వివేకానందుని బోధనలు.. గ్రామ స్వరాజ్యం.. యువశక్తి.. ఇలాంటి సందేశాలెన్నింటినో అనర్గళంగా ప్రవచించేస్తుంటారాయన..అవన్నీ నిజమేనేమో.. నిజంగా ఆయన సంఘ సంస్కర్తేమోనని నమ్మేసి.. రాష్ట్రంలోని చాలా విద్యాసంస్థలు ఆయన్ను పిలిచి మరీ.. తమ విద్యార్థులకు ఆయనగారి సూక్తులు వినిపింపజేస్తుంటాయి..ఆ వ్యక్తి మరెమరో కాదు.. మాజీ సీబీఐ జేడీ, ప్రస్తుత విశాఖ లోక్‌సభ జనసేన అభ్యర్థి వి.వి.లక్ష్మీనారాయణ.అయితే.. సంస్కర్త అనేది.. ఆయన తొడుక్కున్న ముసుగా?.. ఆయన పైనా ’ఆదాయానికి మించిన ఆస్తులు’ ఆరోపణలున్నాయా..??పోలీసు మార్కు మార్చేసి.. ఇక ఖద్దరు మార్కు చూపిస్తానని చెబుతున్న జేడీ పోలీసు ‘మార్కు’ వెనుక ఎన్నో ‘మైనస్‌లు’ ఉన్నాయా..?!ఎవరు ఏ ప్రశ్న వేసినా వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను.. అని ఎక్కడికక్కడ తప్పించుకుంటున్న జేడీ.. అసలు విజ్ఞత ఏమిటి..?తాను దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టానని చెప్పుకొంటున్న ఆయన 28 ఏళ్ల సర్వీసులో అందుకున్న జీతభత్యాలతోనే అన్నేసి కోట్ల ఆస్తులు ఎలా సంపాదించేశారు?..నయాపైసా అప్పు లేకుండా.. కోట్ల విలువైన స్థిరచరాస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి??..ఇప్పుడు ఇవే ప్రశ్నలు జేడీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి..ఎన్నికల అఫిడవిట్‌లో స్వయంగా జేడీనే పేర్కొన్న వివరాలు చూస్తే ఎవరికైనా మతిపోకమానదు.. అనుమానమూ రాకమానదు. కావాలంటే మీరు ఆ చిట్టా చూద్దురు గాని రండి.. – గరికిపాటి ఉమాకాంత్‌సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: వి.వి.లక్ష్మీనారాయణ.. అలియాస్ జేడీ లక్ష్మీనారాయణ.. ఈ పేరును ఓ ’వర్గ’ మీడియా ఎందుకు బలవంతపు సెలబ్రిటీని చేసిందో మళ్లీ మళ్లీ చెప్పనక్కర్లేదు. నిజాయితీ, నిక్కచ్ఛి అధికారి అంటూ పదే పదే బాకా ఊదేసి ప్రజల మీదకు వదిలేసింది. ఇక ఈయన గారేమో చేస్తున్న ఉద్యోగం కూడా వదిలేసి.. వివేకానందుని బోధనలు.. గ్రామ స్వరాజ్యం.. యువశక్తి..లాంటి ఎన్నో షుగర్ కోటెడ్ పలుకులు అనర్గళంగా వల్లిస్తూ.. రాజకీయాల్లోకి వచ్చేశారు. అది కూడా నాటకీయ పరిణామాల మధ్య లోక్‌సత్తా టు జనసేన వయా టీడీపీ.. పక్కా ప్రణాళికతోనే సాగింది. ఇక అసలు విషయానికొస్తే.. జనసేన తరఫున విశాఖ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ఈ లక్ష్మీనారాయణ నామినేషన్ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్న స్థిర, చరాస్తుల వివరాలు అనేక సందేహాలకు తావిస్తున్నాయి. జీతభత్యాలు తప్పించి తనకు ఎటువంటి వ్యాపారాలు, వ్యాపకాలు లేవని.. వారసత్వంగా కూడా ఎటువంటి ఆస్తులు రాలేదని చెప్పుకొస్తున్న లక్ష్మీనారాయణకు మొత్తంగా రూ. 8.66 కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పైగా పూర్తి కాలం సర్వీసు కూడా చేయకుండానే అన్ని ఆస్తులు ఎలా కూడబెట్టారన్నది ప్రశ్నార్ధకమే. పోనీ 2018 మార్చిలో స్వచ్ఛంద విరమణ తర్వాత వచ్చిన బెనిఫిట్స్‌తో కూటబెట్టుకున్న ఆస్తులా.. అంటే.. కానే కావు మొత్తం సర్వీసులో ఉండగానే పోగేసుకున్న ఆస్తులవి. ఆ లెక్క ఎలా ఉందంటే..
