
సోంపేటలో బీలప్రాంతంలో అమరవీరుల స్థూపం వద్ద మాట్లాడుతున్న పవన్‌కల్యాణ్
ఇచ్ఛాపురం: పర్యావరణాన్ని రక్షించే అభివృద్ధి సమాజానికి అవసరమని సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గంలో రెండో రోజైన సోమవారం పర్యటించిన ఆయన తొలుత ఇచ్ఛాపురంలోని స్వేచ్ఛావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం సోంపేట మండలంలోని థర్మల్ వ్యతిరేక పోరాటంలో చనిపోయిన వారి స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. ఉద్యమకారులు, బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉద్యమకారుడు గున్న జోగారావు భార్య జగదాంబ మాట్లాడుతూ ఉద్యమంలో తన భర్త చనిపోయాడని, ఆ సమయంలో పరామర్శలకు వచ్చిన నేతలు పింఛను అందజేస్తామని, పిల్లకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ఇచ్చిన హమీ నెరవేరలేదని పవన్ దృష్టికి తెచ్చారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ చిత్తడి నేలలను రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. థర్మల్ విద్యుత్ కర్మాగారాన్ని నిలుపుదల చేసేందుకు ఈ ప్రాంత ప్రజలు దేశ చరిత్రలో నిలిచిపోయేలా ఉద్యమం చేశారన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఆక్వా చెరువులతో ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీలు పెరిగిపోయాయని, ఇలాంటి ప్రాంతంలోనూ ఆక్వా చెరువులు నిర్మించడం వల్ల పంటపొలాలకు నష్టం వాటిల్లుతోందన్నారు. ప్రభుత్వాలు చిత్తడి నేలల పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ సంఘం నాయకులు డా. వై.కృష్ణమూర్తి, బి.ఢిల్లీరావు, శ్రీరామమూర్తి, బి.సుందరరావు, గంగాధర్ పట్నాయక్ ఉన్నారు. అనంతరం పవన్ పలాస పట్టణానికి చేరుకొని రాత్రికి అక్కడే బస చేశారు.
Comments
Please login to add a commentAdd a comment