అభిమానులూ ఇంకాఎంత నష్టపోతారు.. మెగా అభిమాన సంఘం నేత | Pawan Kalyan Show Flop In Visakhapatnam Road Show | Sakshi
Sakshi News home page

జనసేనాని ఫ్లాప్‌ షో

Published Tue, Apr 9 2019 1:25 PM | Last Updated on Sat, Apr 13 2019 12:29 PM

Pawan Kalyan Show Flop In Visakhapatnam Road Show - Sakshi

పదేళ్ల రాజకీయ ప్రస్థానంలో అన్నీ తప్పటడుగులే వేసిన పవన్‌కల్యాణ్‌కు జనసేన పార్టీ పెట్టిన తర్వాత సినిమా రంగంలోనూ ’సీన్‌’ తగ్గిపోయిందా?..అవును..ఐదేళ్ల ఆయన సినీ గ్రాఫ్‌ చూస్తే తగ్గిపోయిందని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే.2014లో జనసేన పెట్టిన తర్వాత ఆయనకు సినిమాల్లో ఒక్కటంటే ఒక్క హిట్టు కూడా పడలేదు.రూ.కోట్ల పారితోషకం వదిలి ప్రజల కోసం వచ్చానని చెబుతున్న పవన్‌ కల్యాణ్‌ ..  మొత్తంగా రాజకీయాల్లోకి వచ్చిన ఈ పదేళ్ల సినిమా ట్రాక్‌ చూసినా.. నిర్మాతలకు పూర్తిస్థాయి లాభాలు తెచ్చిన సినిమాలు రెండే రెండు..

ఇక జనసేన పెట్టిన ఈ ఐదేళ్లలో ఒక్క నిర్మాత.. ఒక్క బయ్యర్‌ అయినా పవన్‌ వల్ల లాభపడలేదు. ఎక్కువ రేట్లకు మీ సినిమా కొని రోడ్డునపడ్డాం.. ఆదుకోవాలని బయ్యర్లు ధర్నా చేసినా పవన్‌ పట్టించుకోలేదు.
సినిమా ఎలా ఉన్నా.. మొదటి రెండురోజుల్లో కలెక్షన్లు కొల్లగొట్టేద్దామని ఇటు ఏపీ సీఎం చంద్రబాబును.. అటు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిసి అదనపు షోల కోసం అనుమతులు తెచ్చుకున్నా హిట్టు కొట్టని పవన్‌.. తాను సినిమాలు వదిలి ప్రజల కోసమే వచ్చానని చెబుతున్న మాటలు ప్రగల్భాలేనని చెప్పడానికి ఇంకేమైనా అనుమానముందా.. అయితే ఒక్కసారి ఆయన  పదేళ్ల సినిమా ట్రాక్‌ రికార్డు చూద్దాం రండి... – గరికిపాటి ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం

రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పవన్‌కల్యాణ్‌ వేసిన తప్పటడుగుల గురించి చెప్పాలంటే చాంతాడంత ఉంది. పదేళ్ల కిందట ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో ఆయన వల్లించిన డైలాగులు, ఐదేళ్ల కిందట జనసేన పార్టీ పెట్టినప్పుడు పేల్చిన ఆవేశపూరిత మాటలు.. ఇప్పుడు తాజా ఎన్నికల్లో ఆయన విన్యాసాలు..  దేనికీ ఎక్కడా పొంతనలేదు. సరే ఆ విషయాలను వదిలేసి  రూ.కోట్ల ఆదాయం ఉన్న సినిమా రంగాన్ని వదిలేసి వచ్చానని చెప్పుకుంటున్న పవన్‌కల్యాణ్‌ ఇమేజ్‌ ఆ రంగంలోనూ మసకబారిందనే పరిస్థితి ఉంది.  ఇందుకు ఉదాహరణగా జనసేన పెట్టిన తర్వాత ఒక్క సినిమా కూడా హిట్టవ్వలేదనే విషయాన్ని సినీ, రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.

ఆ ‘ఖుషీ’ని జావగార్చిన జానీ
2001లో ఖుషీ కొట్టిన ఇండస్ట్రీ హిట్‌తో ఓరకంగా అన్నయ్య చిరంజీవి ఇమేజ్‌ను దాటేసినట్టు కనిపించిన పవన్‌కల్యాణ్‌కు వెంటనే జానీ రూపంలో డిజాస్టర్‌ తగిలింది. ఆ తర్వాత అన్ని ఫ్లాప్‌లు, యావరేజ్‌ సినిమాలు.. గుడుంబాశంకర్, బాలూ, అన్నవరం, బంగారం, శంకర్‌దాదా జిందాబాద్‌లో అతిథిపాత్ర వంటి వాటితోనే  నెట్టుకొచ్చారు. 2008లో జల్సా సినిమా ఓ మాదిరిగా ఆడినా.. అటు బయ్యర్లకు, ఇటు అభిమానులకు పూర్తిస్థాయి సంతృప్తినివ్వలేదు.  2009లో ప్రజారాజ్యం పెట్టినప్పుడు యువరాజ్యం అధ్యక్షుడిగా హల్‌చల్‌ చేసిన పవన్‌కు రాజకీయంగా చేదు అనుభవంతో పాటు ఆ తర్వాత వరుసగా మూడు సినిమాలు.. కొమరం పులి, పంజా, తీన్‌మార్‌ అట్టర్‌ ఫ్లాపై ఓ విధంగా ఆయనపై అభిమానుల్లో సానుభూతి పెరిగేంతటి పరిస్థితిని తీసుకొచ్చాయి. సరిగ్గా ఆ సమయంలో వచ్చిన గబ్బర్‌సింగ్‌ సూపర్‌ డూపర్‌ హిట్‌ అయింది. అటు తర్వాత  కెమెరామెన్‌ గంగతో రాంబాబు సినిమాతో మళ్లీ ఫ్లాప్‌ పలకరించినా.. ఆ వెంటనే వచ్చిన అత్తారింటికి దారేది సినిమా రికార్డులు సృష్టించింది.

ఆ ఇమేజ్‌ తెరపైనే జనసేన
అత్తారింటికి దారేది సినిమా ఇమేజ్‌తోనే హడావుడిగా హైదరాబాద్‌లోని స్టార్‌ హోటల్‌లో జనసేన పార్టీ పెడుతున్నట్టు ప్రకటించిన పవన్‌కల్యాణ్‌.. ఆనక పోటీ చేయనని ప్రకటించి చివరికి చంద్రబాబుకు మద్దతివ్వాలని, ఆయనకు ఓటేస్తే నాదే పూచీ అని అభిమానులను రెచ్చగొట్టారు. అటు తర్వాత నాలుగున్నరేళ్లు చంద్రబాబునే సమర్ధించారు. సరిగ్గా ఎన్నికలకు ఆర్నెల్ల ముందు నుంచి ఓట్లు చీల్చే లక్ష్యంతో హడావుడి చేస్తున్నారు. సరే ప్రస్తుతానికి ఈ విషయం వదిలేసి జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఆయన సినీ ట్రాక్‌ రికార్డు చూస్తే ఒక్కటంటే ఒక్క సినిమా కూడా హిట్‌ అవలేదని స్పష్టమవుతుంది.

ఐదేళ్లలో అన్నీ డిజాస్టర్లే
2014 ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబుతో ఆలింగనాలు, ఆయన ఇంటికి వెళ్లి డిన్నర్‌లు.. రాజకీయ తెరపై అడపాదడపా హడావుడి నేపథ్యంలోనే 2015లో గోపాల గోపాల సినిమా వచ్చింది. ’విక్టరీ’ వెంకటేష్, పవన్‌కల్యాణ్‌ ప్రధాన పాత్రధారులుగా వచ్చిన ఈ సినిమాలో ఏకంగా పవన్‌ తన అభిమానులు ముద్దుగా పిలుచుకునే దేవుడు పాత్రనే పోషించారు. కానీ ఆ సినిమా బిలో యావరేజ్‌ ఫలితాన్నే ఇచ్చింది. ఆ తర్వాత తనను మళ్లీ హిట్‌ ట్రాక్‌ ఎక్కించిన గబ్బర్‌సింగ్‌ సినిమా టైటిల్‌తోనే సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ సినిమా చేశారు. అది అట్టర్‌ ఫ్లాఫ్‌ అయింది. ఈ సినిమా విషయంలో దర్శకుడు సంపత్‌నందిని ఇబ్బందిపెట్టిన విషయం సినీపరిశ్రమలో అందరికీ తెలుసు. ఆరెంజ్‌ సినిమాతో ఓ రేంజ్‌ ఫ్లాప్‌ తగిలి షాక్‌లో ఉన్న మెగా పవర్‌ స్టార్‌ చరణ్‌ను రచ్చ సినిమాతో హిట్‌ ట్రాక్‌ ఎక్కించిన డైరెక్టర్‌గా సంపత్‌ నంది ఒక్కసారి వెలుగులోకి వచ్చారు. దీంతో ఆయన్నే సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌ డైరెక్టర్‌ అని పవన్‌ ప్రకటించారు. ఆ మేరకు సంపత్‌ నంది ఏడాదిపాటు కష్టపడి.. వేరే సినిమాలను కూడా వదిలేసి సర్దార్‌ గబ్బర్‌సింగ్‌పై స్క్రిప్ట్‌ రెడీ చేశారు. కానీ  చివరికి ఆయన్ని పక్కన పెట్టేసి డైరెక్టర్‌ బాబీకి అప్పజెప్పారు.

