సాక్షి, హైదరాబాద్: పార్టీ అభ్యర్థుల ఖరారు ప్రక్రియ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత చర్చలకు దారితీస్తోంది. ఈసారి టికెట్ల కేటాయింపులో అనుసరించాల్సిన నిబంధనలు, ఉదయ్‌పూర్ డిక్లరేషన్ వంటి డాక్యుమెంట్లతోపాటు తెలంగాణ వరకు ప్రత్యేకంగా పాటించాల్సిన షరతులు కొన్ని ఉన్నాయని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.
ఆదివారం గాంధీభవన్ వేదికగా జరగనున్న ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ) సమావేశంలో ఆశావహుల జాబితాను షార్ట్‌లిస్ట్ చేయనున్న నేపథ్యంలో.. ఎలాంటి నిబంధనలు పాటిస్తారు? ఏయే నియోజకవర్గాల నుంచి ఎవరిని ఎంపిక చేసి అధిష్టానానికి ప్రతిపాదనలు పంపిస్తారన్నది ఆసక్తిగా మారింది. ఈ క్రమంలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పార్టీ టికెట్ ఇవ్వాలంటే తొమ్మిది నిబంధనలు పాటించాలని కొందరు సీనియర్లు సూచిస్తున్నారు.
వారసులు.. కుటుంబ సభ్యుల లొల్లి!
గతంలో ఎప్పుడూ ఉన్నదే అయినా.. ఈసారి ఉదయ్‌పూర్ డిక్లరేషన్ నేపథ్యంలో ఒక కుటుంబంలో ఎంత మందికి టికెట్లు ఇస్తారన్న దానిపై కాంగ్రెస్‌లో చర్చ జరుగుతోంది. గతంలో కంటే ఈసారి ‘ఫ్యామిలీ ప్యాక్’ డిమాండ్లు ఎక్కువగా ఉండటం, ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌లో చెప్పిన అంశాలపై పూర్తి స్పష్టత లేకపోవడంతో.. ఎవరెవరికి టికెట్లు రావొచ్చన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. వాస్తవానికి ఒక కుటుంబంలో ఒకరికే టికెట్ ఇవ్వాలని ఉదయ్‌పూర్‌లో జరిగిన కాంగ్రెస్ చింతన్‌శిబిర్‌లో నిర్ణయించారు.
అయితే కుటుంబంలోని మరో వ్యక్తి ఐదేళ్లకంటే ఎక్కువకాలం కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా పనిచేస్తే.. వారికి మినహాయింపు ఉంటుందని తీర్మానించారు. ఈ లెక్కన ఇప్పుడు టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుటుంబం విషయంలో జరుగుతున్న చర్చకు తెరపడినట్టేనని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఉత్తమ్‌తోపాటు ఆయన భార్య పద్మావతి కూడా గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. 2018 ఎన్నికల్లో ఓడినప్పటికీ.. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
ప్రస్తుతం టీపీసీసీ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. దీంతో ఉత్తమ్, పద్మావతిలకు టికెట్ల విషయంలో ఎలాంటి గందరగోళానికి తావులేదని ఆ పార్టీ సీనియర్ నేతలు అంటున్నారు. ఇక కుటుంబంలో రెండు టికెట్లు అడిగే అవకాశాలున్న వారిలో జానారెడ్డి, దామోదర రాజనర్సింహ, దామోదర్‌రెడ్డి, బలరాం నాయక్, జగ్గారెడ్డి, కొండా సురేఖ, అంజన్‌కుమార్ యాదవ్, సీతక్క తదితరులు ఉన్నారు. వీరి కుటుంబ సభ్యులకు ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ఏ మేరకు వర్తిస్తుంది? దాన్ని ఎలా అన్వయిస్తారన్న దానిపై పార్టీలో చర్చ జరుగుతోంది.
రాష్ట్ర కాంగ్రెస్‌లో చర్చ జరుగుతున్న నిబంధనలు ఇవే..
1) ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను తప్పకుండా పాటించాలి.
2) మూడుసార్లు వరుసగా ఓడిపోయిన వారికి టికెట్ ఇవ్వద్దు.
3) 2018 శాసనసభ ఎన్నికల్లో ఇతర పార్టీ గుర్తులతో పోటీచేసిన వారికి టికెట్లు ఇవ్వద్దు.
4) చివరి నిమిషంలో పార్టీలోకి వచ్చే ప్యారాచూట్ నేతలకు టికెట్లు నిరాకరించాలి.
5) క్షేత్రస్థాయిలో దశాబ్దాలుగా పనిచేస్తున్న వారికి, యువకులకు ప్రాధాన్యతనివ్వాలి.
6) పార్టీ అనుబంధ సంఘాల నేతలకు ఎన్నికల్లో పోటీచేసే అవకాశం కల్పించాలి.
7) ఇతర పార్టీల నుంచి ఇటీవలే కాంగ్రెస్‌లోకి వచ్చిన వారికి ప్రాధాన్యమిచ్చే రీతిలో వ్యవహరించవద్దు. రాహుల్‌గాంధీ ఆమోదంతో పార్టీలోకి వచ్చిన కొందరికి మినహాయింపు ఇవ్వాలి.
8) దరఖాస్తులు తీసుకుంటున్నారు కదా అని అప్‌లై చేసిన వారిని, పార్టీలో క్రియాశీల సభ్యత్వం లేని వారిని ప్రాథమిక స్థాయిలోనే తొలగించాలి.
9) ప్రదేశ్ ఎన్నికల కమిటీలోని మొత్తం సభ్యుల్లో 50శాతం మందికిపైగా టికెట్లు ఆశించనివారు ఉండాలి. పీఈసీలోని అందరూ టికెట్లు ఆశించే వారయితే షార్ట్‌లిస్ట్ ప్రక్రియ సజావుగా జరిగే అవకాశం ఉండదు.
ఒక టికెట్.. తొమ్మిది నిబంధనలు!
Published Sun, Sep 3 2023 1:13 AM | Last Updated on Sun, Sep 3 2023 1:13 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment