
విశాఖ సిటీ/సాక్షి, విజయవాడ: ప్రజా సంక్షేమం, అభివృద్ధిలో బీజేపీ, కాంగ్రెస్ రెండూ విఫలమైన పార్టీలుగా ప్రజలు గుర్తించారనీ, ఇక ప్రత్యామ్నాయ జాతీయ పార్టీగా బీఎస్పీ ఒక్కటే ఉందని పార్టీ అధినేత్రి మాయావతి వ్యాఖ్యానించారు. జనసేన కూటమితో బీఎస్పీ పొత్తు నేపథ్యంలో ఎన్నికల ప్రచారం కోసం విశాఖ వచ్చిన మాయావతితో కలసి పవన్ కల్యాణ్ బుధవారం మీట్ ది ప్రెస్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాయావతి మాట్లాడుతూ.. దేశ ప్రజల సమస్యలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆరోపించారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి న్యాయం జరగలేదన్నది అందరూ అంగీకరించాల్సిన వాస్తవమని అన్నారు. ప్రత్యేక హోదా హామీని నెరవేర్చకుండా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజల్ని మోసం చేశాయని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే ఏపీకీ ప్రత్యేక హోదా ఇస్తామని వెల్లడించారు. ఏపీ ప్రజలు చంద్రబాబు, జగన్ వలలో పడవద్దనీ, పవన్ వంటి కొత్త నాయకత్వాన్ని ఆదరించాలని కోరారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. దేశమంతా మోదీపై వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్నారు. జనసేన, బీఎస్పీ, వామపక్షాల కూటమితోనే ప్రజలకు ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు పవన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు.
జగన్, మోదీ వృథా చేసేది ప్రజాధనమే...
అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలోకి వస్తే హోదా ఇస్తామన్న మాయావతికి ధన్యవాదాలు తెలిపారు. మాయావతి విగ్రహాల వ్యవహారం ప్రజాధనం వృథా అన్నప్పుడు.. వేల కోట్ల స్కాములు చేసిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, రూ.10 లక్షల సూట్ వేసుకున్న ప్రధాని నరేంద్రమోదీ వృథా చేసేది ప్రజాధనమేనన్నారు. సర్దార్ వల్లభబాయ్ పటేల్ విగ్రహం విషయంలో ప్రధానిని అడగాల్సిన అవసరం ఉందన్నారు. బీఎస్పీతో కలవాలని మేధావులు, దళిత నేతలు కోరడంతో వారి సూచనల మేరకు బీఎస్పీతో కలిసి పోటీ చేస్తున్నామన్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకున్నానంటూ వైఎస్సార్‌సీపీ నేతలు, సాక్షి పత్రిక రోజూ చెబుతున్నాయనీ, ఈ లెక్కన నన్ను రాజకీయ నాయకుడిగా గుర్తించినందుకు జగన్‌కు ధన్యవాదాలన్నారు. బాబు, జగన్ గురించి మాట్లాడినప్పుడు స్కామాంధ్ర వస్తుందన్న ప్రధాని.. నా గురించి మాట్లాడినప్పుడు మాత్రం దేశభక్తుడన్నారన్న విషయాన్ని గుర్తెరగాలన్నారు.
రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యం
ఉత్తర ప్రదేశ్‌లో మాయవతి సీఎంగా వున్నప్పుడు రౌడీయిజాన్ని అణచివేశారని, ఇప్పుడు మన రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమయ్యాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. విజయవాడలో జరిగిన సభలో మాట్లాడుతూ అల్లరి మూకలు, రౌడీలు ఉన్న యూపీనీ మాయవతి అభివృద్ధిలోకి తీసుకువచ్చారన్నారు. టీడీపీ, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు తప్పుచేస్తే ఖండించలేని స్థితిలో ఆ పార్టీ అధినేతలు ఉన్నారని విమర్శించారు.