ఏతావాతా ఆ సినిమా అట్టర్‌ ఫ్లాప్‌ అవడంతో బయ్యర్లు తీవ్రంగా నష్టపోయారు. కాస్త ఆదుకోవాలని డిస్ట్రిబ్యూటర్లు కలిసేందుకు వెళ్ళినా పవన్‌ దర్శనం కూడా ఇవ్వలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక ఆ తర్వాత వచ్చిన కాటమరాయుడు సినిమాదీ అదే పరిస్థితి. తమిళ స్టార్‌ హీరో అజిత్‌ సినిమాకు రీమేక్‌గా వచ్చిన ఆ సినిమా డిజాస్టర్‌ అయింది. ఇక ఎన్నికల ముందు సినిమాగా అజ్ఞాతవాసి వచ్చింది. అత్తారింటికి దారేది సినిమాతో ఇండస్ట్రీ హిట్‌ ఇచ్చిన డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించడంతో ఈ సినిమా కచ్చితంగా హిట్‌ అవుతుందని ఆశించి బయ్యర్లు ఎగబడి మరీ ఎక్కువ రేటు పెట్టి కొనుగోలు చేశారు. ఈ సినిమా మొదటి, రెండురోజుల కలెక్షన్స్‌ కోసం ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతినివ్వాలంటూ స్వయంగా పవన్‌ కల్యాణ్‌ ఇటు ఏపీ సీఎం చంద్రబాబును, అటు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఆ మేరకు అనుమతులు తెచ్చుకున్నారు. కానీ ఏం ప్రయోజనం.. అజ్ఞాతవాసి అట్టర్‌ఫ్లాప్‌ దెబ్బకు చాలామంది బయ్యర్లు చితికిపోయారు. సగానికి సగం డబ్బులు కూడా రాని పరిస్థితిలో కొట్టుమిట్టాడారు. ఆ సినిమా తర్వాత కొన్నాళ్ళు రెస్ట్‌ తీసుకున్న పవన్‌ తర్వాత క్రియాశీల రాజకీయాల పేరిట హల్‌చల్‌ చేస్తూ వస్తున్నారు.

అభిమానుల సంగతీ అంతే..
సరిగ్గా ఇప్పుడు విశాఖలోని రాజకీయ పార్టీల నేతలు ఇవే విషయాలను గుర్తు చేసి.. అభిమానులు ఆలోచించాలని కోరుతున్నారు. మొత్తంగా 2001 నుంచి ఖుషీ తర్వాత ఈ 18 ఏళ్లలో రెండే రెండు సినిమాలతో బయ్యర్లకు పూర్తిస్థాయి లాభాలు తీసుకొచ్చి.. మిగిలిన  సినిమాలతో.. అలా అలా నెట్టుకొచ్చిన పవన్‌.. అభిమానుల కోసం ఏమీ త్యాగం చేయలేదని అంటున్నారు.

వద్దు.. పవన్‌ను నమ్మొద్దు
సినీమోజుతో అభిమానులు రాజకీయంగా పవన్‌ను నమ్మొద్దని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విశాఖ పార్లమెంటు అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ కోరారు. ‘నేను కూడా సినిమాలు నిర్మించాను, పలు సినిమాల్లో నటించాను.. సినీరంగంలో ఉన్నప్పుడు అభిమానులకే కాదు.. బడా బడా నిర్మాతలకు కూడా పవన్‌ దర్శనం దొరికేది కాదు. ఇప్పుడు ఎన్నికలైన తర్వాత కూడా అంతే.. పొరపాటున పవన్‌ ఎన్నికల్లో బయటపెడితే ఎవ్వరికీ అందుబాటులో ఉండరు. ఎక్కడుంటారో కూడా తెలియదు. సినీ అభిమానం వేరు.. ప్రజాసేవ వేరు..  వెర్రి అభిమానం ఉంటే సినిమాలు చూద్దాం.. అంతే కానీ విలువైన ఓటు మాత్రం పవన్‌కు వద్దు’.. అని ఆయన పిలుపునిచ్చారు. పదేళ్లుగా  ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ను అకారణంగా, అన్యాయంగా ఆడిపోసుకున్న పవన్‌ కల్యాణ్‌కు బుద్ధి చెప్పాలంటే గాజువాకలో ఆయన్ను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.– ఎంవీవీ సత్యనారాయణ,వైఎస్సార్‌సీపీఎంపీ అభ్యర్థి

అభిమానులూ ఇంకాఎంత నష్టపోతారు
అభిమానులూ.. ఇప్పటికే సినీ మోజుతో చాలా నష్టపోయారు.. రాజకీయాల్లో కూడా మీతో జెండాలు మోయించి సీట్లు మాత్రం ఇవ్వలేదు.. సినిమా అభిమానం రాజకీయాల్లో చూపించకండి. ఇంకా ఎన్నాళ్లు నష్టపోతారు.. అని మెగా ఫ్యామిలీ అభిమాన సంఘం నేత ఎం.రాఘవరావు సూచించారు. సినీ అభిమానాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్న వారికి బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.
– ఎం.రాఘవరావు,మెగా ఫ్యామిలీ అభిమాన సంఘం నేత

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement