మార్పు కోసం అంటూ ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి సొంత జిల్లా పాలకొల్లులో ఓడిపోయినా... తిరుపతిలో ఎమ్మెల్యేగా గెలిచి... అసెంబ్లీ మెట్లెక్కారు.ఇది 2009 నాటి విషయం.. సరిగ్గా పదేళ్ల తర్వాత ఈ ఎన్నికల్లో ఆయన తమ్ముడు పవన్ కల్యాణ్ తన సొంత పార్టీ జనసేన తరఫున పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నుంచి, విశాఖ జిల్లా గాజువాక నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే.అన్ని ‘కుల’ లెక్కలు చూసుకుని మరీ ఆ రెండు స్థానాల్లో ఏరికోరి బరిలోకి దిగినప్పటికీ చివరాఖరుకు ఫలితం మాత్రం నరాలు తెగే ఉత్కంఠనే రేకిత్తిస్తోంది.భీమవరం సంగతి పక్కనపెడితే మన జిల్లా గాజువాకలో పవన్ గెలుపుపై జనసేన శ్రేణులే కచ్చితంగా విజయం మాదేనన్న ధీమాను వ్యక్తం చేయలేకపోతున్నాయి.కనీసం ఎంపీ అభ్యర్ధి జేడీ అలియాస్ వీవీ లక్ష్మీనారాయణకు వచ్చిన వేవ్ కూడా పవన్‌కు గాజువాకలో కానరాలేదని ఆ పార్టీ వర్గాలే అంగీకరిస్తున్నాయి.వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డికే ఫలితం అనుకూలమంటూ సర్వేలు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో అయితే గియితే.. ఒకటి రెండు వేల ఓట్లతో బయటపడొచ్చేమోనంటూ జనసేనులు నైరాశ్యంలో కూరుకుపోయాయి.
ఎందుకిలా... ఇదంతా పవన్ స్వయంకృతాపరాధమేనా...కనీసం చిరంజీవి తాను సీఎం అయ్యేందుకే రాజకీయాల్లోకి వచ్చానని ప్రజలనేమో గానీ అభిమానులను మాత్రం నమ్మించగలిగారు.కానీ పవన్ మాత్రం కేవలం టీడీపీకి మేలు చేసేందుకే మొత్తం రాజకీయం నడిపిస్తున్నాడన్న వాదనలకు బలం చేకూరడంతో చివరికి కరడుగట్టిన అభిమానులు కూడా ఆఖరులో దూరమయ్యారని అంటున్నారు.అందుకే స్వయంగా ఆయన పోటీ చేసిన గాజువాకలో సరైన గుణపాఠం 70 ఎంఎంలో సాక్షాత్కరించనుందని ఇప్పుడు రాజకీయ పరిశీలకులు లెక్కలు వేస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: గాజువాకలో పవన్ కల్యాణ్ పరిస్థితేమిటి... చాలా కష్టమట కదా... టైట్ ఫైట్ అట కదా... వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పెద్దాయన తిప్పల నాగిరెడ్డి విజయం ఖాయమట కదా.. ఓ దశలో పవన్ మూడోస్థానంలోకి వెళ్తారనుకున్నా... మొత్తంగా రెండో స్థానంలోకి వచ్చే అవకాశం ఉందట కదా... ఏమో ఎలాగైనా కనీసం వెయ్యి ఓట్ల ఓట్లతోనైనా పవన్ బయటపడతారేమోనంటూ అభిమానుల దింపుడు కళ్ళెం ఆశలు..
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పోటీచేసిన గాజువాక ఫలితంపై పోలింగ్ తర్వాత గత నాలుగురోజులుగా విస్తృతంగా జరుగుతున్న చర్చల్లో ముఖ్యమైన అంశాలవి. గాజువాక నుంచి ఎమ్మెల్యే అభ్యర్ధిగా పవన్‌కల్యాణ్ పోటీ చేస్తున్నారని ప్రకటించిన దరిమిలా నెల కిందట వెల్లువెత్తిన అభిమానుల ఉత్సాహం.. చివరికి గత గురువారం నాడు పోలింగ్ సరళిని చూసిన తర్వాత పూర్తిగా నీరుగారిపోయింది. ఇందుకు పవన్‌దే పూర్తి బాధ్యతని జనసేన శ్రేణులే పేర్కొంటున్నారు. ‘‘అసలు నాకు కులాలే లేవు... కాపుల ఓట్లు నేనైమైనా అడిగినా..’’ అంటూ 2014 ఎన్నికల్లో కాపునాడు నేతలపై విరుచుకుపడిన పవన్‌కల్యాణ్ ఈ ఎన్నికల్లో స్వయంగా తాను పోటీకి దిగాల్సి వచ్చేసరికి కాపుల సంఖ్య గణనీయంగా ఉన్న భీమవరం, గాజువాక నియోజకవర్గాలనే ఎంచుకున్నారు. అందులో 2009లో పీఆర్పీ అభ్యర్థి చింతలపూడి వెంకట్రామయ్య గాజువాక నుంచి గెలవడంతో ఇక ఇక్కడ తిరుగులేదని పవన్ భావించారు. కానీ అప్పటి లెక్క వేరని ఆయన ఊహించలేదు. ప్రస్తుత వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి భారీ సంఖ్యలో ఓట్లు చీల్చ డంతో పీఆర్పీ, కాంగ్రెస్, టీడీపీ చతుర్ముఖ పోటీలో ఆ ఎన్నికల్లో పీఆర్పీ అభ్యర్థి గట్టెక్కాడు. కానీ ఆ లెక్కలేమీ లేకుండా పవన్ ఏవేవో ఊహించుకుని ఇక్కడికి వాలిపోయారు.
కనీసం పోటీ చేసిన సందర్భంలోనైనా పవన్ కల్యాణ్ గాజువాక సమస్యలపై ఏమైనా అవగాహన తెచ్చుకున్నారా.. అంటే అదీ లేదు. నేను వేలాది పుస్తకాలను చదివానని, చదువుతున్నానని గొప్పగా చెప్పుకునే ఆయన గాజువాకలోని ప్రధాన మౌలిక సమస్యల పరిష్కారం గురించి కూడా చెప్పలేకపోయారు. సినీ డైలాగుల మాదిరిగానే ఉద్యోగాల కల్పనపై, సాధ్యం కాని అగనంపూడి రెవెన్యూ డివిజన్ హామీల గురించి మాట్లాడటం తప్పించి సమస్యల పరిష్కారానికి నిర్మాణాత్మక ప్రణాళికను కూడా వెల్లడించలేకపోయారు. ఇక స్థానికేతర వివాదం తెరపైకి వచ్చినప్పుడు కూడా తాను ఓడినా గెలిచినా ఇక్కడే ఉంటాననే ప్రకటన కూడా చేయలేకపోయారు. అద్దె ఇల్లు తీసుకుంటున్నానని ఆర్భాటంగా చెప్పి ఒక్కరోజు కూడా ఆ ఇంట్లో బస చేయలేకపోయారు. పోనీ కనీసం గాజువాక మొత్తం కలియతిరిగారా... ప్రచారమైనా పక్కాగా నిర్వహించారా.. అంటే అదీ లేదు. నామినేషన్‌కు ముందు ఓసారి.. ఆ తర్వాత ఓసారి.. మొత్తంగా మూడు సార్లు మాత్రమే గాజువాకలో పర్యటించారు.
అభిమానుల ఓట్లే చాలనుకున్నారు..
కేవలం పవర్‌స్టార్ అనే ఇమేజ్‌కు, సినీ గ్లామర్‌కే ఓట్లు రాలుతాయని, అమాయక అభిమానులే ఓట్లు వేయిస్తారని ఆయన నమ్మినట్టు తెలుస్తోంది. అందుకే గాజువాకలో ప్రచారానికి కూడా పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదని అంటున్నారు. ఇక సామాజికవర్గ లెక్క బలంగా ఉండటంతో గాజువాకలో బయటపడొచ్చని పవన్ భావించారు. కానీ ఎన్నికల నాటికి వచ్చేసరికి పవన్ నైజం గాజువాక ప్రజకు తెలిసొచ్చినట్టు కనిపించింది. ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు ప్రచారానికే రావడం లేదు.. రేపు పొరపాటున గెలిస్తే ఏమిటి మన పరిస్థితి అని గాజువాక ప్రజలు భావించారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితిలో మార్పు వచ్చిందని అంటున్నారు. ఇక టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాస్‌పై... ఐదేళ్లు ఏ పనులూ చేయని సిట్టింగ్ ఎమ్మెల్యేగా సహజంగానే వ్యతిరేకత ఉంది. దీనికి తోడు...విశాఖలో పర్యటించిన టీడీపీ అధినేత సీఎం చంద్రబాబునాయుడు... పవన్ పోటీ చేస్తున్న గాజువాక వైపు తొంగిచూడకపోవడంతో టీడీపీ, జనసేన కుమ్మక్కు బట్టబయలైంది. ఇది కూడా గాజువాక ప్రజను ఆలోచింపజేసిందని అంటున్నారు. ఇక వరుసగా పదేళ్లుగా ఓడినా, గెలిచినా గాజువాక ప్రజలకు అందుబాటులో ఉన్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి సానుభూతి అస్త్రంతో పాటు ప్రతిపక్ష నేత, పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సరిగ్గా పోలింగ్‌కు రెండు రోజుల ముందు గాజువాకలో ఉవ్వెత్తున సాగించిన ప్రచారంతో మొత్తం పరిస్థితిలో మార్పు వచ్చిందని అంటున్నారు. ఈ క్రమంలోనే జననేత వైఎస్ జగన్ పేర్కొన్నట్టు లోకల్ హీరో నాగిరెడ్డి బలమైన అభ్యర్థిగా ముందువరుసలోకి దూసుకొచ్చారని అంటున్నారు. గత గురువారం నాడు జరిగిన పోలింగ్ సరళి కూడా అదే స్పష్టం చేసిందని చెబుతున్నారు.
జేడీకి వచ్చిన వేవ్ కూడాపవన్‌కు రాలేదా?
వాస్తవానికి జనసేన ఎంపీ అభ్యర్థి జేడీ అలియాస్ వీవీ లక్ష్మీనారాయణకు వచ్చిన వేవ్ కూడా పవన్‌కు కానరాలేదని విశ్లేషిస్తున్నారు. జనసేనకు అతీతంగా జేడీ తనదైన వర్గ లెక్కలు, తాను సృష్టించుకున్న ఇమేజ్ లెక్కలతో పవన్‌కు మించి దూకుడుగా ఓట్లు సాధించుకుంటాడన్న వాదనలు వినిపిస్తున్నాయి. కానీ పవన్ కరడుగట్టిన అభిమానులు మాత్రం ఏమో... కనీసం వెయ్యి ఓట్లతోనైనా బయటపడకపోతారా... అని దింపుడు కళ్లెం ఆశలతో ఎదురుచూస్తున్నారు. కానీ రాజకీయ పరిశీలకులు మాత్రం పవన్‌కల్యాణ్‌కు గాజువాకలో సరైన గుణపాఠం 70 ఎంఎంలో సాక్షాత్కరించనుందని ఇప్పుడు లెక్కలు వేస్తున్నారు.
కొసమెరుపు..
ఎన్నికలకు ముందు రాష్ట్రమంతా పర్యటించడం వల్ల గాజువాకకు రావడం కుదరడం లేదని పవన్ చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు ఎన్నికలైపోయాయి. విజయవాడ, గుంటూరుల్లో సేదతీరుతున్న ఫొటోలు, వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఇచ్చిన భారీ విరాళం వార్తలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. కనీసం ఇప్పుడైనా గాజువాక వచ్చి ఓ సారి ఇక్కడి ప్రాంత సమస్యలన్నీ పరికించొచ్చు కదా.. అనేది... జనం మాట కాదు.. జనసేన శ్రేణుల మాట.
Comments
Please login to add a commentAdd a comment