సాక్షి, హైదరాబాద్: బీజేపీలో అసంతృప్త నేతలుగా ముద్రపడిన వారిపై కాంగ్రెస్ దృష్టి సారించింది. వారిని పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఢిల్లీ నుంచే వల విసురుతోందని, ‘ఆపరేషన్ బీజేపీ అసమ్మతి’ కోసం సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్వయంగా రంగంలోకి దిగారని తెలుస్తోంది. బీఆర్‌ఎస్ పట్ల మెతక వైఖరి అనుసరిస్తోందని, తమకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని, క్షేత్రస్థాయిలో పార్టీపై నెలకొన్న ప్రజాభిప్రాయాన్ని దృష్టిలోఉంచుకుని బీజేపీతో కొంతకాలంగా అంటీ ముట్టనట్టుగా ఉంటున్న నాయకులు లక్ష్యంగా కాంగ్రెస్ అధిష్టానం పావులు కదుపుతున్నట్టు సమాచారం.
కాగా వేణుగోపాల్ ఇప్పటికే బీజేపీ అసమ్మతి నేతలతో టచ్‌లోకి వెళుతున్నారని, వారి రాజకీయ భవిష్యత్తుకు హామీలివ్వడమే కాకుండా, తెలంగాణలో బీజేపీకి అవకాశం లేనందున తమతో కలిసిరావాలని కోరుతున్నారని తెలిసింది. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ను, కేసీఆర్‌ను గద్దె దించడమే తమ ధ్యేయమని, అందుకే బీజేపీలోకి వెళుతున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టిన వారితో పాటు బీఆర్‌ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన కొందరిని టార్గెట్‌గా చేసుకుని వేణుగోపాల్ రంగంలోకి దిగారని గాందీభవన్ వర్గాలంటున్నాయి.
ఈ జాబితాలో మాజీ ఎంపీలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డితో సహా దాదాపు 20 మంది నాయకులున్నారని చెబుతున్నాయి. జిట్టా బాలకృష్ణారెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి లాంటి కొందరు నేతలు ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరగా, బీజేపీ కుంభస్థలాన్ని కొట్టామనే భావన కలిగించే స్థాయి నేతలను సైతం పార్టీలోకి రప్పించేందుకు కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
కాగా వారం పది రోజుల్లోనే ఫలితం కనబడుతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే మాజీ ఎంపీలు జి.వివేక్ వెంకటస్వామి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాత్రం తాము పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. మిగతా నేతల గురించి తమకు తెలియదని వారన్నారు. కానీ ప్రధాని మోదీ పాలమూరు, నిజామాబాద్ సభలకు అసంతృప్త నేతలు పలువురు హాజరుకాక పోవడం అనుమానాలకు తావిస్తోందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
మోదీ సభలకు వెళ్లలేదెందుకో?
బీజేపీ అసమ్మతి నేతల వ్యవహారశైలిపై రాజకీయ వర్గాల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. వీరంతా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధమైందనే ప్రచారం కొంతకాలంగా విస్తృతంగానే జరుగుతోంది. ఈ ప్రచారాన్ని ఎవరూ గట్టిగా ఖండించలేదనే చెప్పాలి. పైగా చాలాకాలంగా పార్టీ తీరుపై గుర్రుగా ఉన్న ఈ నేతలంతా ఇటీవల హైదరాబాద్ శివార్లలో ప్రత్యేకంగా ఫామ్‌హౌస్, డిన్నర్ మీటింగ్‌లు పెట్టుకున్నారు. కానీ ఈనెల 1, 3 తేదీల్లో జరిగిన మోదీ బహిరంగ సభలకు మాత్రం.. ఆ మీటింగ్‌లకు వెళ్లిన నేతల్లో ఒకరిద్దరు తప్ప మిగిలిన వారు హాజరు కాలేదు. దీంతో దీనివెనుక ఆంతర్యమేమిటనే చర్చ జరుగుతోంది.
తర్జనభర్జన!
కాంగ్రెస్ వైపు నుంచి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఆ పార్టీలోకి వెళ్లాలా? లేక బీజేపీలోనే ఉండాలా? అన్నదానిపై అసంతృప్త నేతలు తర్జనభర్జన పడుతుండటమే వారో స్పష్టమైన వైఖరి తీసుకోకపోవడానికి కారణంగా తెలుస్తోంది. బీజేపీ అసమ్మతి నేతల్లోని కీలక నేత ప్రధాన అనుచరుడు ఒకరు ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘మేం బీజేపీలో ఇమడలేకపోతున్నాం. వాస్తవానికి రజాకార్లతో కొట్లాట నుంచి కమ్యూనిస్టులతో పోట్లాట వరకు తరతరాలుగా కాంగ్రెస్‌తోనే ఉన్నాం.
ఇప్పుడు మా నాయకుడు బీజేపీలోకి వెళ్లాడు కాబట్టి మేం కూడా ఆ కండువా కప్పుకున్నాం. మాలో చాలా మంది మళ్లీ కాంగ్రెస్‌లోకి వెళ్లాలని అంటున్నారు. మా నాయకుడు కూడా అదే ఆలోచనలో ఉన్నారు. కానీ తరచూ పార్టీలు మారడమే ఇబ్బందిగా ఉందని అంటున్నారు. కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి వస్తే పార్టీ మారినా ప్రయోజనం ఉంటుంది. అలా కాకపోతే ఎక్కడైనా ప్రతిపక్షంలోనే కూర్చోవాల్సి వస్తుంది.
అలాంటప్పుడు బీజేపీలో ఉండడం వల్ల నష్టం ఏంటి? కాంగ్రెస్‌లోకి వెళ్లి లాభం ఏంటనే దానిపై మా నాయకుడు మల్లగుల్లాలు పడుతున్నారు. మిగతావారు కూడా దాదాపుగా ఇదే ఆలోచనతో ఉన్నారు. వారం, పది రోజుల్లో ఏదో ఒకటి తేలిపోతుంది..’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఆపరేషన్‌పై ఆ పార్టీ కీలక నేత ఒకరు మాట్లాడుతూ.. ‘ఢిల్లీ పెద్దలు చాలామందితో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీని వదిలివెళ్లిన వారిని మళ్లీ రమ్మని కోరుతున్నారు. రాజగోపాల్‌తో పాటు చాలామంది బీజేపీ అసమ్మతి నేతలతో వేణుగోపాల్ మాట్లాడుతున్నారన్నది వాస్తవం..’ అని చెప్పడం గమనార్హం.
కమలం అసంతృప్తులకు కాంగ్రెస్ గాలం!
Published Thu, Oct 5 2023 1:33 AM | Last Updated on Thu, Oct 5 2023 8:46 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment