ఈశ్వరి... నిన్ను నమ్మం | Paderu consistency people angry on Giddi Eswari | Sakshi
Sakshi News home page

ఈశ్వరి... నిన్ను నమ్మం

Published Sun, Mar 31 2019 11:44 AM | Last Updated on Sun, Mar 31 2019 11:59 AM

 Paderu consistency people angry on Giddi Eswari - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ‘‘చంద్రబాబు ఖబడ్దార్‌.. గిరిజనుల జోలికొస్తే తాట తీస్తా.. బాక్సైట్‌ జోలికి వస్తే మా సంప్రదాయ ఆయుధాలతో తల నరకుతా.. నీకు దమ్ముంటే నాపై పోటీకి దిగు.. బాక్సైట్‌ రిఫరెండెంగా నేను పోటీ చేస్తా.. నువ్వు పోటీ చేసినా.. నీ తరఫున ఎవరినైనా బరిలోకి దింపినా పర్వాలేదు..డిపాజిట్‌ కూడా దక్కదు. నువ్వు గెలిస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తా..నేను గెలిస్తే నువ్వు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయ్‌’’ ఈ మాటలన్నది ఇంకెవరో కాదు..ఒకప్పటి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే.. ప్రస్తుత పాడేరు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి.  

గిడ్డి ఈశ్వరి సుమారు మూడున్నరేళ్ల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆడిన మాటలు సంచలనమయ్యాయి. అయితే అంతలోనే పార్టీ ఫిరాయించి ఆయన పంచనే చేరిన ఈశ్వరి తీరుపై గిరిజనం మండిపడుతున్నారు. నిన్ను ఎలా నమ్మేదని ప్రశ్నిస్తున్నారు. 2015 డిసెంబర్‌ 10వ తేదీన చింతపల్లిలో బాక్సైట్‌కు వ్యతిరేకంగా జరిగిన సభలో గిడ్డి ఈశ్వరి ఆవేశంగా ప్రసంగించారు. ఏకంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి తలనరుకుతానంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెనుదుమారాన్ని లేపాయి. వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీలో ఓ ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చిపెట్టాయి. అదే సభలో నా చివరి ఊపిరి ఉన్నంత వరకు జగనన్నతోనే ఉంటానంటూ లక్షలాది మంది గిరిజనుల సాక్షిగా ప్రతిజ్ఞ కూడా చేశారు. సాధారణ ఉపాధ్యాయురాలునైన తాను చట్టసభలో అడుగుపెట్టేందుకు జగనన్నే కారణమంటూ గొప్పలు చెప్పారు. 

కానీ సరిగ్గా ఏడాదిన్నర క్రితం టీడీపీ ప్రలోభాలకు లొంగిపోయి కన్నతల్లి లాంటి వైఎస్సార్‌ సీపీకి, ఓట్లు వేసి గద్దెనెక్కించిన గిరిజనుల నమ్మకాన్ని వమ్ము చేస్తూ చీకటి ఒప్పందాలతో పార్టీని ఫిరాయించారు. ఆ తర్వాత తాను ఎందుకు పార్టీ ఫిరాయించాల్సి వచ్చిందో తన అనుచరుల వద్ద సిగ్గులేకుండా చెప్పుకొచ్చారు. టీడీపీలోకి వెళ్తే మంత్రి పదవి ఇస్తానన్నారు.. కేబినెట్‌ విస్తరణ కాస్త ఆలస్యమైతే రాష్ట్ర స్థాయి కార్పొరేషన్‌ పదవి ఇస్తానని హామీ ఇచ్చారని, అంతేకాకుండా ఎమ్మెల్యే గ్రాంట్స్‌ ఇస్తారు, పెద్ద ఎత్తున కాంట్రాక్టు పనులు కూడా చేసుకోవచ్చునంటూ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మంత్రి కాదు కదా కనీసం కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పదవి కూడా ఇవ్వలేదు. కానీ ఎమ్మెల్యే గ్రాంట్‌(ఎస్‌డీఎఫ్‌) నిధులతో పాటు వందల కోట్ల విలువైన కాంట్రాక్టులను తాను తన అనుచరులు చేజిక్కించుకుని అందినకాడికి అడ్డగోలుగా సంపాదించారన్న ఆరోపణలు టీడీపీ నేతలే వ్యక్తం చేస్తున్నారు. కేవలం అవినీతికి పాల్పడేందుకే గిడ్డి పార్టీ ఫిరాయించారని, ఇంతటి అవినీతి ఎమ్మెల్యేను తాము ముందెన్నడూ చూడలేదంటూ సొంత పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఈశ్వరికి టికెట్‌ ఇవ్వొద్దంటూ త్రీమెన్‌ కమిటీ సభ్యులతో పాటు మెజార్టీ టీడీపీ శ్రేణులు అమరావతి వరకు నిరసనలు వ్యక్తం చేశారు. అధినేతకు కూడా తేల్చిచెప్పారు. 

కానీ కోట్లు కుమ్మరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పడంతో మాజీ మంత్రి మణికుమారి, ఇతర ఆశావాహులను కాదని ఈశ్వరికే చంద్రబాబు టికెట్‌ ఇచ్చారు. ఎన్నికల ప్రచారం టీడీపీ తరఫున ఈశ్వరికి వెళ్లిన ప్రతిచోట బాక్సైట్‌ సభలో ఆమె చేసిన వ్యాఖ్యలను గిరిజనులు గుర్తు చేస్తున్నారు. అంతేకాదు పార్టీ ఫిరాయించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రమంతా ఏమౌవుతుందో నాకు తెలియదు కానీ పాడేరు, అరుకు నియోజకవర్గాల్లో ఎవరు నిలబడినా వైఎస్సార్‌సీపీ విజయఢంకా మోగిస్తుందని ఈశ్వరి నోరు జారారు. ప్రస్తుతం టీడీపీ అభ్యర్థిగా ప్రచారం చేస్తుండగా గిరిజనులు ఎక్కడికక్కడ ఏ ముఖం పెట్టుకుని వస్తున్నావ్‌..నీకు ఎందుకు వేయాలి ఓటు అంటూ నిలదీస్తున్నట్టుగా తెలియవచ్చింది. నాటి చింతపల్లి సభలో ఆమె అన్న మాటలను గుర్తు చేసుకుంటున్నారు.

‘అల్లూరి సీతారామరాజు ప్రాంగణం సాక్షిగా, ఈ కొండల సాక్షిగా, గిరిజనుల సాక్షిగా మా గిరిజన మానోభావాలన్నీ జగనన్నే అన్నావు. జగనన్నను మా గుండెల్లో పెట్టుకున్నాం. ఆయన్నే సీఎం చేసుకుంటాం అన్నావ్‌గా..మళ్లీ ఇప్పుడు   చంద్రబాబును సీఎం చేయాలని ఎలా కోరుతున్నావ్‌ అంటూ ఈశ్వరిని  ప్రశ్నిస్తున్నారు. బాక్సైట్‌ జోలికి వస్తే చంద్రబాబు తలనరుకుతావ్‌ అన్న నువ్వు మళ్లీ ఆ పార్టీ తరఫున ఓట్లు అడగడానికి వస్తే ఎలా వేస్తాం అంటూ నిలదీస్తున్నారు. బాక్సైట్‌ గనుల తవ్వకాలను ఆపే శక్తి మా గుండెల్లో దాచుకున్న జగనన్నకే ఉందంటూనే మాత తప్పి టీడీలో చేరిన నీకు తగిన గుణపాఠం చెబుతామని గిరిజనులు చెబుతున్నారు. ఇటీవల పాడేరు ఎన్నికల సభలో కూడా ఇదే విషయాన్ని రాజన్న బిడ్డ, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బాక్సైట్‌ గనుల తవ్వకాలపై స్పష్టమైన హామీనిచ్చారు. గిరిజనుల మనోభావాలకు విరుద్ధంగా బాక్సైట్‌ గనుల తవ్వకాల జోలికి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తాము చంద్రబాబును నమ్మమని గిరిజనులు తెగేసి చెబుతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement