
సౌందట్టి (కర్ణాటక) : రాఫెల్ ఒప్పందంలో మార్పు చేస్తున్న విషయం అప్పుడు రక్షణశాఖ మంత్రిగా ఉన్న మనోహర్ పారికర్‌కు కూడా తెలియదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. పారికర్‌కు తెలియకుండానే ప్రధాని నరేంద్రమోదీ ఈ పనిచేశారని చెప్పారు. ఆ సమయంలో గోవాలో పారికర్ చేపలు కొనుగోలు చేస్తున్నారంటూ చమత్కరించారు. 'మాజీ రక్షణ శాఖమంత్రి గోవాలోని ఫిష్ మార్కెట్‌లో చేపలు కొనుగోలు చేస్తున్నారు. ప్రధాని మోదీ రాఫెల్ కాంట్రాక్టును పూర్తిగా మార్చేసిన విషయం ఆయనకు తెలియదు' అని రాహుల్ అన్నారు.
రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి మూడు ప్రశ్నలు ప్రధాని మోదీకి మీడియా ప్రతినిధులు సంధించాలని విజ్ఞప్తి చేశారు. అసలు రాఫెల్ జెట్ల ఖరీదు ఎంత? ఆ కాంట్రాక్టును ఎందుకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్) నుంచి తొలగించారు? ఎందుకు ఓ వ్యాపార వేత్తకు ఆ కాంట్రాక్టు అప్పగించారు? ఈ ప్రశ్నలు నేను గతంలో కూడా ప్రధానికి వేశాను. కానీ, ఒక్క సమాధానం లభించలేదు. మీకు దొరుకుతుందేమో ప్రశ్నించండి?' అని రాహుల్ అన్నారు. కర్ణాటకలో ఎన్నికలు ఏప్రిల్ లేదా మే నెలలో జరగనున్న నేపథ్యంలో రాహుల్ ప్రచార వేడిని పెంచారు. అందులో భాగంగా జరిగిన బహిరంగ సమావేశంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment