జేడీ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన క్లిప్పింగ్..
ఎన్నికలకు వారం రోజుల ముందే జేడీ.. అదేనండీ విశాఖ జనసేన ఎంపీ అభ్యర్థి వీవీ లక్ష్మీనారాయణ గాలి తీసిన బెలూన్‌లా రోజురోజుకు దిగజారిపోతున్నారు.దూరపు కొండలు నునుపు మాదిరిగా.. నిన్న మొన్నటి వరకు టీవీలు, పేపర్లలో ఆయన ఉపన్యాసాలు.. సందేశాలు చూసి.. అభినవ అభ్యుదయవాదిగా ఊహించుకున్న ప్రజలు.. ప్రత్యేకించి విద్యావంతులకు ఇప్పుడిప్పుడే ఆయనపై భ్రమలు తొలగిపోతున్నాయి.ఆయన ఆస్తుల చిట్టా చూసి ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థులు కడిగిపారేస్తే.. కుల నేతలతో సమావేశమైన నిర్వాకం చూసి మేథావులు.. ఆయన్ను ఇప్పుడు ‘అభినయ’ అభ్యుదయవాదిగా విశ్లేషిస్తున్నారు.ఇక విశాఖను సింగపూర్ చేస్తానని నిన్నటి వరకు మాట్లాడి నవ్వులపాలైన జేడీ ఇప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఏకంగా ఛత్రపతి శివాజీతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సైతం ట్రోల్ అవుతున్నాయి.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే బలమైన ప్రజాకర్షక నేతల్లో ఒకరైన ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై నాటి యూపీఏ సర్కారు కక్షపూరితంగా కేసులు పెట్టిన సంగతి అందరికీ తెలిసిన వాస్తవమే.. ఆ కేసుల విచారణ పేరిట ఒక్కసారిగా ’వర్గ’ మీడియా చలవతో సడెన్ సెలబ్రిటీగా మారిన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఇప్పుడు రాజకీయాల్లో ఎన్నికల ఫలితాలకు ముందే నవ్వులపాలవుతున్నారు. నిజానికి ఆయన విశాఖ జనసేన అభ్యర్ధిగా తెరపైకి రాకముందు వర్గ మీడియా సృష్టించిన ఇమేజ్ అంతా ఇంతా కాదు. కానీ సొంత పార్టీ పెడతానంటూ చెప్పి చివరికి లోక్‌సత్తా టు జనసేన వయా టీడీపీగా సాగిన రాజకీయ ప్రయాణం, అర్ధరాత్రి హడావుడిగా జనసేనలో చేరి విశాఖలో వాలిపోవడంతోనే ఆయనపై విమర్శలు మొదలయ్యాయి. రాజకీయాల్లో.. అందునా పోటీ చేస్తున్న అభ్యర్థులపై ఆరోపణలు, విమర్శలు సహజమే అనుకున్నా.. జేడీ వ్యవహారశైలి మాత్రం ఆయన వేసుకున్న ముసుగును తొలగించిందనే చెప్పాలి.
తాను చిన్నప్పటి నుంచే కులాలకు, మతాలకు వ్యతిరేకమని ప్రసంగాలు దంచికొట్టే జేడీ.. జనసేనతో జత కట్టడం.. వలసవాదులు ఉత్తరాంధ్రను దోచేస్తున్నారని డైలాగులు కొట్టి.. చివరికి ఇక్కడి నుంచే బరిలోకి దిగడంతోనే జేడీ వ్యవహారం ఉత్తరాంధ్ర మేథావుల్లో చర్చకు తెరలేపింది. ఇక ఆయన మందీమార్బలంతో నామినేషన్ వేసేందుకు వెళ్ళి.. పైసా కూడా ఖర్చు చేయలేదంటూ చెప్పుకొచ్చిన వ్యవహారం.. ఆనక విశాఖను సింగపూర్ చేసేస్తానని పలికి ప్రగల్భాలు విద్యావంతులను ఆలోచింపజేశాయి. ఇదేమిటి.. జేడీ అంటే ఏమిటో అనుకున్నాం.. ఈయన కూడా ఫక్తు రాజకీయ నేత మాదిరే మాట్లాడుతున్నారన్న వ్యాఖ్యలు ఊపందుకున్నాయి. నామినేషన్ సందర్భంగా ఆయన సమర్పించిన ఆస్తుల చిట్టా చూసి ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్ధులైతే విమర్శలు గుప్పించారు. తాను కరడుగట్టిన నిజాయితీ పరుడినని చెప్పుకునే జేడీకి ముంబైలో ఐదుకోట్ల విలువ చేసే ఫ్లాట్, హైదరాబాద్ శివార్లలో ఎకరాలకు ఎకరాల పొలాలు, ముప్పావు కేజీ బంగారు ఆభరణాలు, స్థిర, చరాస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నల వర్షం కురిపించారు. వీటిపై ఎక్కడా సమాధానం చెప్పకుండా.. ఎవరు ఏ ప్రశ్న వేసినా వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పే జేడీకున్న విజ్ఞత ఏమిటన్న ప్రశ్న కూడా సంధించారు. ఇక ఆయన ఇటీవల వాల్తేరు క్లబ్‌లోనూ, ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలోనూ ప్రత్యేకించి ఓ కులపెద్దలతో సమావేశం కావడంపైనా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ పరిణామాలన్నీ గమనిస్తున్న విశాఖ విద్యావంతులు, మేథావులు....ఇప్పుడు తాజాగా జేడీ... పవన్ కీర్తన చూసి తలపట్టుకుంటున్నారు.
పవన్... ఛత్రపతి శివాజీనట!
సినీనటుడైన పవన్‌కల్యాణ్‌ను అభిమానులు కీర్తించడం వేరు.. కానీ జేడీ సైతం పవన్‌ను కీర్తిస్తూ ఏకంగా ఛత్రపతి శివాజీగా పేర్కొనడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. ఆనాడు ఛత్రపతి శివాజీ కొద్ద సైన్యంతో మొఘల్ సామ్రాజ్యాన్ని కొల్లగొట్టాడు.. ఈనాడు అలాంటి నాయకుడిని పవన్‌కల్యాణ్‌లో చూస్తున్నాను.. అని జేడీ అన్న మాటల వీడియోను స్వయంగా ఆయన ఫ్యాన్స్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ పోస్టింగ్‌పై విమర్శలు చెలరేగుతున్నాయి. మూడు పెళ్ళిళ్లు చేసుకున్న పవన్‌కు.. ఛత్రపతి శివాజీకి ఏమైనా పోలిక ఉందా.. అసలేమిటి.. జేడీ ఏం మాట్లాడుతున్నారో అర్ధమవుతుందా.. ఇదేనా జేడీ స్థాయి.. జనం చాలా ఊహించుకుంటున్నారు.. ఆయనపై భ్రమలు తొలగిపోయాయ్... అన్న వ్యాఖ్యలు హోరెత్తుతున్నాయి.
జేడీ అనొద్దు ప్లీజ్
వాస్తవానికి సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా చాలా మంది అధికారులు పనిచేశారు.. ఇప్పుడూ చేస్తున్నారు. కానీ కేవలం వైఎస్ జగన్ పుణ్యమాని వీవీ లక్ష్మీనారాయణ ఒక్కసారిగా జేడీ లక్ష్మీనారాయణ అయిపోయారు. జేడీ హోదాను తప్పించి సొంత క్యాడర్ మహారాష్ట్రకు బదిలీ చేసిన తర్వాత అక్కడ ఐజీ, అడిషనల్ డీజీగా కూడా చేశారు. అయినా సరే జేడీ అనే పేరే ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. ఆయన కూడా జేడీ అని పిలిస్తే.. చాలా సంబరపడిపోయే వారు. కానీ ఇప్పుడు అదే పేరు ఆయన్ను భయపెడుతోంది. ఎన్నికల బ్యాలెట్ పేపర్లో వీవీ లక్ష్మీనారాయణ అనే ఉంటుందని, జేడీ ఉండదు కాబట్టి వచ్చే నాలుగు ఓట్లూ గల్లంతవుతాయని కంగారు పడిపోతున్నారు. అందుకే జేడీ... అతి సర్వత్రవర్జయేత్.. అనేది.
Comments
Please login to add a commentAdd a comment