మొత్తం ఆస్తులు.. రూ. 8.66 కోట్లు
అఫిడవిట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం వి.వి. అలియాస్ జేడీ లక్ష్మీ నారాయణ మొత్తం స్థిర, చరాస్తుల విలువ 8.66 కోట్లు. తన వద్ద రూ.1,16,500, భార్య ఊర్మిళ వద్ద రూ.1,70,00, కుమార్తె 22,000 నగదు ఉన్నట్టు పేర్కొన్నారు. తన పేరున యాక్సిస్ బ్యాంకులో రూ. 73,646 , ఆంధ్రా బ్యాంకులో రూ.1,79,450 ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నట్టు వివరించారు. మ్యూచువల్ ఫండ్స్‌లో తన పేరిట రూ.1,33,69,092, భార్య పేరిట రూ.3,65,995 చరాస్తులు ఉన్నట్టు పేర్కొన్నారు.
మొత్తం చరాస్తులు
చరాస్తుల లెక్క చూస్తే.. తన పేరిట రూ.6,67,88,695 చరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇందులో.. చేతిలో ఉన్న నగదు రూ.1,16,500గా పేర్కొనగా.. ఈక్విటీ షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ రూపంలో రూ.1,33,69,092, ఆంధ్రాబ్యాంక్ క్యాపిటల్ గెయిన్ బాండ్స్‌లో రూ.17,47,630, ఆంధ్రా బ్యాంక్ మరో అకౌంట్‌లో రూ.1,79,450, ఎస్‌బీఐలో రూ.93,517, యాక్సిస్ బ్యాంక్‌లో రూ.5,01,285, మరో యాక్సిస్ బ్యాంక్ అకౌంట్‌లో రూ.71,444, రూ.73,646 విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి. అదేవిధంగా మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ రూ.1,35,001, రూ.85,260 విలువైన ఎల్‌ఐసీ ప్రీమియం, రూ.87 వేల విలువైన పోస్టల్ ఇన్సూరెన్స్, రూ.10 లక్షల విలువైన పీపీఎఫ్ ఉంది.
శంకరపల్లిలో ఎకరం రూ.6లక్షలేనట!
ఇక లక్ష్మీనారాయణ తన భార్య ఊర్మిళ పేరుతో రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం మసనిగూడలో సర్వే నం.249/ఎ2, ఏ7–ఏ10, సర్వే నం.249/ఎఎ2, సర్వే నం.249/ఎఎ1లలో 1.25 ఎకరాలను 2013 అక్టోబర్ 17న కొనుగోలు చేశారు. కొనుగోలు చేసినప్పుడు దాని విలువ రూ.3,84,707 కాగా.. ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు 25లక్షల రూపాయలుగా పేర్కొన్నారు. అదే గ్రామంలో సర్వే నం.249/ఏ1/2, సర్వే నం.253/ఈ2లో నాలుగు ఎకరాలను 2018 మే 23న కొనుగోలు చేశారు. కొనుగోలు చేసినప్పుడు విలువ రూ.8,79,333 కాగా.. ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు రూ.25 లక్షలని అఫిడవిట్‌లో పొందుపరిచారు. వాస్తవంగా రీజనల్ ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిన నేపథ్యంలో శంకరపల్లి భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. ఇప్పటికే చుట్టూ రిసార్ట్‌లు ఏర్పాడ్డాయి. కానీ లక్ష్మీనారాయణ ఇప్పటికీ అక్కడ ఎకరం ధర సుమారు రూ.6.25 లక్షల మేరకే ఉందని పేర్కొన్నారు.
అపార్ట్‌మెంట్ల ధరల్లోనూ అనుమానాలే
మహారాష్ట్రలోని పూణెలో ముల్షీ తాలుకా, బవ్‌దాన్‌లోని సన్ గ్రాన్‌డ్యూర్‌లో 1300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్ నం.702ను 2004 జూన్ 17న దాగుడు సురేష్ అనే వ్యక్తి నుంచి రూ. 7,10,667కి కొనుగోలు చేశారు. ప్రస్తుతం దీని మార్కెట్ విలువ రూ.75 లక్షలు. ప్రస్తుతం దీన్ని డెవలప్‌మెంట్‌కి ఇచ్చారు. వాస్తవంగా పూణె వంటి మహా నగరంలో 1300 చదరపు అడుగుల విస్తీర్ణం గల స్థలం రూ.75 లక్షలు మాత్రమేనని చెప్పడం హాస్యాస్పదంగా అనిపిస్తోంది. కాగా అదే ప్రాంతంలో ప్లాట్ నెం.701 కూడా తనకున్నట్లు లక్ష్మీనారాయణ గతంలో ప్రభుత్వానికి సమర్పించిన వార్షిక ఆస్తుల వివరాల్లో పేర్కొన్నారు. కానీ ఎన్నికల అఫిడవిట్‌లో ఆ ప్లాట్ విషయం ప్రస్తావించలేదు. ఇక హైదరాబాద్‌లోని కరోల్‌బాగ్‌లో లక్ష్మణ్ ఎన్‌క్లేవ్‌లో 20.90 చదరపు మీటర్ల విస్తీర్ణంలోని(బిల్టప్ ఏరియా 880చదరపు అడుగులు) ఫ్లాట్ నం.202ను లక్ష్మీనారాయణ తన భార్యకు 2008 మే 17న గిఫ్ట్‌గా ఇచ్చారు. కొన్నప్పుడు విలువ రూ.5.50 లక్షలనీ ప్రస్తుతం దీని మార్కెట్ విలువ రూ.27 లక్షలు మాత్రమేనని పేర్కొన్నారు. మెహదీపట్నం పక్కనే ఉన్న కరోల్‌బాగ్‌లో కనీసం అర రూ.కోటి పెట్టినా ఫ్లాట్ రావడం గగనమే. మొత్తంగా చూస్తే లక్ష్మీనారాయణ సమర్పించిన ఆస్తుల లెక్క ఎన్నో సందేహాలకు తావిస్తోంది.
ముంబైలోరూ.5 కోట్ల ఫ్లాట్
ముంబైలోని వసుంధర కోపరేటివ్ సొసైటీలో ఉన్న ఫ్టాట్‌ను రూ.5 కోట్లకు అమ్మారు. ఆ తర్వాత అదే రాష్ట్రంలో ఎన్‌సీసీ అర్బన్‌లోని టవర్ నం.1లో 2018 ఏప్రిల్ 5వ తేదీన ఓ ఫ్లాట్ కొనుగోలుకు అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ ఫ్లాట్ ధర ఎంత, ఎంత మొత్తం అడ్వాన్స్ ఇచ్చారో అఫిడవిట్‌లో పొందుపరచలేదు. ఇక ఆయన భార్యకు రూ.28లక్షల విలువైన బంగారు ఆభరణాలున్నట్టు పేర్కొన్నారు. అంటే సుమారుగా ముప్పావు కేజీ బంగారం ఉందన్న మాట.
నాలుగేళ్లలో పది రెట్లు పెరిగిన ఆదాయం
అఫిడవిట్‌లో పేర్కొన్న ఆదాయ వివరాలు చూస్తే ఆశ్యర్యపోవాల్సిందే. ఆదాయపన్ను శాఖకు చెల్లించిన పన్నుల ప్రకారం 2013–14 ఆర్ధిక సంవత్సరంలో లక్ష్మీనారాయణ వార్షికాదాయం రూ. 23 లక్షలు కాగా, 2017–18నాటికి ఏకంగా పదిరెట్లు పెరిగింది. 2017–18లో ఆయన వార్షిక రూ.2కోట్ల 21లక్షల79వేల348గా పేర్కొన్నారు. ఈ నాలుగేళ్లలో ఆదాయం అమాంతం పదిరెట్లు ఎలా పెరిగిందన్నది ప్రశ్నార్ధకంగా ఉంది.
పవన్‌కు ఎకరా @రూ.27లక్షలు..
జేడీకి ఎకరా@రూ.6.25లక్షలు
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కూడా అదే శంకరపల్లి మండలం జన్‌వాడలో భూములున్నాయి. ఆయన తన అఫిడవిట్‌లో ప్రస్తుతం మార్కెట్‌లో ఎకరా విలువ రూ.27 లక్షలకు పైగా ఉందని పేర్కొన్నారు. కానీ లక్ష్మీనారాయణ మాత్రం నాలుగు ఎకరాల భూమి కేవలం రూ.25 లక్షలేనని పేర్కొనడం గమనార్హం.
కొసమెరుపు
ఎవరు ఏ ప్రశ్న వేసినా.. ఏ ఆరోపణ చేసినా.. వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను.. అని ఎక్కడికక్కడ తప్పించుకుంటున్న లక్ష్మీనారాయణా.. అసలు మీ విజ్ఞత ఏమిటి?.. ఎవరి ముసుగు మీరు.. విశాఖకు దిగుమతైన మీ అసలు రూపం ఎవరు.. మీరు చెప్పకపోయినా విజ్ఞులైన విశాఖ ప్రజకు ఆ మాత్రం తెలియకుండా ఉండదు.. ఏమంటారు?
మనువాదీ.. వీటికి సమాధానమేదీ? : అమలాపురం ఎంపీ రవీంద్రబాబు
కుల వ్యవస్థను వ్యతిరేకిస్తున్నట్టు పైకి చెబుతూ అసలైన మనువాదిగా వ్యవహరించే జేడీ లక్ష్మీనారాయణ హైదరాబాద్ శివారు ప్రాంతమైన శంకరాపల్లిలో ఎకరం రూ.2 కోట్ల విలువైన భూమిని నాలుగు లక్షలకే ఎలా కొన్నారో ప్రజలకు చెప్పాలని వైఎస్సార్సీపీ నేత, అమలాపురం ఎంపీ రవీంద్రబాబు డిమాండ్ చేశారు. పేద వ్యవసాయ కుటుంబంలో జన్మించానని చెప్పుకొనే లక్ష్మీనారాయణ రూ. 6.5 కోట్ల చరాస్తులు ఉన్నట్లు, ముంబయిలో ఐదు కోట్లుకు ఫ్లాట్ అమ్మినట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారన్నారు. ఉద్యోగం తప్ప ఏ ఆధారం లేదని చెప్పుకునే ఆయనకు ఏడాదికి రూ.20 లక్షలకు మించి ఆదాయం రాదని, మరి ఇన్ని కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ప్రస్తుతం శంకారాపల్లిలో ఎకరా భూమి ఖరీదు రెండు కోట్లని, కానీ జేడీ కేవలం నాలుగు లక్షలకే తన భార్యపేరు మీద కొనుగోలు చేసినట్లు అఫిడవిట్‌లో జేడీ పేర్కొనడం చూస్తేనే ఆయన నిజాయితీ ఏపాటిదో అర్ధమవుతుందన్నారు. తాను క్వార్టర్స్‌లోనే నివసించేవాడినని చెప్పుకున్న ఆయన 2014లోనే క్వార్టర్స్ ఖాళీ చేశానని అఫడవిట్‌లో పేర్కొన్నారని, 2018 వరకు ముంబయిలో ఎక్కడున్నారో అఫిడవిట్‌లో ఎందుకు తెలపలేదని ప్రశ్నించారు. ఆయన ఆదాయం లెక్కలు చూస్తేనే క్విడ్‌ప్రోకోలో భాగంగానే లక్ష్మీనారాయణ కోట్లు సంపాదించారని అర్థమవుతుందని ఎంపీ రవీంద్రబాబు వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment