శకునాలు చెప్పే బల్లి కుడిత తొట్లో పడి చచ్చినట్లుగా ఉంది సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ (జేడీ) వాసగిరి వెంటక లక్ష్మీనారాయణ అలియాస్ జేడీ లక్ష్మీనారాయణ తీరు. అవినీతిని అంతం చేసేందుకు పుట్టిన కారణజన్ముడిగా పాపులర్ అయి, ఆ వాపులో, కైపులో సమాజాన్ని ఉద్దరించేందుకు అభివృద్ధి, సంక్షేమం పునాదిగా సరికొత్త రాజకీయాలు, పాలనను అందించేందుకు కంకణం కట్టుకున్నానని ప్రకటించిన జేడీ అదే రాజకీయ రొచ్చులో కూరుకుపోయాడనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. గత ఏడాది సీబీఐలో తన పదవికి రాజీనామా చేసిన జేడీ లక్ష్మీనారాయణ ‘వందేమాతరం’ లేదా ’జనధ్వని’ అనే పేరుతో కొత్త పార్టీ పెట్టాలని, జేఎన్‌టీయూ మాజీ వైస్ ఛాన్సులర్ రాజగోపాల్‌తో కలిసి తీవ్రంగా కసరత్తు చేశారు.
తర్వాత ఆరెస్సెస్ మహాసభలో జేడీ పాల్గొనడంతో ఆయన బీజేపీలో చేరబోతున్నారన‍్న ఊహాగానాలు వచ్చాయి. మరోవైపు ఫిబ్రవరిలో టీడీపీలే చేరేందుకు ఆహ్వానం అందుకున్నట్లు కథనాలు కూడా వచ్చాయి. వీటన్నిటిపై ఓ లుక్ వేసిన ఆయన చివరకు సామాజిక రాజకీయ అంశాల్లో గందరగోళ దృక్ఫథం కలిగిన జనసేన పార్టీలో చేరడంతో కాపు సామాజిక వర్గానికి చెందిన ఆయన రాజకీయ బాల్యరిష్టం అందరికీ అర్థమైపోయింది. కులం కుడితి తొట్లో ఆయన పడ్డారని పలువురు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.
సత్యం కంప్యూటర్స్, ఓవోంసీ, ఫోక్స్ వ్యాగన్, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అక్రమంగా బనాయించిన కేసులు, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సోహ్రబుద్దీన్, ఇష్రాత్ జహాన్ ఎన్‌కౌంటర్...కేసుల దర్యాప్తు చేసిన జేడీ చివరకు రాజకీయ చదరంగంలో పావుగా మారారు. కేంద్రంలో అధికార పార్టీ ఆదేశాలకు అనుగుణంగా ‘పంజరంలో చిలక’లాగా నడుచుకుంటుందన్న అపఖ్యాతి మూటగట్టుకుని, ఇప్పటికీ అనేక అంతర్గత వివాదాలతో అప్రతిష్ట పాలైన సీబీఐలో పనిచేసే ఒక ఉద్యోగి స్వతహా సంచలనాత్మక దాడులకు పాల్పడటం ఏ మేరకు సాధ్యమో అందరికి తెలిసిన విషయమే.
ప్రత్యర్థి రాజకీయ వర్గాలను తీవ్ర ఇబ్బందులు పాలు చేయాలనుకున్న సమయాల్లో అధికార పార్టీ కొందరు ఉన్నతాధికారులను సాధనాలుగా వినియోగించడంతో పాటు, దానికి అనుకూల మీడియాతో వారికి ఎక్కడలేని ప్రచారం తీసుకురావడం వల్ల ఆ అధికారులకు విపరీతమైన పేరు ప్రతిష్టలు రావడం దేశ చరిత్రలో అనేక ఉదంతాలు ఉన్నాయి. ఆ అవసరం తీరిపోయాక వారు గడ్డిపరకతో సమానంగా మారిపోవడం చూస్తునే ఉన్నాం. అలాంటి కోవలోనే జేడీ లక్ష్మీనారాయణ దేశవ్యాప్తంగా సంచలనాత్మక కేసులు అధికార పార్టీ ప్రోద్బలంతో చేపట్టి పాపులర్ అయ్యారు. గిరిగిరా తిరుగుతున్న కుమ్మరి అరె మీద ఎక్కి దానితోపాటే తిరుగుతున్న ఈగ తానే ఆ ఆరెను తిప్పుతున్నానని భ్రమించినట్లు జేడీ లక్ష్మీనారాయణ చేపట్టిన కేసులన్నీ తనవల్లను తెల్లారినట్లు, తన తెలివితేటలు, ఆదర్శాల వల్లే సంచలనాత్మకమైనాయని ఆయన భ్రమించడంలో ఆశ్చర్యమేమీ లేదు.
ఇక జరగబోయే ఎన్నికల్లో టీడీపీపై ఏర్పడిన వ్యతిరేకత ప్రతిపక్ష పార్టీ ఖాతాలోకి ఓట్లుగా జమ కాకుండా ఉండేందుకు, పవన్ కళ్యాణ్ సినిమా గ్లామర్‌ను వినియోగించుకొని వ్యతిరేక ఓట్లను జనసేన పార్టీకి మళ్లించడం ద్వారా తిరిగి అధికారంలోకి రావచ్చని చంద్రబాబు వ్యూహం. ఆ వ్యూహాన్ని సమర్థంగా అమలు చేస్తున్న పవన్‌తో కలిసి పనిచేయడమంటే కుల, మత, ముఠా రాజకీయాల రొచ్చులో జేడీ దిగబడటమే.13 జిల్లాల్లో రైతు సమస్యలపై అధ్యయన సమావేశాలు, సొంతపార్టీ పెట్టేందుకు హడావుడి, లోక్‌సత్తాకు కాయకల్ప చికిత్స చేసి పునర్జీవనం చేయబోతున్నట్లు పుకార్లు, బీజేపీ, టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు...వెరసి జేడీ చివరకు ఒక అసంబద్ధ, అర్థరాహిత్య పార్టీ పంచన చేరారు. రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖ నుంచి ఎంపీ బరిలో జనసేన అభ్యర్థిగా బరిలో ఉన్నారు.
‘ప్రశ్నిస్తా’ అంటూ అధికార పక్షాలను కాకుండా ప్రతిపక్షాలను ప్రశ్నించే విడ్డూరు రాజకీయ వేత్త పవన్ కల్యాణ్ నాయకత్వంలో జేడీ సమాజాన్ని బాగు చేసేందుకు ఏం చేయగలరో?. ఇక ఉత్తరాంధ్ర ముఖద్వారమైన విశాఖను ఉద్దరించే మొనగాడు అంటూ రాయలసీమకు చెందిన జేడీని ...పవన్ కల్యాన్‌ను ఆకాశానికి ఎత్తేయడం ఒక వైచిత్రి. కరువు కాటకాలతో అనేక సమస్యలు ఎదుర్కొంటున్న సీమ బిడ్డగా పుట్టిన జేడీ ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఎన్నడూ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు. రైతాంగ సమస్యలు, ఏపీ రాజధాని అమరావతి కోసం భూసేకరణ సమస్యలు, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ సమస్యలు, ప్రత్యేక హోదా సహా రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల కనీస అవగాహన లేని పవన్ మార‍్గదర్గకత్వంలో ‘రిల్ హీరో’ ప్రస్థానం వెనుక రాజకీయ వ్యూహం ఇప్పటికే తెల్లతేటమైంది.
మరోవైపు విశాఖపట్నాన్ని మరో సింగపూర్ చేస్తానంటూ ప్రగల్భాలు పలుకుతూ.. మందీమార్బలంతో హడావుడి చేసి కూడా.. నయాపైసా ఖర్చు కాకుండా నామినేషన్ వేశానని డబ్బా కొట్టుకుంటూ.. ప్రచారంలో నా స్టైలే వేరు అని బీరాలు పోతున్న జేడీ లక్ష్మీనారాయణ ...ఓ కుల పెద్దలతో రహస్య సమావేశాలు నిర్వహించడం నగర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. నాలుగు రోజుల కిందట నగరంలోని వాల్తేరు క్లబ్‌లో ఓ సామాజికవర్గానికి చెందిన 350 మందితో ఆయన సమావేశమయ్యారు. ఆ భేటీలో.. ‘నేను మీ ప్రతినిధిగా పోటీ చేస్తున్నాను.. విశాఖ ఎంపీ అభ్యర్థిగా మీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి అవకాశం వచ్చినట్టుగా భావించి పనిచేయండి..’ అని కోరినట్టు భోగట్టా. అదేవిధంగా ఇటీవల రుషికొండ సమీపంలో ఉన్న ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో కూడా ఇదే మాదిరి కుల ప్రతినిధులతో సమావేశమైనట్టు తెలుస్తోంది. దీంతో ఎన్నికల ముందే జేడీ అసలు రంగు బయటపడినట్లు అయింది.
Comments
Please login to add a commentAdd a comment