గాజువాకలో జనసేనకు పడే ప్రతి ఓటూ నిష్ప్రయోజనమేనా? | Pawan Kalyan as No Clarity About Visakhapatnam Problems | Sakshi
Sakshi News home page

గాజువాకలో జనసేనకు పడే ప్రతి ఓటూ నిష్ప్రయోజనమేనా?

Published Tue, Mar 26 2019 12:33 PM | Last Updated on Fri, Mar 29 2019 1:23 PM

Pawan Kalyan as No Clarity About Visakhapatnam Problems - Sakshi

ఐదేళ్లకోసారి మనల్ని పాలించేవారిని ఎన్నుకునే మహత్తర అవకాశాన్ని కల్పిస్తోంది ఓటు హక్కు..స్థానిక సమస్యలపై అవగాహన.. వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నించే నేతలకు ఓటు వేస్తేనే.. ఆ హక్కు సద్వినియోగం చేసుకున్నట్లు..లేకుంటే విలువైన ఆ ఓటు హక్కు దుర్వినియోగమైనట్లే.. మీ ఓటు మురిగిపోయినట్లే..ఇప్పుడిదంతా ఎందుకంటే.. ఎక్కడి నుంచో వచ్చి.. ఇక్కడ ఉంటారో, ఉండరో కూడా చెప్పలేని.. ఇక్కడి సమస్యలపై కనీస అవగాహన లేని పవన్‌కల్యాణ్‌లాంటి అభ్యర్థులకు ఓటు వేసే విషయంలో ఇదే చర్చ తెరపైకి వచ్చింది.2009లో పీఆర్పీ అభ్యర్ధి చింతలపూడి వెంకట్రామయ్య గాలివాటం గెలుపును బలుపుగా ఊహించుకొని.. కుల లెక్కలు వేసుకుని ఉన్న పళంగా గాజువాకలో వాలిపోయిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఓటేస్తే ఏం ప్రయోజనం అన్న ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది.

అసలు ఆయన ఏ ప్రాతిపదికన  ఇక్కడ పోటీ చేస్తున్నారు..?ఉత్తరాంధ్ర పారిశ్రామిక కేంద్రంగా పరిగణించే గాజువాక సమస్యలపై ఆయనకు ఏమాత్రం అవగాహన ఉంది.. అసలు ఈ నియోజకవర్గ నైసర్గిక స్వరూపం తెలుసా.. ఇక్కడి ప్రజల కష్టాలు ఎరుకా?? సినీ మోజుతో వెర్రెత్తిపోయే అభిమానులుంటే చాలా.. ఈ ప్రాంత సమస్యల గురించి పట్టింపు లేదా..?పొరపాటున ఎన్నికల్లో బయటపడితే పవన్‌ ఇక్కడే ఉంటారా.. ఓడితే తిరిగి గాజువాక మొహమైనా చూస్తారా... అంతెందుకు అన్న చిరంజీవి ఓడిన సొంత జిల్లాలోని పాలకొల్లునే ఈ పదేళ్లలో ఒక్కసారి కూడా చూడలేదు.. సొంతూరిపైనే లేని మమకారం ఏ సంబంధమూ లేని గాజువాకపై ఏం చూపిస్తారు?.. ఈ ప్రశ్నలు, చర్చలన్నీ పవన్‌కు ఓటేస్తే మురిగిపోయినట్టేనన్న అభిప్రాయానికి దారితీస్తున్నాయి.అది నిజమేనా.. ఒక్కసారి పరిశీలిద్దాం రండి..
– గరికిపాటి ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: గాజువాక... ఒకప్పుడు విశాఖపట్నానికి ముఖద్వారం.. పరిశ్రమల పుంత.. ఇప్పుడు మహా విశాఖ నగరపాలక సంస్థలో అంతర్భాగం.. కానీ విశాఖ నగర వాతావరణానికి భిన్నమైన ప్రాంతం. స్టీల్‌ ప్లాంట్, బీహెచ్‌ఈఎల్, ఆటోనగర్, జింక్, కోరమాండల్, హెచ్‌పీసీఎల్‌ వంటి భారీ పరిశ్రమల్లో పనిచేసే లక్షలాదిమంది కార్మికుల ఆవాస పట్టణం. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో గాజువాక సెగ్మెంట్‌ ఏర్పాటై పదేళ్లు దాటినా ఇప్పటికీ  సమస్యల పురిటినొప్పులతో కొట్టుమిట్టాడుతోంది. ఉత్తరాంధ్ర పారిశ్రామిక రాజధానిగా వెలుగొందుతున్నప్పటికీ తాగునీరు వంటి కనీస సౌకర్యాలు కూడా లేక సమస్యల పుంతగా మారింది.

హౌస్‌ కమిటీ.. హుష్‌కాకి
మూడు దశాబ్దాలుగా నలుగుతున్న గాజువాక హౌస్‌ కమిటీ భూముల సమస్య ఐదు డివిజన్లపై ప్రభావం చూపుతుంది. హౌస్‌ కమిటీ నిబంధనల కారణంగా ఈ డివిజన్ల ప్రజలు అవసరాల కోసం ఆస్తిని అమ్ముకోవడానికి, రుణం పొందడానికి కూడా అవకాశం లేకుండాపోయింది.

ఉక్కు నిర్వాసితులకు అన్యాయం
అత్యంత అన్యాయానికి గురైనవారు స్టీల్‌ప్లాంట్‌ నిర్వాసితులు. మూడు దశాబ్దాల క్రితం స్టీల్‌ప్లాంట్‌ భూసేకరణ సమయంలో ప్రభుత్వం 16500 మందికి ఆర్‌ కార్డులు జారీ చేసింది. వీరిలో 7500 మందికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. ఇంకా 9 వేలమందికి ఎదురుచూపులు తప్పడం లేదు. స్టీల్‌ప్లాంట్‌ నియామకాల్లో 50 శాతం నిర్వాసితులకు కేటాయించాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తెచ్చిన జీవో ఇప్పటికీ అమలు కాలేదు. నిర్వాసితుల ఆర్‌ కార్డులు మూడో తరానికి బదిలీ కావడంలేదు.

గంగవరం మత్స్యకారుల సమస్య గాలికి
వేట లేక ఆకలితో మాడుతూ అత్యంత ప్రమాదకరమైన కాలుష్యం మధ్య గడుపుతున్న గంగవరం మత్స్యకారుల సమస్యలను టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. గంగవరం పోర్టు కారణంగా వేటకు దూరమైన మత్స్యకారులకు జీవన భృతి అమలు కాలేదు. చేపల వేటకు వెళ్లేందుకు అవసరమైన జెట్టీ నిర్మాణాన్ని పట్టించుకోలేదు. కాలుష్యానికి దూరంగా గంగవరం గ్రామాన్ని తరలించాలన్న ప్రతిపాదనను గాలికొదిలేశారు.

ఈఎస్‌ఐ ఆస్పత్రినిర్మాణంపై నిర్లక్ష్యం
షీలానగర్‌లో 500 పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసి వదిలేశారు. ఈ ఆస్పత్రికి మరో ఆరెకరాల భూమి కావాలని సంబంధిత శాఖాధికారులు ప్రతిపాదనలు చేశారు. పారిశ్రామికవేత్తలకు ఆగమేఘాల మీద భూ కేటాయింపులు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రతిపాదనను పట్టించుకోలేదు. గాజువాకలో ప్రభుత్వాస్పత్రి ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా పడకేసింది. ఇక్కడ సాయంత్రం నాలుగు గంటల తరువాత, సెలవురోజుల్లో గాని ప్రభుత్వ వైద్యం కావాలనుకున్నవారు అటు నగరంలోని కేజీహెచ్‌కు గాని, అగనంపూడిలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు గాని పరుగులు తీయాల్సిందే.

సమస్యల పుంత
ప్యాక్టరీల సైరన్‌ మోతలు, వాహనాల రణగొణ ధ్వనులు. తెల్లవారితే పొట్ట చేత పట్టుకొని పరుగులెట్టే జనాలు.. వెరసి నాలుగు లక్షల మంది జనాభా.. 36 ఉక్కు నిర్వాసిత కాలనీలు, 52 మురికివాడలు, 8 కొండవాలు కాలనీలు, 10 వుడా కాలనీలు, 6 సంపన్న వర్గాల కాలనీలు.. మొత్తంగా 14 డివిజన్లలో విస్తరించిన నియోజకవర్గం గాజువాక. ఈ పట్టణంలో ఇప్పటివరకు ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు లేవంటే నమ్మశక్యంగా కాకున్నా నిజం. అగనంపూడిలోని కళాశాలకు అదనంగా గాజువాక పట్టణంలో మరొకటి ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలను పాలకులు పట్టించుకోలేదు. దీంతో ఇక్కడి ప్రజలకు ప్రైవేట్‌ కళాశాలలే దిక్కవుతున్నాయి. ఇక ప్రజలు సేదతీరేందుకు ఒక్క పార్కు కూడా లేదు. జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులున్న గాజువాకలో ఆధునిక క్రీడా ప్రాంగణం లేదు. ఔత్సాహికులు రోడ్లపై సాధన చేయాల్సిందే.  వినాయకనగర్‌లోని ఆదర్శ గ్రౌండ్‌లో ఆధునిక క్రీడా ప్రాంగణం నిర్మిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ అడుగు కూడా ముందుకుపడలేదు. ఈ గ్రౌండ్‌లో కొనసాగుతున్న పాఠశాల తరలింపుపై ఇప్పటికీ సందిగ్ధం వీడని పరిస్థితే నెలకొంది. తాగునీరన్నది నిత్యసమస్యగా మారింది.

పవన్‌.. వీటిలో ఒక్క సమస్య అయినా తెలుసా?
 ’కుల’ లెక్కలు బేరీజు వేసుకుని గాజువాకకు దిగుమతి అయిన పవన్‌ కల్యాణ్‌కు వీటిల్లో ఒక్క సమస్య అయినా తెలుసా..  కనీసం అవగాహన ఉందా.. ఎప్పుడైనా గాజువాకలో ఏ సమస్యలున్నాయో తెలుసుకునే యత్నం చేశారా.. కేవలం గాజువాకలో అభిమానుల కోలాహలాన్ని పరిగణనలోకి  తీసుకుని పోటీకి దిగిన పవన్‌కల్యాణ్‌.. కనీసం ఆ అభిమానులు నివసిస్తున్న ప్రాంత సమస్యల పరిష్కారానికి ఏదిశగా ఆలోచిస్తున్నారు.. ఈ ప్రశ్నలకు జనసేన శ్రేణుల వద్దే కాదు.. పవన్‌ వద్ద కూడా సమాధానం లేదు. గెలిచినా.. ఓడినా.. పవన్‌కల్యాణ్‌ ఇక్కడ ఉండరు. అంతెందుకు ఎన్నికల వేళ ఇప్పటివరకు పార్టీ కార్యాలయమే తెరవలేదు. అలాంటి స్థితిలో ఏ సమస్య వచ్చినా మేం ఎవరిని కలవాలి.. పవన్‌ను కలిసేందుకు హైదరాబాద్‌ వెళ్లాలా.. ఎన్నికల తర్వాత రాజకీయాలకు ప్యాకప్‌ చెప్పి సినీషూటింగ్‌లకు వెళ్లిపోతే.. ఆయా ప్రాంతాలకు ఆయన్ను వెతుక్కుంటూ వెళ్లాలా.. అందుకే పవన్‌కు ఓటేస్తే ఆ ఓటు కచ్చితంగా మురిగిపోతుందనే విశ్లేషిస్తున్నారు గాజువాక ప్రాంతవాసులు, సీనియర్‌ సిటిజన్లు.

పెద్ద అమ్మోరుతల్లిపై ఒట్టేసి పట్టించుకోని పల్లా
ఇక ఐదేళ్ల కిందట తాను గెలిస్తే ఈ సమస్యలు పరిష్కరించేస్తానంటూ గత ఎన్నికల్లో గంగవరం గ్రామ దేవత పెద్ద అమ్మోరు తల్లిపై ప్రమాణం చేసి ఓట్లు వేయించుకున్న టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే, ప్రస్తుత అభ్యర్ధి పల్లా శ్రీనివాసరావు ఈ సమస్యల్లో ఏ ఒక్కదాన్నీ పట్టించుకోలేదు. దీంతో ఈ ఎన్నికల్లో ప్రజలు ఆయన్ను కూడా పట్టించుకోవడం మానేశారనే చెప్పాలి.

సమస్యల వలయంలో స్టీల్‌ప్లాంట్‌
ఇక  స్టీల్‌ప్లాంట్‌ స్థాపించి మూడున్నర దశాబ్దాలైనప్పటికీ  సొంత గనులు లేవు. దేశంలోని  ప్రైవేటు సంస్ధలకు సొంత గనులు కేటాయించినప్పటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు గనులు కేటాయించలేదు. దీని వల్ల టిస్కో, సెయిల్‌ ప్లాంట్ల ఉత్పత్తి వ్యయంలో ముడి పదార్ఢాలకు 30 నుంచి 40 శాతం ఖర్చు అవుతుండగా విశాఖ స్టీల్‌ప్లాంట్‌ మాత్రం 65 శాతం వెచ్చించాల్సి వస్తోంది. గత ఎన్నికల్లో స్టీల్‌ప్లాంట్‌కు గనులు కేటాయిస్తామని వాగ్దానం చేసిన చంద్రబాబు, స్థానిక ప్రజాప్రతినిధులు తర్వాత ఆ విషయాన్ని గాలికొదిలేశారు.     స్టీల్‌ప్లాంట్‌కు రాష్ట్రంలోని గనులు కేటాయించడానికి విముఖత చూపించే చంద్రబాబు ప్రభుత్వం ఫ్యాక్టరీ విస్తరణకు సేకరించిన భూములను కాజేసేందుకు స్కెచ్‌ వేసింది.  స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ పేరిట స్టీల్‌ప్లాంట్‌ నుంచి 300 ఎకరాలు కొట్టేయాలని కుట్ర చేసింది. భూములు ఇవ్వడం తమ పరిధిలో లేదని.. కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ ఆదేశాలు ఉండాలని స్టీల్‌ప్లాంట్‌ అధికారులు తెగేసి చెప్పడంతో దానికి అడ్డుకట్ట పడింది. ఇక వేసవి వచ్చిందంటే స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యానికి హడలే.  ఏలేశ్వరం నుంచి స్టీల్‌ప్లాంట్‌ వరకు నిర్మించిన ఏలేరు కాలువ ద్వారా సక్రమ నీటి సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రతి ఏడాది స్టీల్‌ప్లాంట్‌ ఇబ్బందులు పడుతూనే ఉంది. ప్రస్తుతం జీవీఎంసీ, ఫార్మాసిటీ ఇలా అన్నీ పోగా మిగిలిన నీటిని మాత్రమే సరఫరా చేస్తుండటంతో నీటి కొరత ఎదుర్కొంటోంది.

ఇదేనా సామాజిక న్యాయం
పవన్‌ కల్యాణ్‌ రాజకీయాల్లోకి వచ్చి సమాజాన్ని ఉద్దరిస్తానన్నారు. సామాన్య ప్రజలను రాజకీయాల్లోకి తీసుకువస్తానన్నారు. తన అన్నయ్య నాగబాబును తీసుకొచ్చి నర్సాపురంలో ఎంపీగా పోటీ చేయిస్తున్నారు. ఇదేనా సామాజిక న్యాయం. ఇదేనా మీరు రాజకీయాల్లో తీసుకొచ్చే మార్పు. హామీలు నేరవేర్చకపోతే చంద్రబాబునాయుడు కాలర్‌ పట్టుకుని అడుగుతానన్న పవన్‌.. ఇప్పడు అదే పెద్దమనిషి కాళ్లు దగ్గర ఎందుకు మోకరిల్లుతున్నారో సమాధానం చెప్పాలి. జనసేనను పార్టీ అనేదానికన్నా టీడీపీ బీటీమ్‌గా వ్యవహరిస్తే బాగుంటుంది. జనసేన కాస్త చంద్రబాబుకు భజన సేనగా తయారైంది. పోత్తుపెట్టుకున్న వామపక్షాలు, బీఎస్పీలు పవన్‌ కల్యాణ్‌ నిజస్వరూపం చూసి నివ్వెరపోతున్నాయి. రాష్ట్రంలో జనసేనకు ఓటు వేస్తే టీడీపీకు వేసినట్టే. ఈ విషయంలో యువతీయువకులు, మేధావులు, ప్రజలు, ఎవరూ మోసపోద్దు. – వైఎస్సార్‌ సీపీ నగర యువజన విభాగంఅధ్యక్షుడు, కొండా రాజీవ్‌గాంధీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement