సాక్షి, హైదరాబాద్/ సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో అధికారం చేపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రివర్గ కూర్పు కీలకంగా మారింది. ఎక్కువ మంది సీనియర్లు ఉండటం, ప్రాధాన్య శాఖల కోసం పోటీపడుతుండటంతో ఉత్కంఠ నెలకొంది. పలువురు సీనియర్లకు మంత్రులుగా అవకాశం ఖాయమైనా.. వారికి కేటాయించే శాఖలేమిటనేది ఇంకా తేలలేదు. బుధవారం అర్ధరాత్రి వరకు ఉన్న సమాచారం ప్రకారం.. సీఎంగా రేవంత్, మంత్రులుగా మరో 12 మంది వరకు ప్రమాణం చేస్తారని తెలిసింది.
ఈ జాబితాలో సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, శ్రీధర్‌బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో భట్టికి రెవెన్యూ, ఉత్తమ్‌కు ఆర్థికశాఖ ఇవ్వవచ్చని.. మరో సీనియర్ నేతకు హోంశాఖ ఇవ్వనున్నారని టీపీసీసీ వర్గాలు చెప్తున్నాయి. కానీ పక్కాగా స్పష్టత రావడం లేదు.
తొలి రోజున ప్రమాణం చేసేది ఎందరు?
వాస్తవానికి గురువారం రేవంత్‌రెడ్డి ఒక్కరే ప్రమాణం చేస్తారని తొలుత ప్రచారం జరిగింది. కానీ తర్వాత సంఖ్య పెరుగుతూ వచ్చింది. రేవంత్‌తోపాటు ఐదుగురు అని ఓసారి, ఆరుగురు అని మరోసారి, మొత్తం తొమ్మిది మంది ప్రమాణ స్వీకారం చేస్తారని ఇంకోసారి వార్తలు వచ్చాయి. చివరిగా 12 మంది వరకు తొలిరోజునే ప్రమాణం చేయనున్నట్టు గాందీభవన్ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువుదీరకపోతే.. మిగతావారు ఈనెల 9న, లేదా మరో రోజున ప్రమాణం చేస్తారని వివరించాయి.
కొందరు సీనియర్ల శాఖలు ఢిల్లీలోనే ఖాయం
రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కాకుండా 17 మంది మంత్రులను నియమించే వెసులుబాటు ఉంది. కాంగ్రెస్ తరఫున గెలిచిన వారిలో 24 మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. పారీ్టలో సీనియర్లు, ఇతర కోటాల్లో మరో ముగ్గురికిపైనే నేతలు మంత్రి పదవుల పోటీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కేబినెట్ బెర్తుల కోసం అటూఇటూగా 30మంది వరకు పేర్లను పరిశీలించిన ఏఐసీసీ.. పలువురిని మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న దానిపై రేవంత్‌కు దిశానిర్దేశం చేసిందని, రేవంత్ విచక్షణ మేరకు మరికొందరిని కేబినెట్లోకి తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
దీనితోపాటు కొందరు సీనియర్లకు శాఖల కేటాయింపుపై ఢిల్లీలోనే స్పష్టత వచ్చిందని.. డిప్యూటీ సీఎం హోదాలో భట్టి విక్రమార్కకు రెవెన్యూ శాఖ, ఉత్తమ్‌కు ఆర్థిక శాఖ ఇవ్వనున్నారని గాందీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ రెండు శాఖలతోపాటు హోంశాఖ కోసం పలువురు సీనియర్లు పోటీపడుతున్నారని తెలిసింది. దామోదర రాజనర్సింహ, శ్రీధర్‌బాబులకూ కీలక శాఖలు దక్కనున్నట్టు సమాచారం. అధిష్టానం సూచనలకు అనుగుణంగా.. ప్రమాణ స్వీకారం తర్వాత సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి ఆయా మంత్రులకు శాఖలను కేటాయిస్తారు.
మంత్రి పదవుల రేసులో ఉన్నది వీరే..
మంత్రి పదవుల కోసం సీనియర్లతోపాటు కొందరు జూనియర్ ఎమ్మెల్యేలు కూడా వివిధ కోటాల కింద పోటీ పడుతున్నారు. సామాజికవర్గాల ప్రాతిపదికన జూనియర్లను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి రావడంతో ఈ జాబితా పెరిగిపోయింది. సీనియర్ల జాబితాలో.. భట్టి, ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ప్రేమ్‌సాగర్‌రావు, సుదర్శన్‌రెడ్డి జి.వివేక్, జి.వినోద్, తుమ్మల నాగేశ్వర్‌రావు, దొంతి మాధవరెడ్డి, బాలూ నాయక్, టి.రామ్మోహన్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, జూపల్లి కృష్ణారావు ఉన్నారు.
జూనియర్ల జాబితాలో తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన ఆది శ్రీనివాస్, ఈర్ల శంకర్, వాకిటి శ్రీహరి, బీర్ల అయిలయ్యల పేర్లున్నాయి. వీరితోపాటు అద్దంకి దయాకర్, షబ్బీర్‌అలీ, బలరాం నాయక్ తదితరులు సామాజిక వర్గాలు, ఇతర కోటాల్లో మంత్రి పదవి ఆశిస్తున్నట్టు తెలిసింది. వీరిలో ఎవరెవరికి మంత్రులుగా అవకాశం వస్తుంది? వారిలో గురువారం ఎందరు ప్రమాణ స్వీకారం చేస్తారు? ఎవరెవరికి ఏయే శాఖలు కేటాయించనున్నారన్నది గురువారం తేలిపోనుంది.
కేబినెట్‌పై ఢిల్లీలో మల్లగుల్లాలు
రేవంత్‌రెడ్డి మంగళవారం రాత్రి ఢిల్లలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, ఏఐసీసీ పరిశీలకుడు డీకే శివకుమార్‌తో మంత్రివర్గ కూర్పుపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిసింది. సీనియర్లు ఉత్తమ్, భట్టి తదితరులు వెలిబుచ్చిన అభిప్రాయాలను ఈ సందర్భంగా రేవంత్‌కు డీకే వివరించినట్టు తెలిసింది. తర్వాత బుధవారం ఉదయం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌లతో రేవంత్ జరిపిన భేటీల్లోనూ మంత్రి పదవులపై చర్చించినా.. ఓ నిర్ణయానికి రాలేకపోయినట్టు సమాచారం.
రేవంత్ హైదరాబాద్‌కు వచ్చేందుకు బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఎయిర్‌పోర్టుకు బయలుదేరారు. కానీ మధ్యలో ఉండగానే అధిష్టానం పెద్దల పిలుపు మేరకు వెనక్కి వెళ్లారు. మహారాష్ట్ర సదన్‌లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రేతో భేటీ అయి అరగంటకుపైగా చర్చించారు. మరోవైపు ఢిల్లీలోనే డీకే శివకుమార్‌తో ఉత్తమ్, భట్టి, జి.వినోద్, శ్రీధర్‌బాబు, ప్రేమ్‌సాగర్‌రావు, మల్‌రెడ్డి రంగారెడ్డి తదితరులు విడివిడిగా భేటీ అయ్యారు. తమకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని, ప్రాధాన్య శాఖలు కేటాయించాలని కోరారు.
రేవంత్‌ను కలవని సీనియర్లు!
మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం దాకా ఢిల్లీలోనే ఉన్న రేవంత్‌రెడ్డి ఓవైపు.. ఉత్తమ్, భట్టి, శ్రీధర్‌బాబు తదితర సీనియర్లు మరోవైపు ఏఐసీసీ పెద్దలతో భేటీలు జరిపారు. కానీ సీనియర్లు ఎవరూ కూడా రేవంత్‌ను కలవలేదు. ఆయన అధిష్టానం పెద్దలను కలసినప్పుడూ వారు దూరంగానే ఉండటం చర్చనీయాంశంగా మారింది.
భట్టికి రెవెన్యూ.. ఉత్తమ్‌కు ఆర్థికం?
Published Thu, Dec 7 2023 12:29 AM | Last Updated on Thu, Dec 7 2023 9:18 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment