
సాక్షి, హైదరాబాద్ : దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది.. దేశాన్ని అభివృద్ధి చేసింది.. 60 ఏళ్ల తెలంగాణ కల నిజం చేసింది కాంగ్రెస్ పార్టీనే అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. 72 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన గాంధీభవన్‌లో జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ వల్లే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని గుర్తు చేశారు. 60 ఏళ్ల తెలంగాణ కలను నిజం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీయే అన్నారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్, కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రజస్వామ్యాన్ని మంటగలుపుతున్నారని విమర్శించారు.
వచ్చే ఎన్నికల్లో ప్రజలే వారికి తగిన విధంగా బుద్ధి చెప్పి ప్రజస్వామ్యాన్ని రక్షించాలని కోరారు. తెలంగాణ శాసన సభ స్పీకర్ ఇద్దరు ఎమ్మెల్యేల శాసనసభా సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని హైకోర్టు తప్పు పట్టిందన్నారు. కానీ స్పీకర్ మాత్రం ఈ విషయాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. అప్పుడు మళ్ళీ హై కోర్టే జోక్యం చేసుకోని స్పీకర్‌కు నోటీస్‌లు ఇచ్చిందన్నారు. అంతేకాక వచ్చే ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం నాటికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
తాము అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఇస్తున్న 1000 రూపాయల పెన్షన్‌ను 2000 రూపాయలకు.. 1500 రూపాయల పెన్షన్‌ను 3000 రూపాయలకు పెంచుతామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు జానారెడ్డి, షబ్బీర్ అలీ, భట్టి విక్రమార్క రెడ్డి, ఇంచార్జి కుంతియా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment