సర్కార్ బెదిరింపులకు ఆ భార్యాభర్తలు తలొగ్గుతారా? లేదంటే ఈ వేధింపులు వాళ్లపై సింపథీ క్రియేట్ చేస్తాయా?.. చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment