
సాక్షి, నిడదవోలు : నిడదవోలులో జరిగిన బహిరంగ సభలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ఆ పార్టీ గుర్తును ప్రకటించారు. ‘పిడికిలి’ జనసేన పార్టీ గుర్తుగా ఆయన పేర్కొన్నారు. సమాజంలో అందరి ఐక్యతకు చిహ్నంగా పిడికిలి ఉంటుందని ఆయన అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టీడీపీపై నిప్పులు చెరిగారు. రాజకీయాల్లో తనను తాను ఎన్టీఆర్‌గా పోల్చుకుంటూ వెన్నుపోటు పొడిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
కేజీ బేసిన్ ప్రజలందరిదని, దానిలో వాటా ఏపీ ప్రజలందరి హక్కు అని పేర్కొన్నారు. కాకినాడ పోర్టు నుంచి టీడీపీకి చెందిన ఒక వ్యవస్థ ద్వారా టన్నులకొద్ది రేషన్ బియ్యం ఆఫ్రికాకు తరలిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి అనుభవజ్ఞులైనవారు కావాలనే 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా చంద్రబాబుకు సపోర్ట్ చేశానన్నారు. నిడదవోలులో ఆర్వోబీ బ్రిడ్జి నిర్మించలేకపోవడానికి ఇక్కడి పాలకులే కారణమని ఆరోపించారు.