దళితులపై దాడులు అమానుషం: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: దేశంలో దళితులపై దాడులకు దిగడం అమానుషమని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గాంధీభవన్‌లో సోమవారం జాతీయజెండాను ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ దళితులపై జరుగుతున్న దాడులను ప్రధాని నరేంద్రమోదీ ప్రస్తావించారని గుర్తుచేశారు. దళితులపై దాడులు దేశానికి మాయనిమచ్చ అని అన్నారు. ఇది దేశంలో అభద్రతా పరిస్థితులను పెంచుతుందని హెచ్చరించారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని ఉత్తమ్ అన్నారు.
జేఏసీ కార్యాలయంలో...
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జేఏసీ కార్యాలయంలో జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు ప్రహ్లాద్, పిట్టల రవీందర్, ముఖ్యనేతలు పాల్గొన్నారు.